రెండు గంటల పాటు చలిలో నిలబెట్టిన వైనం.. వరంగల్ జిల్లా ఐనపల్లి గురుకులంలో ఘటన
ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ఐనపల్లి మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల ప్రిన్సిపాల్ అక్కడి విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఔటింగ్‌కు వెళ్లి అరగంట ఆలస్యంగా వచ్చారన్న కారణంతో రెండు గంటలపాటు బయట చలిలోనే నిల్చోబెట్టారు. మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులకు ఆదివారం తల్లిదండ్రులను కలిసేందుకు ఔటింగ్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో వారు తమ తల్లిదండ్రులతో కలిసి బయటకు వెళ్లారు.
సాయంత్రం 4 గంటలలోపు వారు తిరిగి పాఠశాలలోకి వెళ్లాల్సి ఉండగా, అరగంట ఆలస్యంగా రావటంతో ప్రిన్సిపాల్ వారిని లోనికి అనుమతివ్వలేదు. దీంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాఠశాల ఎదురుగానే చలిలో సుమారు రెండు గంటలపాటు వేచి ఉన్నారు. అటువైపుగా వెళ్లిన పోలీస్ సిబ్బంది గమనించి ఆరా తీసి పిల్లలను లోపలికి పంపాలని కోరినా ప్రిన్సిపాల్ వినిపించుకోలేదు. ఈ విషయాన్ని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో వివరాలు తెలుసుకోవాలని డీటీడీఓకు కలెక్టర్ సూచించారు.
దీంతో రంగంలోకి దిగిన డీటీడీఓ సదరు ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే విద్యార్థినులను హాస్టల్‌లోకి అనుమతివ్వాలని ఆదేశించడంతో ప్రిన్సిపాల్ దిగొచ్చారు. కాగా ప్రిన్సిపాల్ తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులతోనూ నిత్యం అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, తమ పిల్లలతో మాట్లాడనీయకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment