బీటీకి దీటుగా!
* సాధారణ రకాల పత్తితోనూ మంచి దిగుబడులు
* ఫలితాలిచ్చిన ‘హై డెన్సిటీ ప్లాంట్ సిస్టమ్’ సాగుపద్ధతి.. 6 జిల్లాల్లో 348 ఎకరాల్లో సాగు
* వర్షాధార తేలిక నేలల్లో మామూలు పత్తిరకాల సాగే మేలు..
* బీటీకి ప్రత్యామ్నాయంగా హెచ్‌డీపీఎస్ సాగుకు సిఫారసు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సాగు పద్ధతిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే చాలు.. బీటీ పత్తికి దీటుగా మామూలు పత్తి రకాలతోనూ చక్కని దిగుబడి సాధించవచ్చని తేలింది. అంతేకాదు.. వర్షాధారంగా సాగయ్యే తేలికపాటి నేలల్లో బీటీ రకాల సాగుకన్నా సాధారణ రకాల పత్తి సాగే రైతుకు ‘మినిమం గ్యారంటీ’గా ఉంటుందని ఇటీవల రాష్ట్రంలో జరిపిన సాగు ప్రయోగాల్లో తేటతెల్లమైంది. కేవలం మొక్కల సాంద్రతను పెంచడం ద్వారానే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. బీటీ హైబ్రిడ్ రకాలు నీటి సౌకర్యమున్న లోతైన నల్లరేగడి భూములకు అనువైనవి. వర్షాధారంతో కూడుకున్న తేలికపాటి భూముల్లో సాగుకు అంత అనువైనవి కావు. అయినప్పటికీ సరైన ప్రత్యామ్నాయాలు లేనందున మన రైతులు తేలికపాటి నేలల్లోనూ వర్షాధారంగా బీటీ పత్తిని సాగు చేస్తూ నష్టపోతున్నారు.
ఈ సమస్యకు పరిష్కారాలకోసం ‘సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్’(సీఐసీఆర్) నేతృత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ గుంటూరు, ప్రకాశం, కర్నూలు, మహబూబ్‌నగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 348 ఎకరాల్లో మామూలు రకాల(నాన్ బీటీ) పత్తిని రైతులతో సాగుచేయించింది. ఇందుకోసం మొక్కల సాంద్రత పెంపు పద్ధతి (హై డెన్సిటీ ప్లాంట్ సిస్టమ్-హెచ్‌డీపీఎస్)ని అనుసరించింది. తేలిక నేలలు ఎక్కువకాలం తేమను నిలుపుకోలేవు. నేలలో ఉన్న తేమను గరిష్టంగా ఉపయోగించుకుంటూ నీటిఎద్దడిని తట్టుకునే స్వల్పకాలిక వంగడాలైన సీఐసీఆర్‌కు చెందిన ‘సూరజ్’, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవిష్కరించిన ‘ఎన్‌డిఎల్‌హెచ్-1939’ రకాలను సాగుకు ఎంపిక చేసుకున్నారు.
నేలలో తేమను పూర్తిగా ఉపయోగించుకునేలా మొక్కల సాంద్రతను ఎకరాకు గరిష్టంగా పెంచారు. మొక్కల సాంద్రత పెంచడంతో కలుపు సమస్య చాలావరకు తగ్గింది. జూన్ చివరివారంలో కొన్నిచోట్ల, జూలై చివరివారంలో మరి కొన్నిచోట్లా విత్తనం వేశారు. పంట పెరుగుదల క్రమాన్ని వ్యవసాయ అధికారులు నిరంతరం సమీక్షించారు. పంట మొదటి కోతల దశలో అధిక వర్షాలవల్ల దిగుబడి కొంత తగ్గింది. అయితే మొత్తంమీద ఫలితాలు బీటీ పత్తికి దీటుగా ఉన్నాయి. దిగుబడి 6 నుంచి 10 క్వింటాళ్ల వరకూ వస్తుందని అంచనా.
రైతుల సంతృప్తి...
కొత్త పద్ధతిలో పత్తి సాగు చేసిన రైతులు దిగుబడులపై సంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కల సాంద్రతకు సంబంధించి 45ఁ10, 60ఁ10, 60ఁ30, 70ఁ30, 90ఁ30 సెంటీమీటర్ల దూరం పాటిస్తూ చేసిన ప్రయోగాల్లో ఎక్కువమంది రైతులు సాలుకు సాలుకు మధ్య దూరం 60 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య దూరం 30 సెంటీమీటర్లు(60ఁ30) ఉంటే కలుపుతీతకు, పత్తి తీతకు అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ దూరాన్ని పాటిస్తే ఎకరానికి మొక్కల సాంద్రత 30 వేలు ఉంటుంది. బీటీ పత్తి సాగులో మొక్కల సాంద్రత ఎకరానికి 7,500 మాత్రమే(ప్రస్తుతం బీటి పత్తి సాగులో 90ఁ60 సెంటీమీటర్ల దూరాన్ని పాటిస్తున్నారు)
ప్రతికూల పరిస్థితుల్లోనూ ‘మినిమం గ్యారంటీ’..
మామూలు రకాల పత్తి సాగులో మొక్కల సాంద్రత పెంచడం వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చీడపీడల దాడికి గురైనా సగటున ఒక మొక్క నుంచి ఐదారు పత్తి కాయలు వస్తే చాలు. ఒక్కో కాయలోని పత్తి 5 గ్రాములనుకుంటే ఒక్కో మొక్కనుంచి దాదాపు 30 గ్రాముల పత్తి వస్తుంది. ఎకరాలో 30 వేల మొక్కలు ఉన్నప్పుడు దిగుబడి ఎకరాకు తొమ్మిది క్వింటాళ్ల వరకూ సాధించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు ఈ ప్రయోగాలద్వారా నిగ్గుతేల్చారు.
దీనికితోడు రైతు ఏటా పత్తి విత్తనాలను కొనుక్కునే అవసరమూ ఉండదు. ఈ ఏడాది జరిపిన క్షేత్రస్థాయి ప్రయోగాత్మక సాగులో.. వరుస వర్షాలవల్ల సకాలంలో కలుపు తీయలేకపోయారు. పైరు ఆకుమచ్చ తెగులుకు గురైంది. అయితే రసంపీల్చు పురుగుల ఉధృతి బీటీ పత్తిలోకన్నా తక్కువే. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా ‘హెచ్‌డీపీఎస్’ సాగు ఫలితాలిచ్చింది.
ప్రస్తుతం పత్తి రెండు, మూడో తీత దశల్లో ఉంది. ఎకరాకు 6 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రానుంది. ఈ ప్రయోగ ఫలితాలను విశ్లేషించిన వ్యవసాయశాఖ వర్షాధారంగా తేలికపాటి భూముల్లో బీటీ పత్తి సాగు కన్నా, మామూలు పత్తి రకాలను ఎక్కువ సాంద్రతతో సాగుచేయడం ద్వారానే రైతుకు లాభదాయకమని తేల్చింది. భవిష్యత్తులో బీటీకి ప్రత్యామ్నాయంగా ‘హెచ్‌డీపీఎస్’ పద్ధతిలో సాధారణ పత్తి రకాల సాగును వ్యవసాయశాఖ సిఫారసు చేయనుంది.