
సెల్‌టవర్ ఎక్కి దూకుతానని బెదిరింపు
చాకచక్యంగా కాపాడిన పోలీసులు
నల్లమాడ: పెళ్లి చేయలేదని అలిగిన ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. సెల్‌టవర్ ఎక్కి దూకేస్తానని బెదిరింపులకు దిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంతో అతడిని కిందకు దింపి ప్రాణాలు కాపాడారు. వివరాలిలా ఉన్నాయి. రెడ్డిపల్లికి చెందిన రంగప్ప అనే యువకుడు పూటుగా మద్యం తాగి ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో సమీపంలోని రిలయన్స్ సెల్ టవర్ ఎక్కాడు. తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయడం లేదని, టవర్‌పై నుంచి దూకి చనిపోవాలని ఉందని బిగ్గరగా అరిచాడు.
సమాచారం అందుకున్న నల్లమాడ సీఐ వై.నరేంద్రరెడ్డి వెంటనే అప్రమత్తమై ఓడీ చెరువు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల సహకారంతో రెండు గంటల పాటు శ్రమించి యువకుడికి నచ్చజెప్పి సెల్ టవర్ నుంచి కిందకు దిగేలా చర్యలు తీసుకున్నారు. యువకుడికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించి నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులను ఎస్పీ రత్నతతో పాటు గ్రామస్తులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment