విత్తుపై పెత్తనానికే జన్యు జిత్తులు! | genetic tricks over seed production | Sakshi
Sakshi News home page

విత్తుపై పెత్తనానికే జన్యు జిత్తులు!

Published Fri, Nov 20 2015 12:21 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM

genetic tricks over seed production

సమకాలీనం
  జన్యుమార్పిడి పంటల క్షేత్ర పరీక్షల వల్ల  జన్యుకాలుష్యం ముప్పు ఉంది. అది మనుషులపైనా, ఇతర జీవులపైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే అమెరికా సహా అధిక దేశాలు వాటిని నిషేధించాయి. 2002లో ఎన్డీఏ ప్రభుత్వం అనుమతించిన బీటీ పత్తి రైతాంగాన్ని ముంచింది. ఆహారోత్పత్తిని పెంచడంలో ప్రపంచానికే ఆదర్శంగా భావించే ఇజ్రాయెల్ జన్యు మార్పిళ్లకు దూరంగా ఉంది. విత్తనంపై పెత్తనంతో మన వ్యవసాయాన్నే చెరబట్ట చూస్తున్న బహుళజాతి హిరణ్యాక్షుల నియంత్రణకు తెలుగువారు ఉద్యమం సాగించక తప్పదేమో.
 
 మంచి కొంచెమైనా ఫలితం గొప్పగా ఉంటుంది. 'చిత్తశుద్ది కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత?....'అని పోల్చి చెప్పాడు వేమన. ఎంతో విశాలమైన మర్రి చెట్టును, అతి చిన్నదిగా ఉండే దాని విత్తనాన్ని  ఉదాహరణగా తీసుకున్నాడు. మంచికి బదులు చెడు జరిగితే....? దాని విపరిణామాలు కూడా అంతకన్నా తీవ్రంగా ఉంటాయి. ఊరగాయలో, ఆవకాయలో... ఇలా అన్నిట్లో ఇమిడేందుకు వంటింటికొచ్చే ఆవాల్లో ఏముందో! విత్తన జన్యు సంకరం ఎలా చేశారో? తింటే ఏం జబ్బులొస్తాయో?  తెలియని పరిస్థితి ఉంటే సగటు మనిషి పరిస్థితేంటి? ఇవేవీ పట్టించుకోకుండా జన్యుమార్పిడి పంటల పరీక్షలకు తెరలేపుతున్నారు. వేమన చెప్పిన చిన్న చిన్న విత్తనాలనే ఆలంబన చేసుకొని మొత్తం వ్యవసాయ రంగాన్ని, ఉత్పత్తి వ్యవస్థల్ని గుప్పిట పట్టాలని చూస్తు న్నాయి కార్పొరేట్ శక్తులు.


దేశ వ్యవసాయం భవిత గురించి ఆలోచించని ప్రభుత్వాలు వాటికి వంత పాడుతూ, పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తు న్నాయి. తెలుగు నేలను విత్తన భాండాగారం చేస్తామంటూనే, మొత్తంగా విత్తనోత్పత్తి, ఆహారోత్పత్తి వ్యవస్థలను అతి కొన్ని కార్పొరేట్ల నియంత్రణలోకి బదలాయించడానికి శ్రీకారం చుడుతున్నాయి. జన్యుమార్పిడి పంటల సాగు క్షేత్ర పరీక్షలకు అనుమతి, మేధో సంపత్తి హక్కుల దారాదత్తం, విత్తనంపై పెత్తనం, ఎరువులు, పురుగు మందుల మార్కెట్‌పై గుత్తాధిపత్యం, తద్వారా మొత్తం వ్యవసాయోత్పత్తులపైనే నియంత్రణ... ఇదీ వరుస! ఇది సమస్య కున్న ఒక పార్శ్వమే! మరోవంక ఇవి జీవభద్రత ధ్రువీకరణ జరగని జన్యు మార్పిళ్లయినందున, జన్యువులు బాహ్య వాతావరణంలోకి వచ్చి జన్యు కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉంది.

అది మనుషులపైనా, ఇతర జీవులపైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆరోగ్యపరమైన ఎన్నో విపరిణామాలకు దారితీస్తోంది. చూడటానికిది శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని అధునీకరించడంగా, మెరుగైన విత్తనాభివృద్ధిగా అనిపిస్తుంది. కానీ ఇందులో అనేకానేక మతలబులుంటాయని రైతు సంఘాలు, పర్యావరణ వేత్తలు హెచ్చ రిస్తున్నారు. తగు నియంత్రణ వ్యవస్థలు లేకుండా జన్యుమార్పిడి పంటలకు, వాటి క్షేత్ర పరీక్షలకు పచ్చజెండా ఊపొద్దని హెచ్చరిస్తున్నారు. మన దేశంలో వేల ఏళ్లుగా రైతులే ప్రత్యేక శ్రద్ధతో, తగు ఎత్తుగడలతో విత్తనాన్ని వృద్ధి చేసుకుంటున్న సంప్రదాయిక విధానాలకిది గొడ్డలిపెట్టు. బయోటెక్నాలజీ ముసుగులో విత్తనం కార్పొరేట్ల చేతుల్లోకి పోతే  భవిష్యత్తులో వ్యవసాయం దుర్భరమే!
 
తొందరపాటెందుకు?
 జన్యుమార్పిడి బీటీ పత్తి సాగులోని మన చేదు అనుభవాల దృష్ట్యానైనా ప్రభు త్వాలు జాగ్రత్త వహించాలని నిపుణుల సూచన. ఎన్డీఏ ప్రభుత్వమే 2002లో అనుమతించిన బీటీ పత్తి రైతాంగాన్ని నిలువునా ముంచింది. ఆంధ్రా, తెలంగాణ, మరఠ్వాడాలో జరిగిన అత్యధిక రైతు ఆత్మహత్యలకు బీటీ పత్తే కారణం. విత్తనాలపై బహుళజాతి సంస్థలకు మేధో సంపత్తి హక్కులు (పేటెంట్స్) ఉండటం వల్ల రైతులు ప్రతిసారీ రాయల్టీ చెల్లించాల్సిన పరిస్థితి. బీటీ పత్తి సాగులోకి వచ్చిన కొద్ది కాలానికే స్థానిక, సంప్రదాయ విత్తనాలన్నీ మాయమయ్యాయి. దీంతో ఆ విత్తనాలపైనే రైతాంగం ఆధారపడాల్సిన, బోలెడంత డబ్బు వెచ్చించాల్సిన దుర్గతి. పోనీ, దిగుబడి సుస్థిరంగా, హెచ్చుగా ఉందా? అదీ లేదు! మొదట్లో దిగుబడులు పెరిగినా, కాలక్ర మంలో తగ్గినట్టు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) లెక్కలే చెబుతు న్నాయి.

 
2001-02 నుంచి 2004-06 వరకు బీటీ పత్తి 6% వరకున్నపుడు దిగుబడి 69% పెరిగింది. 2005-06 నుంచి 2007-08 వరకు బీటీ పత్తి సాగు 62% పెరిగినపుడు దిగుబడి 17% పడిపోయింది. 2008-09 నుంచి 2012- 13 వరకు బీటీ పత్తి సాగు శాతం 94% పెరిగినపుడు దిగిబడి 10% తగ్గి పోయింది. కాకపోతే అది కాయతొలిచే పురుగును పరిహరించడం వల్ల  పంట నాశనం తగ్గిన మేరకు మాత్రమే అదనపు దిగుబడి లభించింది. పైగా, జన్యు సంకరం వల్ల పక్వానికొచ్చినప్పుడు కాయలోకి చేరాల్సిన విషరసాయనం ఆకులు, కొమ్మలు, కాండం సహా మొక్కకంతటికీ విస్తరించిన జాడలున్నాయి. ఆకులు మేసిన మేకలు, ఇతర పశువులు మరణించిన రుజువులున్నాయి. ఇక ఇప్పుడైతే, కాయతొలిచే పురుగు రోగనిరోధకత పెరిగి, యధేచ్ఛగా కాయను తినేస్తోంది! ఈ లోగా విత్తనంపై పెత్తనం కంపెనీకి దక్కింది. సంకర విత్తనమై నందున నిర్దిష్ట ఎరువులు, పురుగు మందుల మార్కెట్‌పై గుత్తాధిపత్యం లభించింది. పంట ఉత్పత్తి వ్యయం పెరిగి, దిగుబడి, ధర రెండూ రాక రైతు నిలువునా మోసపోతున్నాడు. ఇంతకుమించిన దుష్ఫలితాలు ఆహార పంటలకూ దాపురిస్తే ఇక రైతు పరిస్థితి ఏమిటన్నది వేయి రూకల ప్రశ్న!

 ఆహారోత్పత్తి పెరగాల్సిందే, కానీ...
 ప్రపంచవ్యాప్తంగా జనాభా వృద్ధిని బట్టి ఆహారోత్పత్తి ఎన్నో రెట్లు పెరగాల్సి ఉంది. అది జరిగితేనే ఈ శతాబ్దాంతానికి ఆకలి బాధ తీరుతుంది. నిజమే. కానీ దీని ఆధారంగా ఆహార అవసరాలు తీర్చడానికి జన్యుమార్పిడే మార్గ మనడం తప్పు. తగిన పరీక్షలు జరక్కుండా, జీవభద్రతను ధ్రువీకరించ కుండా జరిగే జన్యుమార్పిళ్ల వల్ల ప్రయోజనాల కన్నా అనర్థాలే ఎక్కువని శాస్త్రీ యంగా రూఢి అయిన విషయం. 'ఇప్పుడు పంట పరీక్షకే అనుమతి అడుగు తున్నాం కదా!' అంటారు. క్షేత్ర పరీక్ష ప్రమాదకరమైందనే ప్రపంచంలోని మెజారిటీ దేశాలు నిషేధించాయి. ఈయూలోని పలు దేశాలు, అమెరికాలో గోధుమ సహా క్షేత్ర పరీక్షల్ని, స్థూలంగా జన్యు మార్పిళ్లను నిషేధించారు. ఈ పరీక్షల వల్ల జన్యు వైవిధ్యం సంకరమౌతుంది. ఫలితంగా జీవవైవిధ్యం, బతుకు వైవిధ్యమే సరిదిద్దలేనంతగా దెబ్బతింటోంది. మన దేశంలో జన్యు కాలుష్యాన్ని ఆపే, నియంత్రించే పద్ధతులు లేనందున క్షేత్ర పరీక్షలకు అను మతించకూడదని 'హరిత విప్లవ'ప్రముఖుడు స్వామినాథనే అన్నారు.


బీటీపై శాస్త్రవేత్తలతో సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీదీ అదే అభిప్రాయం. క్షేత్ర పరీక్షల వల్ల జన్యుకాలుష్య ప్రమాదముంది, అదే జరిగితే ప్రకృతి సహజ విత్తనాలు కలుషితమై, తిరిగి ‘సహజ’ స్థితికి రాలేని పరిస్థితు లేర్పడతాయని పేర్కొంది. జీవ భద్రత ముఖ్యం, భవిష్యత్ తరాల ఆహారాన్ని కలుషితం కానీకుండా కాపాడేందుకు అవసరమైన శాస్త్ర సాంకేతికత పెరిగే వరకు జన్యుమార్పిడి క్షేత్ర పరీక్షలు వద్దు, ల్యాబ్‌కే పరిమితం చేయాలని సుప్రీంకోర్టుకు నివేదించింది. పార్లమెంట్ స్థాయీ సంఘం కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. అవసరాలకు సరిపడా ఆహారోత్పత్తి పెంచడా నికి ఎన్నో ప్రత్యామ్నాయాలున్నాయి. పట్టణీకరణ, ఎడారీకరణ, భూక్షయం, ఉప్పుకొట్టుకుపోవడం, నీటి లభ్యత లేకపోవడం తదితర కారణాల వల్ల దేశంలో సాగుభూమి తగ్గుతోంది. ప్రభుత్వ విధానాల్లో లోపాల వల్ల విచ్ఛల విడిగా భూవినియోగ మార్పిళ్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్ది, సాగు విస్తీర్ణం పెంచాలి. ప్రపంచం ఆదర్శంగా భావించే ఇజ్రాయల్ టెక్నాలజీ ఆహారోత్పత్తుల్ని గణనీయంగా పెంచింది. కానీ వారు జన్యుమార్పిళ్లకు వెళ్లక పోవడాన్ని గమనించాలి. విశ్వవ్యాప్తంగా ఏటా 33% నుంచి 42% ఆహారం తిండిగింజలు, తయారైన ఆహారం వృధా అవుతోంది. దీన్ని కట్టడి చేయాలి.
 
మేథో సంపత్తి హక్కులు విత్తనంపై కాదు...
 సంకర పరచిన జన్యువులపైనే తప్ప విత్తనంపై మేధోసంపత్తి (పేటెంట్) హక్కులు జన్యుమార్పిడి పరీక్షలు నిర్వహిస్తున్న బహుళ జాతి కంపెనీలకు దక్కవు. కానీ, వారు విత్తనాలపై హక్కులున్నట్టు వ్యవహరిస్తున్నారు. టర్మినే షన్ విత్తనాల్ని ఉత్పత్తి చేస్తూ, ఏటా రైతులు విత్తనాల కోసం తమ వద్దకే వచ్చేలా చేస్తున్నారు. ఈ ప్రక్రియపై, పదజాలంపై సర్వత్రా విమర్శలు రావ డంతో, తమ ఆధిపత్యం కొనసాగింపునకు దొంగ దారులు వెతుకుతున్నారు. ఇప్పుడు ఆవాల్లో 'మేల్ స్టెర్లైడ్' విత్తనం తెస్తున్నారు. అంటే, ఒకసారి విత్తిన తర్వాత తిరిగి విత్తనోత్పత్తి జరుగదు. మళ్లీ పంట కోసం రైతు సదరు కంపెనీ దగ్గరకు రావాల్సిందే! పేరు వేరే తప్ప వ్యవహారం ఒక్కటే! హక్కుల స్పృహ అధికంగా ఉండే అభివృద్ధిచెందిన దేశాల్లోనే రైతులు, ఉద్యమకారులు వీరి ఆగడాల్ని నియంత్రించలేకపోతున్నారు.


 కెనడాలో సేంద్రియ పద్ధతిన పంట సాగుచేస్తున్న ఓ రైతు క్షేత్రంలోకి చొరబడి, దౌర్జన్యంగా శాంపిల్స్ సేకరించి, 'మేం సంకరపరచిన జీన్స్‌ను వినియోగిస్తున్నావంటూ' బహుళజాతి విత్తన కంపెనీ తెగబడింది 'మీరు సృష్టించిన జన్యుకాలుష్యం వల్ల అలా జరిగిందే తప్ప, నేను పనిగట్టుకొని చేసింది కాదు, మీ వల్లే నాకు నష్టం జరిగింద'ని రైతు ఎంత వాదించినా సదరు బహుళజాతి కంపెనీ కేసును అత్యున్నత న్యాయస్థానానికి ఈడ్చి మరీ పరిహారం వసూలు చేసింది. అలా అక్కడ దాదాపు 1,100 మంది రైతులపై ఇప్పుడు కేసులున్నాయి! జన్యుమార్పిళ్ల దుష్ఫరిణామాలపై పరీక్షలు జరుగకుండేలా ఈ బడా కంపెనీలు వ్యవహారం నడుపుతాయి. జన్యు కాలుష్యపు తిండి వల్ల క్యాన్సర్ కంతి ఏర్పడ్డట్టు ఇటాలి యన్ శాస్త్రవేత్త 'సెరాలినీ'ఎలుకలపై జరిపిన ప్రయోగంలో వెల్లడైంది. శాంపిల్ తప్పని సదరు కంపెనీలు వాదించినా చివరకాయన వాదనే నెగ్గింది.
 ఎవరి ప్రయోజనాల కోసం?
 రాష్ట్రాల అనుమతితో జన్యుమార్పిడి క్షేత్ర పరీక్షలు జరుపుకోవచ్చని కేంద్రం లోని జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జీఈఏసీ) సూత్రప్రాయ సమ్మ తిని తెలిపింది. వరి, పత్తి, గోదుమ, మొక్కజొన్న, వేరుశనగ, బంగాళ దుంప... ఇలా పన్నెండు పంటల విషయంలో ఈ వెసులుబాటునిచ్చింది. కానీ, వాటిని ససేమిరా అనుమతించేది లేదని తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. రాష్ట్రాల నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీ) తప్పనిసరి. జన్యుమార్పిళ్ల క్షేత్ర పరీక్షలకు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అంగీకారాన్ని తెలిపాయి. ఈ విషయమై నివేదికను ఇవ్వాల్సిందిగా కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. కంపెనీలతో మాటా-మంతీ అయ్యాకే కంటి తుడుపు కమిటీ వేశారనే విమర్శలూ ఉన్నాయి. విత్తనాల ద్వారా మొత్తం వ్యవసాయాన్ని చెరబట్ట చూస్తున్న బహుళజాతి హిరణ్యాక్షుల్ని నియంత్రించ డానికి తెలుగునాట ఉద్యమం తప్పదేమోనని వ్యవసాయ, పర్యావరణ నిపు ణులంటున్నారు. 'రైతులు, తోటమాలీల చేతిలో విత్తనం, వారి నిర్వహణలో భూమి ఉన్నంతవరకు ప్రపంచంలో ఆకలి బాధలుండవు'అని పర్యావరణ కార్యకర్త, విత్తనోద్యమనేత వందనాశివ అన్న మాటలు అక్షర సత్యాలు.
http://img.sakshi.net/images/cms/2015-07/61438290637_295x200.jpg

ఈమెయిల్: dileepreddy@sakshi.com       
 వ్యాసకర్త: దిలీప్ రెడ్డి
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement