బీటీ పత్తిలో గులాబీ రంగు
- గుజరాత్‌కే పరిమితమైన పురుగు ఇప్పుడు రాష్ట్రంలోకి ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాలో సాగు చేస్తున్న బీటీ పత్తిని గులాబీ రంగు పురుగు ఆశించినట్లుగా స్థానిక వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటివరకు కేవలం గుజరాత్‌లో మాత్రమే బీజీ-2 పత్తిని గులాబీ రంగు పురుగు ఆశిస్తుండగా... ఇప్పుడు వరంగల్ జిల్లాలోనూ ఈ ఏడాది గులాబీ రంగు పురుగును గుర్తించారు. అలాగే ఈ సమస్య మహబూబ్‌నగర్ జిల్లాలోనూ ఉన్నట్లు రాష్ట్ర శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
వర్షాధార బీటీ పత్తిని రైతులు చాలావరకు ఏరివేసి ఆ పత్తి చేలను వదిలేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పత్తి మొక్కలు పూర్తిగా ఎండి వాటిలో రోగ నిరోధక శక్తి లేకపోవడంతో అది పురుగుకు వరంగా మారి, వదిలేసినచేలల్లో గులాబి రంగు పురుగు ఉధృతమై మిగతా పత్తి చేలను కూడా ఆశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ చేలల్లో గులాబీ రంగు పురుగుతో పాటు పిండినల్లి కూడా ఎక్కువగా ఆశిస్తున్నట్లు గుర్తించారు. గులాబీ రంగు పురుగు లార్వాలు కాయలలోకి ప్రవేశించి పత్తిని, గింజలను తింటాయి. దీనివల్ల పత్తి సరిగా పగలదు. వచ్చే పత్తి నాణ్యత బాగా తగ్గి గుడ్డి పత్తి అవుతుంది. బరువు కూడా బాగా తగ్గుతుంది.
నివారణ చర్యలు...
- పత్తి ఏరినటువంటి చేలల్లో గొర్రెలు, మేకలు, పశువులను తోలి మేపాలి.
- పత్తి మోడులను రోటవేటర్‌తో భూమిలోకి కలియదున్నాలి.
- నీటి వసతి ఉన్నప్పటికీ పత్తిని పొడిగించకుండా తీసేసి మొక్కజొన్న లేదా ఇతర ఆరుతడి పంటలు వేసుకోవాలి.
- గులాబీ రంగు పురుగు నివారణకు క్వినాల్‌ఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 300 గ్రాములు వేపనూనెతో కలిపి పిచికారి చేయాలి.
- పత్తి మోడులను ఇళ్ల దగ్గర పొయ్యిలో వాడడానికి నిల్వ చేయకూడదు.
- గులాబీ రంగు పురుగు ఆశించిన పత్తి చేల నుంచి తీసిన పత్తిని అంతకు ముందు నిలువ ఉంచుకున్న పత్తిలో కలుపకూడదు.