అట్టుడికిన ఇనుగుర్తి... టవర్ దిగని యువకులు
వరంగల్ :వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తే తప్ప టవర్ దిగేది లేదంటూ యువకులు పట్టుబట్టారు. ఇప్పటికి దాదాపు 22 గంటలుగా ఐదుగురు యువకులు టవర్ మీదే ఉండిపోయారు. అధికారులు నేరుగా ప్రకటన చేస్తేనే తాము కిందికి దిగి వస్తామని వాళ్లు స్పష్టం చేస్తున్నారు.శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇనుగుర్తి బంద్ పాటించారు. వివిధ ప్రాంతాల్లోని సెల్ టవర్, వాటర్ ట్యాంకులపైకి మండల సాధన సమితి సభ్యులతోపాటు యువకులు ఎక్కి ఆందోళన నిర్వహించారు.
గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వం నూతన మండలాల ప్రకటనలో ఎక్కడా ఇనుగుర్తి ప్రస్తావన లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. సీఎం హామీ ఇచ్చారని... ఇనుగుర్తి మండలం వస్తుందని... ఇన్నాళ్లు వేచి ఉన్నామని... ఇప్పుడు తమ ఆశ నిరాశ అయిందని వారు ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టినందుకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను గ్రామస్తులు దహనం చేశారు.
అయితే గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించే వరకు తాము దిగేది లేదని... సెల్ టవర్ ఎక్కిన ఆందోళనకారులు భీష్మించుకున్నారు. దీంతో వారు సెల్ టవర్ ఎక్కి 22 గంటలు అయినా కిందకి దిగకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదు.