Adivasi farmers
-
విప్పపువ్వు.. గిరిజనుల కల్పతరువు
బుట్టాయగూడెం: ఆదివాసీ గిరిపుత్రులకు అక్కడ లభించే ఉత్పత్తులు జీవనాధారం కల్పిస్తున్నారు. అడవిలో లభించే అటవీ ఉత్పత్తులు సేకరించి వాటిని విక్రయిస్తూ ఉపాధి పొందుతుంటారు. కొందరు అడవిలో ఉండే వెదురుతో బుట్టలు, చాటలు వంటివి నైపుణ్యంలో తయారు చేసి విక్రయిస్తారు. మరి కొందరు తేనె సేకరణ, తునికాకు, అడ్డాకుతో పాటు పలు రకాల ఉత్పత్తులు సేకరిస్తారు. కాలానికి అనుగుణంగా ఉపాధిని ఇచ్చే వృక్షాల్లో ఇప్పచెట్లు ప్రధానమైనవి. వేసవిలో వీటి ద్వారా గిరిజనులు ఉపాధి పొందడానికి అనేక అవసరాలు ఉన్నాయి. విప్పపువ్వును గిరిజనులు తెల్లవారుజామునే అడవిలోకి వెళ్ళి సేకరిస్తారు. తెల్లవారుజామున చెట్లపై నుండి కిందపడిన ఇప్పపువ్వును మధ్యాహ్నానికి సేకరించి ఇంటికి తెచ్చి ఎండబెడతారు. మూడు నెలల పాటు ఉపాధి మన్యం ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు విప్పచెట్ల ద్వారా మూడు నెలల పాటు ఉపాధి దొరుకుతుంది. ఖరీఫ్, రబీ పనులు ముగిసే సమయానికి విప్ప చెట్లు విరగపూస్తాయి. వీటి పువ్వులు గాలికి నేలరాలుతుంటాయి. ఈ పువ్వులను గిరిజనులు సేకరిస్తారు. వీటితోపాటు మొర్రి పండ్లు సేకరించి ఇంటికి తీసుకువస్తుంటారు. వీటిని సేకరించి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విక్రయించి ఉపాధి పొందుతుంటారు. విప్పపువ్వుతో ఔషధాలు తయారీ గిరిజనులు సేకరించిన ఇప్పపువ్వును జీసీసీల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. ఇప్పపువ్వులో ఎన్నెన్నో ఔషధ విలువలు ఉండడంతో ఈ పువ్వును ఔషధాల తయారీకి విక్రయిస్తారు. ఇప్పపువ్వు నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు. విప్పపువ్వుతో దంతాలను శుభ్రం చేసుకోవడంతో దగ్గుకు, దంతాలకు సంబంధించిన వ్యా«ధులుకు ఔషధంగా పనిచేస్తుంది. సచ్ఛమైన విప్పపువ్వుతో తయారు చేసిన సారాను సేవిస్తే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని గిరిజనులు అంటున్నారు. వైద్యశాస్త్రంలోనూ ప్రాధాన్యం వైద్యశాస్త్రంలోనూ విప్పపువ్వు ప్రాధాన్యతను సంపాదించుకుంది. అడవిలో లభించే ఇప్పపువ్వుల గింజల నుంచి తీసిన నూనెలో ఎన్నో పోషక విలువలున్నట్లు శాస్త్రీయంగా నిరూపించారు. భారత శాస్త్రీయ సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయంతో 1999లో నిర్వహించిన పరిశోధనలో ఎండిన ఇప్పపువ్వుల నుంచి పంచదారను తయారు చేసి జామ్, కేక్‌లు, చాక్లెట్లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. విప్పపువ్వు ఎక్కువకాలం నిల్వ ఉండడానికి మధ్యమధ్యలో ఎండిన వేప ఆకును వేస్తే నిల్వ ఉంటుందని తెలుసుకున్నారు. పశ్చిమ మన్యంలో 20 వేలకు పైగా విప్ప చెట్లు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంతో పాటు పాపికొండల అభయారణ్యంలో ఇప్పచెట్లు దాదాపుగా 20 వేలకు పైగా ఉండవచ్చని అంచనా. ముఖ్యంగా బుట్టాయగూడెం మండలం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఈ ఇప్పచెట్లు ఆధికంగా ఉన్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 5 వేల చెట్ల వరకూ అటవీప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో నాటి వాటిని పెంచుతున్నారు. గిరిజనులు సేకరించిన ఈ ఇప్పపువ్వులను జీసీసీ అధికారులే కాదు బయటి నుండి అనేక మంది వ్యాపారులు కూడా కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు. ఇప్పపువ్వులో పోషకాలు ఎక్కువగా ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నట్లు గిరిజనులు చెప్తున్నారు. ప్రస్తుతం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గుత్తుకోయలు, బుట్టాయగూడెం మండలంలో కొండరెడ్లు ఈ పువ్వులను సేకరిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. 5 వేల ఇప్ప మొక్కలు నాటాం పశ్చిమ అటవీ ప్రాంతంలో సహజ సిద్ధంగా పెరిగిన ఇప్పచెట్లే కాకుండా అడవిలో ఉండే ఖాళీ ప్రదేశాల్లో సుమారు 5 వేల వరకూ విప్పమొక్కలను నాటి పెంచుతున్నాం. ఇప్పచెట్ల నుంచి వచ్చే పువ్వుల ద్వారా గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో గుత్తుకోయలు, బుట్టాయగూడెం మండలాల్లో కొండరెడ్లు ప్రస్తుతం విప్పపువ్వు సేకరణలో ఉపాధి పొందుతున్నారు. – దావీదురాజు నాయుడు,అటవీ శాఖ డీఆర్ఓ, పోలవరం జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి మా గ్రామ సమీపంలోని అడవుల్లో విప్పపువ్వుతోపాటు పలు ఉత్పత్తులు లభిస్తున్నాయి. విప్పపువ్వుతోపాటు పలు ఉత్పత్తులను గతంలో కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం జీసీసీ అధికారులు ఇప్పపువ్వు కొనుగోలు చెయ్యడంలేదు. ప్రస్తుతం ఇప్పపువ్వు సీజన్ ప్రారంభమవుతుంది. జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్నాం. – కెచ్చెల బాలిరెడ్డి, కొండరెడ్డి గిరిజనుడు– మోదేలు -
ఆదివాసీ రైతు.. అభివృద్ధి పథంలో సాగుతూ..
బుట్టాయగూడెం(ఏలూరు జిల్లా): పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు ఎటువంటి రసాయనాలను వినియోగించకుండా ఆరోగ్యవంతమైన పంటలు పండించేలా కృషి చేస్తున్న ఆదివాసీ జీడిమామిడి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సీఈఓ సోడెం ముక్కయ్యను వైఎస్సార్ అచీవ్మెంట్ పురస్కారం వరించింది. గిట్టుబాటు ధరతో పాటు నేరుగా పంటలను విక్రయించుకునేలా రైతులకు తోడ్పాటునందించేలా గురుగుమిల్లిలో 2019లో నాబార్డు సహకారంతో ఆయన ఆదివాసీ జీడిమామిడి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ను ఏర్పాటుచేశారు. అలాగే ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఆదివాసీ జీడిమామిడి ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పారు. ఆయా సంస్థల ద్వారా ఏటా లక్షలాది రూపాయల అమ్మకాలు చేస్తున్నారు. దీంతోపాటు 200 ఎకరాల్లో జీడిమామిడి పంటలను ప్రోత్సహించడంతోపాటు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల ద్వారా రైతులు పంటలు పండించేలా ముక్క య్య కృషి చేస్తున్నారు. ప్రస్తుతం వీరి సంస్థలో 714 మందికి పైగా రైతులు పనిచేస్తున్నారు. వ్యవసా యాభివృద్ధి లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది గురుగుమిల్లి వంటి మారుమూల గ్రామంలో పనిచేస్తున్న నేను వైఎస్సార్ సాఫల్య పురస్కారానికి ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ గుర్తింపుతో మరింత బాధ్యత పెరిగింది. గిరిజన ప్రాంతంలో వ్యవసాయాభివృద్ధికి మరింత కృషి చేస్తా. – సోడెం ముక్కయ్య -
భారతీయులు ఆత్మ విశ్వాసం కోల్పోరు
సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత కఠిన పరిస్థితులు ఎదురైనా సరే భారతీయులు ఆత్మవిశ్వాసం కోల్పోరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ మేరకు సంపూర్ణ శక్తియుక్తులతోపాటు అకుంఠిత దీక్షతో కరోనా సవాలును అధిగమించగలరని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు సరైన అవగాహన కల్పించడంతోపాటు పారిశుద్ధ్యం, పరిశుభ్రత దిశగా పంచాయతీ పాలన మండళ్లు తగు చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ కోరారు. ‘‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’’(పీఎం–కిసాన్) పథకం కింద ప్రధాని మోదీ శుక్రవారం 9.50 కోట్ల మందికి పైగా రైతులకు 8వ విడతగా రూ.20,667 కోట్లను విడుదల చేశారు. వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ పీఎం–కిసాన్ కింద ఇప్పటి వరకు 1.35 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని పలువురు రైతులతో కాసేపు ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో 170 మంది ఆదివాసీ రైతులకు వ్యవసాయంలో మార్గదర్శనం చేస్తున్న ఎన్.వెన్నూరమ్మ కృషిని ప్రధాని అభినందించారు. ‘‘ఈ పథకం కింద పశ్చిమ బెంగాల్ రైతులు 7.03 లక్షల మంది తొలిసారి లబ్ధి పొందనున్నారు. ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల్లో కూడా ఆహార ధాన్యాలు, ఉద్యాన పంటలను రికార్డు స్థాయిలో పండించిన రైతుల కృషి అభినందనీయం. వారికి శ్రమకు ఫలితం దక్కేవిధంగా ప్రభుత్వం కూడా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో పంటల కొనుగోళ్లలో ఏటా కొత్త రికార్డులు çసృష్టిస్తోంది. ‘ఎంఎస్పీ’తో ధాన్యం సేకరణలో కొత్త రికార్డు నెలకొనగా, గోధుమ కొనుగోళ్లు కూడా కొత్త రికార్డుల దిశగా సాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకూ ‘ఎంఎస్పీ’తో కొనుగోళ్లు 10 శాతం అదనంగా నమోదయ్యాయి. వ్యవసాయంలో కొత్త సాధనాలు, సరికొత్త మార్గాలను రైతులకు చేరువ చేయడం కోసం ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కూడా ఇందులో భాగమే. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ‘కిసాన్ క్రెడిట్ కార్డు’ల గడువును పొడిగించనున్నాం. తదనుగుణంగా వాయిదాల చెల్లింపు గడువును జూన్ 30దాకా పెంచే వీలుంటుంది. శతాబ్దానికోసారి దాపురించే మహమ్మారి మన కళ్లకు కనిపించని శత్రువులా నేడు ప్రపంచానికి సవాళ్లు విసురుతోంది. కోవిడ్–19 మహమ్మారిపై ప్రభుత్వం సర్వశక్తులూ కూడదీసుకుని పోరాడుతోంది. ప్రజల కష్టాలు తీర్చడానికి భరోసా ఇస్తూ ప్రభుత్వంలోని అన్ని శాఖలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి’అని ప్రధాని తెలిపారు. కాగా, పశ్చిమబెంగాల్ రైతుల బ్యాంకు ఖాతాల్లో మొట్టమొదటి సారిగా పీఎం కిసాన్ నిధులు రూ.2 వేలు జమ అయ్యాయి. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ కేంద్రం, బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య విభేదాల కారణంగా ఆ రాష్ట్ర రైతులకు ఈ పథకం అమలు కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలను మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. అందరూ టీకా వేయించుకోండి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విజృంభించడంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి 2.60 లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుందని తెలిపారు. వేగంగా కోవిడ్ టీకా వేసే దిశగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాయని ప్రధాని అన్నారు. ‘ప్రతి ఒక్కరూ పేరు నమోదు చేసుకుని, టీకా వేయించుకోవాలి. టీకా వేసిన తర్వాత కూడా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్ నియంత్రణ విధానాలను తప్పనిసరిగా కొనసాగించాలి. కరోనాపై పోరాటంలో ఈ టీకా అత్యంత కీలక ఆయుధం, దీనివల్ల తీవ్ర ముప్పు తప్పుతుంది’’అని ప్రధాని తెలిపారు. -
ఆదివాసి, లంబాడీల మధ్య చిచ్చు పెట్టింది వాళ్లే
భద్రాద్రి కొత్తగూడెం : అడవి మీద గిరిజనులకు హక్కు లేదనటం అవివేకమని, ప్రభుత్వ పెద్దలే ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చు పెట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపడటం లేదని ప్రశ్నించారు. అఖిల పక్షం ఎందుకు నిర్వహించటం లేదని అడిగారు. ఇలాంటి గొడవలు పాలక వర్గాలకు లాభమేనని, గతంలో మాల, మాదిగల మధ్య చిచ్చు రేపారని గుర్తు చేశారు. ఆదివాసీ, లంబాడీల మధ్య సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్‌ను ఎందుకు చట్టంగా మార్చటం లేదో చెప్పాలన్నారు. రాష్ట్రంలో పాలన ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, ఈ పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. గిరిజనుల పోడు భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం కావాలని సీపీఎం కోరుతుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ గద్దె దించటమే లక్ష్యంగా సీపీఎం ఉద్యమాలు చేస్తుందని వ్యాఖ్యానించారు. -
ఆదివాసుల పెన్నిధి ‘పెద్ద జొన్న’!
- ఆదిలాబాద్ సంప్రదాయ జొన్న రకాల్లో రారాజు ‘పెద్ద జొన్న’ - అధిక పోషక విలువలతో కూడిన జొన్నలతో పాటు.. బలవర్ధకమైన చొప్పనూ పుష్కలంగా అందించే అపురూప వంగడం - ఐదేళ్లుగా తిరిగి సాగు చేసుకొని తింటున్న రాజ్‌గోండ్ ఆదివాసీ రైతులు - మైదాన ప్రాంత రైతులకూ అనువైనదేనంటున్న శాస్త్రవేత్తలు రైతు కుటుంబానికి రుచికరమైన, పుష్టికరమైన ఆహారాన్ని.. పశువులను బలిష్టంగా ఉంచే ఇంపైన గడ్డిని సమృద్ధిగా అందించే పంటే ఆదివాసుల దృష్టిలో మంచి పంట కింద లెక్క. సంప్రదాయ జొన్న రకాలు ఎన్ని ఉన్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో రాజ్ గోండ్ ఆదివాసీల దృష్టిలో ‘పెద్ద జొన్న’ (పెర్స జొన్న)కు మించినది లేదు. కొండ ప్రాంతాల్లో తరతరాలుగా సాగులో ఉన్న ఈ అపురూప వంగడం కాలక్రమంలో కనుమరుగైన పరిస్థితుల్లో ఐదేళ్లుగా ‘పెద్ద జొన్న’ మళ్లీ ఆదివాసీ రైతుల పొలాల్లోకి, కంచాల్లోకి వచ్చింది. అమ్మటం కోసం కాకుండా.. ఇంట్లో వాళ్లంతా తినడం కోసం మాత్రమే కొద్ది విస్తీర్ణంలో పెద్ద జొన్నను వారు సాగు చేసుకుంటున్నారు. దీని చొప్ప గొప్ప రుచిగా ఉండడంతో ఎద్దులు, ఆవులు కూడా తృప్తిగా తిని సత్తువను పెంచుకుంటున్నాయి. నాగోబా జాతరలో బండి లాగుడు పోటీల్లో తమ యజమానులను విజేతలుగా నిలబెడుతున్నాయి. చిరుధాన్యాలపై మళ్లీ ఆసక్తి పెరుగుతున్న ప్రస్తుత కాలంలో మార్కెట్లోనూ మంచి గిరాకీ ఉన్న పెద్ద జొన్న సాగు ఏ ప్రాంత రైతులకైనా ప్రయోజనకరమైనదే.. సారవంతమైన పొలాలు, పుష్కలమైన వర్షపాతం కలిగిన ఆదిలాబాద్ జిల్లాను పత్తి, సోయా వంటి వాణిజ్య పంటలు చుటుముట్టక ముందు గిరిజనులు తమ సంప్రదాయ పంటలనే పండించుకునేవారు. అందువల్లనే ఆ జిల్లాలో పంటల జీవవైవిధ్యం చాలా ఎక్కువ. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా వాణిజ్య పంటల ధాటికి సంప్రదాయ పంటలు కనుమరుగయ్యాయి. ఈ నేపథ్యంలో సిరికొండ మండలం మల్లాపూర్‌కు చెందిన రాజ్ గోండ్ గిరిజన రైతులు పాతకాలం నాటి ‘పెద్ద జొన్న’ (పెర్స జొన్న)ను మళ్లీ సాగులోకి తెచ్చుకున్నారు. గత ఐదేళ్లుగా ప్రతి ఏడాది రబీ సీజన్లో పెద్ద జొన్నను వారు సాగు చేస్తున్నారు. తాము పండించిన పంటకు మార్కెట్లో అధిక ధర పలుకుతున్నప్పటికీ విక్రయించకుండా తమ ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవటం విశేషం. మదురైకి చెందిన స్వచ్ఛంద సంస్థ ధన్ ఫౌండేషన్, మల్లాపూర్ రైతులకు విత్తనాలు ఇచ్చి పెద్ద జొన్న సాగు పునరుద్ధరణను ప్రోత్సహించింది. ఆ తరువాత క్రమంగా పక్క గ్రామాలకు దీని సాగు విస్తరించింది. 6 నెలల పంట.. మల్లాపూర్ గ్రామంలో 95 గిరిజన రైతు కుటుంబాలున్నాయి. ఆ గ్రామంలోని ప్రతి రైతు ఎకరం పొలంలో పెద్ద జొన్నను సాగు చేస్తున్నారు. ఇక్కడి నల్లరేగడి భూముల్లో ఖరీఫ్ పంటగా పత్తి, సోయా సాగు చేస్తున్నప్పటికీ.. రబీ పంటగా పెద్ద జొన్నను సాగు చేస్తున్నారు. ముందటేడాది పండిన జొన్నలను తీసిపెట్టుకొని తర్వాత విత్తనంగా వాడుకుంటున్నారు. ఎకరాకు మూడు కిలోల విత్తనం సరిపోతుంది. ఆకు ఈనె తెలుపు రంగులో ఉంటుంది. గింజ లేత పసుపు రంగులో మెరుస్తూ ఉంటుంది. పంటకాలం ఆరు నెలలు. ఏటా నవంబర్‌లో ఈ పంటను విత్తుకుంటారు. రబీ పంటకు రెండు తడులు దుక్కిలో చివికిన పశువుల ఎరువు తప్ప ఎలాంటి ఇతర ఎరువులు వేయరు. చీడపీడలు ఆశించకపోవటం వల్ల పురుగు మందులు చల్లరు. దీనివల్ల రైతుకు ఖర్చు తగ్గటమే గాక పెద్దగా పంటను పర్యవేక్షించాల్సిన అవసరమూ తప్పింది. రబీ నీటి ఎద్దడికి పెద్ద జొన్న సాగును సమర్థ పరిష్కారంగా చెప్పవచ్చు. విత్తనాలు వేసినప్పుడు మొలకెత్తేందుకు, కంకి దశలో గింజ పోసుకునేందుకు రెండుసార్లు నీటి తడులు ఇస్తే చాలు. పంట చేతికొస్తుంది. కిందికి వంగి ఉండే పెద్ద జొన్న కంకి.. హైబ్రిడ్ జొన్న సాగులో పొలానికి వారం వారం తడులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి పిట్టలు, చిలుకల బెడద కూడా ఎక్కువే. అయితే పెద్ద జొన్నలో మాత్రం కంకులు కిందకు వంగి ఉండటం వల్ల పక్షుల బెడద ఉండదు. పెద్ద జొన్న సాగులో స్వంత విత్తనాన్ని వాడటం, ఎరువులు, పురుగుమందులు వాడకపోవటం వల్ల రైతుకు ఖర్చు కాదు. పెద్ద జొన్న చొప్పంటే పశువులకు ఇష్టం హైబ్రిడ్ రకాల చొప్ప రుచిగా ఉండకపోవడం వల్ల పశువులు మొదళ్లను వదలి చివర్లను మాత్రమే మేస్తాయి. అయితే పెద్ద జొన్న చొప్ప తియ్యగా ఉండటం వల్ల వేర్లతో సహా పశువులు ఇష్టంగా మేస్తాయని, పశువులకు ఈ చొప్ప మంచి బలమని గిరిజన రైతులు చెబుతున్నారు. పెద్ద జొన్నల దిగుబడి హైబ్రిడ్ జొన్నల కన్నా ఎకరానికి 5 క్వింటాళ్లు తక్కువ దిగుబడి వచ్చినప్పటికీ.. ఎకరం పొలం నుంచి వచ్చే పెద్ద జొన్న చొప్ప రెండు ఎడ్లు, 8 ఆవులకు ఏడాదంతా సరిపోతుందని రైతులు చెబుతున్నారు. నాగోబా జాతరలో బండి లాగుడు పోటీల్లో తమ ఎడ్లకు ఎదురు లేకపోవడానికి కారణం బలవర్ధకమైన పెద్ద జొన్న చొప్పేనని రాజ్ గోండ్ రైతులు గర్వంగా చెబుతున్నారు. పెద్ద జొన్నలతో తయారుచేసిన ఆహారోత్పత్తులు చాలా రుచిగా ఉంటాయి. జొన్న అంబలి, గట్క, రొట్టె వంటి వాటిని తయారు చేస్తారు. వేసవి కాలంలో గిరిజనులు అంబలిని చలువ పానీయంగా తీసుకుంటారు. మధుమేహాన్ని నియంత్రిస్తుందని చెబుతారు. అందుకే మల్లాపూర్ రైతులు తమ పెద్ద జొన్నలను విక్రయించకుండా ఇంటి అవసరాలకు మాత్రమే వాడుతున్నారు. విత్తనం ఇచ్చి పుచ్చుకుంటారు.. రైతులకు విత్తనాలను ఉచితంగానే ఇస్తారు. మరుసటి పంట వచ్చాక వారి నుంచి రెట్టింపు పరిమాణంలో విత్తనాలను తీసుకుంటారు. పెద్ద జొన్నలో ఎకరాకు 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వీటితో చేసిన ఆహారోత్పత్తులు రుచిగా ఉండటం, ఆరోగ్యకరమైన పోషకాలను కలిగి ఉండటం వల్ల పెద్ద జొన్నలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ౖహెబ్రిడ్ జొన్నలు క్వింటాల్ రూ. 3 వేల వరకు ఉండగా పెద్ద జొన్నలకు మాత్రం రూ. 10 వేల వరకు ధర పలుకుతోంది. – రొడ్డ దేవిదాస్, సాక్షి, ఆదిలాబాద్ రుచికరం.. ఆరోగ్యదాయకం.. మా పూర్వీకులు పండించిన పంటను మళ్లీ మేం సాగు చేస్తున్నాం. ఏ పంటను సాగు చేసినా కనీసం ఎకరాకు రూ. 10 వేల ఖర్చు చేయాలి. పెద్ద జొన్న సాగులో రూపాయి పెట్టే అవసరం ఉండదు. రెండంటే రెండే తడులు చాలు. పెద్ద జొన్న వంటలు రుచిగా ఉంటాయి. ఆరోగ్యదాయకమైనవి కూడా. – పూసం ఆనంద్‌రావు (95509 61811),పెద్ద జొన్న రైతు, మల్లాపూర్, ఆదిలాబాద్ జిల్లా పశువుల ఎరువు మాత్రమే వేస్తాం.. పెద్ద జొన్న పంటను మా ఊళ్లోని రైతులందరు వేస్తారు. జొన్నలను మా అవసరాల కోసం మాత్రమే సాగు చేస్తున్నాం. పొలంలో పశువుల ఎరువును మాత్రమే వేస్తాం. – ఆత్రం భీంరావు (85009 12214) పెద్ద జొన్న రైతు, మల్లాపూర్ పెద్ద జొన్న రొట్టెలే ఎక్కువగా తింటాం.. మా పెద్దలు కూడా పెద్ద జొన్నలు తినేవారు. మధ్యలో వీటి జాడలేకుండాపోయింది. గత ఐదేళ్లుగా మళ్లీ ఈ పంటను పండిస్తున్నాం. నాకున్న మూడు ఎకరాల్లో పెద్ద జొన్న సాగు చేస్తున్నా. మా ఇంట్లో ఈ జొన్నతో చేసిన అంబలి, గట్క, రొట్టెలే ఎక్కువగా తింటాం. – మడావి భారతి బాయి, పెద్ద జొన్న రైతు, మల్లాపూర్ మైదాన ప్రాంత రైతులకూ అనువైన వంగడం పెద్ద జొన్న వంటి సంప్రదాయ పంటను కొన్ని వందల సంవత్సరాల నుంచి గిరిజన రైతులు సాగు చేస్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో పెద్ద జొన్న సాగు నిలిచిపోయింది. ఐదేళ్లుగా మళ్లీ కొనసాగిస్తున్నారు. గిరిజనులు వారి తిండి గింజల కోసమే వీటిని సాగు చేస్తున్నారు. మైదాన ప్రాంతాల రైతులు మేలైన యాజమాన్య పద్ధతులతో సాగు చేస్తే మంచి దిగుబడి, ఆదాయం కూడా లభిస్తుంది. – డాక్టర్ దండు మోహన్‌దాస్ (96037 16774),శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్