బీటీ పత్తి సాగుపై మళ్లీ ప్రయోగం
Published Sat, Aug 17 2013 3:48 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
గజ్వేల్, న్యూస్‌లైన్: బీటీ పత్తి విత్తనాలన్నీ ఒకే రకమైన ఫలితాలనిస్తాయనే విషయాన్ని మరింత సమర్థంగా చాటిచెప్పేందుకు జిల్లాలో ఆత్మ(అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ), వ్యవసాయశాఖ మరోసారి ప్రయోగానికి సిద్ధమయ్యాయి. గతేడాది చేపట్టిన కార్యక్రమానికి కొంత భిన్నంగా ముందుకుసాగుతున్నారు. గతంలో ఒక గ్రామంలో అయిదుగురు రైతుల పొలాలను ఎంపిక చేసుకుని ప్రయోగాన్ని నిర్వహిస్తే ప్రస్తుతం ఒకే రైతు చేనులో అయిదు రకాల విత్తనాలను సాగుచేయిం చారు. జిల్లాలో ప్రతి ఏటా 1.30 లక్షల హెక్టార్లకు పైగానే పత్తి సాగవుతోంది. రైతులు బ్రాండెడ్ పేరిట ఒకే రకమైన పత్తి విత్తనాల కోసం ఎగబడటం వల్ల ప్రతి సీజన్‌లో తీవ్ర కొరత తలెత్తుతోంది. దీంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బీటీ పత్తి విత్తనాలన్నీ ఒకే రకమైన ఫలితాలనిస్తాయనే విషయం తెలియక కంపెనీల ప్రచారంతో ఒకే రకానికి ఎగబడటం వల్ల ఈ పరిస్థితి నెలకొంటోంది.
జిల్లాలో గత ఖరీఫ్‌లో 4 లక్షలకుపైగా బీటీ విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో కావేరి, నూజివీడు, అజిత్, మార్వెల్ తదితర 35 కంపెనీల నుంచి సుమారు 3.5 లక్షలకు పైగా విత్తన ప్యాకెట్లు విడుదలైతే ఓ ప్రధాన కంపెనీ మాత్రం కేవలం 15 వేల ప్యాకెట్లను మాత్రమే మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఫలితంగా రైతులు ఆ కంపెనీ విత్తనాల కోసం ఎగబడ్డారు. సాధారణంగా రూ.930కి విక్రయించాల్సిన విత్తన ప్యాకెట్ కొరత కారణంగా వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తెరతీశారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.3 వేలకుపైగా విక్రయించి లక్షలు దండుకున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మ, వ్యవసాయశాఖ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ రకాల విత్తనాలను వేసిన పత్తి క్షేత్రాలపై అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే మెదక్ జిల్లాలో గజ్వేల్ మండలం రిమ్మనగూడలో పలువురు రైతుల భూముల్లో నాలుగైదు రకాలకు చెందిన విత్తనాలను సాగు చేయించి అన్నీ ఒకే రకమైన ఫలితాలనిస్తాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఈ ప్రయోగ ఫలి తాలను కరపత్రాల ద్వారా 2013 మే నెలలో నిర్వహించిన రైతు చైతన్య సదస్సుల్లో రైతులకు సమర్థంగా వివరించగలిగారు.
మారుతున్న రైతుల ఆలోచనాసరళి..
జిల్లాలో ఈసారి 1.30 లక్షల హెక్టార్లకుపైగా పత్తి సాగయ్యే అవకాశమున్నదని వ్యవసాయశాఖ ఖరీఫ్ ఆరంభంలో భావించింది. ఇందుకోసం 6.16 లక్షల విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. 35 రకాల కంపెనీలకు విక్రయాలకు సంబంధించి వ్యవసాయశాఖ అనుమతినిచ్చారు. ప్రతి ఏటా సమస్యగా మారే ఓ ప్రధాన కంపెనీ విత్తనాలు జిల్లాకు ఈసారి 38,799 ప్యాకెట్లు కేటాయిం చారు. స్టాకు కొరత లేదు. మూడేళ్లుగా ఈ ప్యాకెట్లను రెట్టింపు, ఆపైన ధరలకు విక్రయించేవారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. ఈ కంపెనీకి చెందిన మూడు రకాల ప్యాకెట్లలో ఒక రకాన్ని రూ.930కు, మరో రెం డు రకాల ప్యాకెట్లను ఎమ్మార్పీ కంటే రూ.50 తక్కువగా విక్రయించారు. రైతుల ఆలోచనా విధానంలో మార్పు రావడంతో కోట్ల రూపాయల బ్లాక్ మార్కెట్‌కు తెరపడింది.
ఈసారి కూడా ప్రయోగానికి శ్రీకారం....
బీటీ పత్తి విత్తనాలన్నీ ఒకే రకమైన ఫలితాలనిస్తాయనే విషయాన్ని మరోసారి చాటి చెప్పడానికి ఆత్మ, వ్యవసాయ శాఖలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే గజ్వేల్, స దాశివపేట, దుబ్బాక మండలాల్లో ఒక్కో రైతు కు చెందిన అయిదెకరాల పొలాన్ని ఎం పిక చేసి వాటిల్లో అయిదు రకాల కంపెనీలకు చెం దిన విత్తనాలను సాగు చేయించారు. గజ్వేల్ మండలం రిమ్మనగూడలోని కామేపల్లి హరిబాబుకు చెందిన అయిదెకరాల చేనులో పారస్ కంపెనీకి చెందిన బ్రహ్మ, మైకో కంపెనీకి చెం దిన కనక్, లక్ష్మీ కంపెనీకి చెందిన నక్ష, కావేరికి చెందిన జాదు, ప్రభాస్‌కు చెందిన మార్వెల్ రకాలను ఒక్కో రకాన్ని ఒక్కో ఎకరా చొప్పున సాగు చేశారు. వీటి ప్రయోగ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
Advertisement
Advertisement