బంతి తిప్పిన జీవితాలెన్నో.. వాలీబాల్‌ ఎట్‌ ఇనుగుర్తి | Meet Inugurthy Village Where The Place I Is Made Volleyball Players | Sakshi
Sakshi News home page

బంతి తిప్పిన జీవితాలెన్నో.. వాలీబాల్‌ ఎట్‌ ఇనుగుర్తి

Published Sat, Dec 21 2024 8:32 PM | Last Updated on Sat, Dec 21 2024 8:49 PM

Meet Inugurthy Village Where The Place I Is Made Volleyball Players
  • 1971లో మొదలై.. నేటి వరకు వాలీబాల్‌ క్రీడలో రాణింపు
  • రాష్ట్ర,› జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు

కేసముద్రం: వందల మంది వాలీబాల్‌ క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి అందించింది ఇనుగుర్తి. మహబూబాబాద్‌ జిల్లాలోని ఇనుగుర్తి వాలీబాల్‌ క్రీడకు కేరాఫ్‌గా నిలుస్తోంది. 1971లో గ్రామంలో వాలీబాల్‌ ఆట మొదలైంది. గ్రామానికి చెందిన సట్ల భిక్షపతి, మల్లారెడ్డి, విశ్వరూపాచారి, చంద్రయ్య, సట్ల సోమయ్య, ఓరుగంటి శంకరయ్యతోపాటు పలువురికి ఏదో ఒక ఆట నేర్చుకోవాలనే తపన విద్యార్థి దశలోనే కలిగింది. 

అప్పటికే జెడ్పీ హైసూ్కల్‌ ఆవరణలో కొందరు క్రీడాకారులు బ్యాడ్మింటన్, కబడ్డీ ఇతర క్రీడలు ఆడుతుండగా, అందుకు విభిన్నంగా వాలీబాల్‌ క్రీడను నేర్చుకోవాలనే మక్కువతో బంతి పట్టారు. వాలీబాల్‌ గ్రౌండ్‌ ఏర్పాటు చేసుకొని కాళ్లకు కనీసం చెప్పులు లేకుండానే బంతి పట్టి, ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. 

ఈ క్రమంలో అదే పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కందునూరి కొమురయ్య వాలీబాల్‌ క్రీడపై ఆసక్తి చూపుతున్న ఆ విద్యార్థులను చూసి మురిసిపోయారు. క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందించారు. ఆ తర్వాత వారు వాలీబాల్‌ టీంగా ఏర్పడి, 1976లో ప్రస్తుత జనగామ జిల్లా దేవరుప్పలలో జరిగిన క్రిష్ణాసాగర్‌ మెమోరియల్‌ టోర్నమెంట్‌లో(గ్రామీణ క్రీడోత్సవాలు) వరంగల్, నల్లగొండ జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీల్లో ప్రతిభ చాటారు. ఆ తర్వాత ఎంతోమంది వాలీబాల్‌ క్రీడవైపు అడుగులు వేశారు.



స్పోర్ట్స్‌ కోటాలో 60 మందికిపైగా ఉద్యోగాలు..
వాలీబాల్‌ క్రీడపై ఆసక్తితో గ్రామానికి చెందిన ఎంతోమంది యువతీయువకులు రాష్ట్రస్థాయి, యూనివర్సిటీ స్థాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చారు. చదువుతోపాటు, వాలీబాల్‌ క్రీడలో రాణించడంతో గ్రామానికి చెందిన సుమారు 60 మంది స్పోర్ట్స్‌ కోటాలో ఆర్టీసీ, పోలీస్, ఆర్మీ, పోస్టల్, రైల్వేశాఖ, ఉపాధ్యాయ, పీఈటీ, ఎల్‌ఐసీ వంటి ఉద్యోగాలను సాధించి, జీవితంలో స్థిరపడ్డారు. ఇలా బంతి వారి జీవితాలను ఉన్నతస్థాయి వైపునకు మలుపు తిప్పింది.  

భారత్‌ కెప్టెన్‌గా కన్న వెంకటనారాయణ
ఇనుగుర్తిలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన కన్నా వెంకటనారాయణ కొమురయ్య సార్‌ ప్రోత్సాహంతో వాలీబాల్‌ క్రీడలో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. భారత జట్టులో 1986 నుంచి 1996 వరకు పదేళ్లపాటు 20 అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని, ఎన్నో పతకాలను సాధించారు. కన్నా వెంకటనారాయణ ప్రతిభను గుర్తించి 1993–94లో భారత జట్టుకు కెపె్టన్‌గా బాధ్యతలు అప్పగించారు. దశాబ్దకాలంగా భారతజట్టులో ఆడుతూ, కెపె్టన్‌గా వ్యవహరిస్తూ ఎన్నో విజయాలను సాధించారు. దేశంలో మన రాష్ట్రానికి, ఇనుగుర్తి గ్రామానికి వాలీబాల్‌ క్రీడలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఆర్టీసీలో స్పోర్ట్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

మొదటిసారి బంతి పట్టాం...
నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే వాలీబాల్‌ ఆటంటే ఇష్టం పెరిగింది. నాతోపాటు మరికొంతమంది మిత్రులం కలిసి 1971లో వాలీబాల్‌ ఆట మొదలు పెట్టాం. అప్పటి మా గురువు కందునూరి కొమురయ్య సార్‌ శిక్షణ ఇస్తూ, ప్రోత్సహించేవారు. ఆయన ప్రోత్సాహంతో తాము వాలీబాల్‌ క్రీడలో ప్రతిభ కనబరుస్తూ వచ్చాం. అప్పట్లోనే నాకు ఉద్యోగ అవకాశాలు వచ్చినా నా, కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయా. కొమురయ్యసార్‌ తర్వాత నేను ఎంతోమంది క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ, ఎంతో మందిని జిల్లా, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో ఆడించేందుకు తీసుకెళ్లా. ప్రస్తుతం నా ఆరోగ్యం క్షిణించడంతో వైద్యఖర్చుల నిమిత్తం ఉన్న ఇళ్లు అమ్ముకున్న. ప్రస్తుతం ఓ అద్దె ఇంట్లో ఉంటున్న. ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోతున్న. ఆర్థికంగా> ఇబ్బందులు పడుతున్న.. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.
– సట్ల బిక్షం, వాలీబాల్‌ సీనియర్‌ కోచ్, ఇనుగుర్తి

ఆద్యుడు కొమురయ్య సారే..
ఇనుగుర్తి పాఠశాలలో పనిచేసిన కందునూరి కొమురయ్య 1973లో కొంతమంది విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీయాలని నిర్ణయించుకున్నాడు. ప్రతీరోజు వారికి వాలీబాల్‌ క్రీడలో శిక్షణ ఇస్తూ, మెళకువలు నేరి్పంచారు. పాఠశాల స్థాయి పోటీలను నిర్వహించి, వారిలో పోటీతత్వాన్ని పెంపొందించారు. ప్రతీరోజు పాఠశాల ముగిసిన తర్వాత ప్రాక్టీస్‌ చేయించారు. రిటైర్డ్‌ అయ్యాక కూడా మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే కోరికతో యథావిధిగా శిక్షణ ఇస్తూ వచ్చాడు. ఆ విధంగా ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసి, జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పోటీల్లో ఆడించారు. 2012లో కందునూరి కొమురయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన సేవలను గుర్తిస్తూ ఇనుగుర్తి గ్రామం నడి»ొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఏటా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొమురయ్యసార్‌ తర్వాత కోచ్‌గా సట్ల బిక్షం వ్యవహరిస్తూ, ఎంతో మంది క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ వచ్చాడు.

విద్యార్థి దశ నుంచే ప్రోత్సహించాలి
విద్యార్థి దశలోనే వాలీబాల్‌ ఆటపై ఆసక్తి కలిగింది. కొమురయ్యసార్‌ ప్రోత్సాహంతోనే వాలీబాల్‌ క్రీడలో ప్రతిభ చాటి అంతర్జాతీయస్థాయిలో రాణించా. ప్రతి పాఠశాలలో విద్యార్థి దశ నుంచే చదువుతోపాటు, క్రీడల్లో పిల్లలకు తగిన ప్రోత్సాహం అందించాలి. ప్రతీజిల్లాలో స్పోర్ట్స్‌ హాస్టల్‌ ఏర్పాటు చేస్తే విద్యార్థులు ఆటల్లో రాణించేందుకు దోహదపడుతుంది. క్రీడల్లో ప్రతిభ కనబర్చేవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో కోటా అమలు చేయడం వల్ల ఆటలపై ఆసక్తి పెరుగుతుంది.
– కన్నా వెంకటనారాయణ, భారత్‌ వాలీబాల్‌ జట్టు మాజీ కెపె్టన్‌

వాలీబాల్‌ క్రీడతో ఎంతోమంది స్థిరపడ్డారు  
ఇనుగుర్తిలో క్రీడలంటే అంతగా తెలియని రోజుల్లో వాలీబాల్‌ క్రీడ మొదలైంది. నాకు వాలీబాల్‌ అంటే ఎంతో ఇష్టం. నాకు యూనివర్సిటీ స్థాయిలో ఆడే అవకాశం వచి్చంది. మా గ్రామం నుంచి ఎంతోమంది వాలీబాల్‌ క్రీడలో ఉన్నతస్థాయికి ఎదిగారు. వారిని ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఱవాలీబాల్‌ క్రీడను ఎంచుకున్నారు.  
– కన్నా సాంబయ్య, రిటైర్డ్‌ టీచర్, ఇనుగుర్తి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement