inugurthy
-
Inugurthy: మరో కొత్త మండలం... ఇనుగుర్తి
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఇనుగుర్తిని నూతన రెవెన్యూ మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు సోమవారం సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అర్హతలు ఇనుగుర్తికి వున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 607 మండలాలుండగా, తాజాగా మరో కొత్త మండలం ఏర్పాటుతో సంఖ్య 608కి పెరగనుంది. (క్లిక్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. కొత్తగా 13 మండలాలు) -
మంచి మాస్టారికి.. మరపురాని సన్మానం
కేసముద్రం: అక్షరాలు దిద్దించి విజ్ఞానాన్ని పంచిన గురువులకు విద్యార్థుల మదిలో ఎల్లప్పుడూ ఉన్నత స్థానం ఉంటుంది. అమ్మ భాష తెలుగును బోధించే ఉపాధ్యాయుల పట్ల ఆదరాభిమానాలకు హద్దే ఉండదు. అందుకే తెలుగు మాస్టారంటే విద్యార్థులకు అంత ఇష్టం. అలాంటి ఉపాధ్యాయుడొకరికి విద్యార్థులు మరపురాని విధంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ‘మా దేవుడు మీరే మాస్టారు’ అంటూ గురువును విభిన్నంగా గౌరవించుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఓ ఉపాధ్యాయుడు పదవీ విరమణ చేయనున్న సందర్భంగా ఆయనను మేళతాళాల మధ్య ఎడ్ల బండిపై ఊరేగించి విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని జెడ్పీఎస్‌ఎస్‌లో పంజాల సోమనర్సయ్య తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెలలో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రస్తుత, పూర్వ విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులంతా కలిసి సోమవారం సన్మానం ఏర్పాటు చేశారు. సోమనర్సయ్య దంపతులను గ్రామపంచాయతీ నుంచి ఎడ్లబండిపై మేళతాళాల నడుమ ఊరేగింపుగా కిలోమీటర్ దూరంలోని పాఠశాల ఆవరణానికి తీసుకువచ్చి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ దార్ల రామమూర్తి, మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు దికొండ యాకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: శభాష్.. తెలంగాణ పోలీస్!) -
అట్టుడికిన ఇనుగుర్తి... టవర్ దిగని యువకులు
వరంగల్ :వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తే తప్ప టవర్ దిగేది లేదంటూ యువకులు పట్టుబట్టారు. ఇప్పటికి దాదాపు 22 గంటలుగా ఐదుగురు యువకులు టవర్ మీదే ఉండిపోయారు. అధికారులు నేరుగా ప్రకటన చేస్తేనే తాము కిందికి దిగి వస్తామని వాళ్లు స్పష్టం చేస్తున్నారు.శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇనుగుర్తి బంద్ పాటించారు. వివిధ ప్రాంతాల్లోని సెల్ టవర్, వాటర్ ట్యాంకులపైకి మండల సాధన సమితి సభ్యులతోపాటు యువకులు ఎక్కి ఆందోళన నిర్వహించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వం నూతన మండలాల ప్రకటనలో ఎక్కడా ఇనుగుర్తి ప్రస్తావన లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. సీఎం హామీ ఇచ్చారని... ఇనుగుర్తి మండలం వస్తుందని... ఇన్నాళ్లు వేచి ఉన్నామని... ఇప్పుడు తమ ఆశ నిరాశ అయిందని వారు ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టినందుకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను గ్రామస్తులు దహనం చేశారు. అయితే గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించే వరకు తాము దిగేది లేదని... సెల్ టవర్ ఎక్కిన ఆందోళనకారులు భీష్మించుకున్నారు. దీంతో వారు సెల్ టవర్ ఎక్కి 22 గంటలు అయినా కిందకి దిగకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదు. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఇనుగుర్తి విద్యార్థులు
కేసముద్రం : మహబూబ్‌నగర్ జిల్లాలో ఈనెల 21వ తేదీ నుంచి 23 వరకు జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఇనుగుర్తి జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు పీఈటీ కొమ్ము రాజేందర్ తెలిపారు. పాఠశాలలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరంగల్ రంగశాయిపేట జూనియర్ కళాశాలలో స్టూడెంట్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో విద్యార్థులు కిరణ్‌కుమార్, వినయ్, గణేష్, మధు, ప్రణయ్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా వారు రాణించి జాతీయస్థాయికి అర్హత సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పోటీలకు ఎంపికైన విద్యార్థులను వద్దిరాజు సోదరులు, ఎంపీటీసీ సభ్యురాలు దీకొండ యాకలక్ష్మీ, సీనియర్ క్రీడాకారుడు సట్ల బిక్షపతి అభినందించారు.