
మద్యం మత్తులో గొడవ
● ఇటుకతో బాదడంతో వ్యక్తి మృతి
హిందూపురం: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఓ వ్యక్తి సహనం కోల్పోయి ఇటుక పెళ్లతో బాదడంతో సుబ్బరాయప్ప(65) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హిందూపురం మండలం గోళాపురం గుడ్డంపల్లిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గోళాపురం గుడ్డంపల్లి కర్ణాటక సరిహద్దున ఉండటంతో పాటు గ్రామంలో బెల్టుషాపులు నిర్వహిస్తుండడంతో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే బంధువులైన సుబ్బరాయప్ప, నంజేగౌడ మంగళవారం పూటుగా మద్యం సేవించారు. ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో కుటుంబ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. దీంతో పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన నంజేగౌడ ఇటుక పెళ్లతో సుబ్బరాయప్ప తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయమైంది. అతన్ని బంధువులు హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా మారడంతో రాత్రి మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నట్లు హిందూపురం రూరల్ సీఐ ఆంజనేయులు తెలిపారు.
‘కియా’ ఇంజిన్ల
దొంగల అరెస్ట్
● 8 మందిని రిమాండ్‌కు పంపిన పోలీసులు
పెనుకొండ: కియా కార్ల పరిశ్రమలో సుమారు 900 ఇంజిన్లను అపహరించిన దొంగలను పెనుకొండ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి..రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే... కియా కార్ల పరిశ్రమలో 900 ఇంజిన్లు మాయమైనట్లు యాజమాన్యం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. ఇంజిన్ల మాయం వెనుక ఇంటిదొంగలే ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే గతంలో కియా కార్ల పరిశ్రమలో పని చేసిన పటాన్ సలీం, వినాయక మూర్తి, మణికంఠ, ఆర్ముగం, అర్జున్ తదితర ఎనిమిది మంది ఉద్యోగులను తమిళనాడులో అరెస్టు చేశారు. నిందితులను బుధవారం రాత్రి పెనుకొండ జడ్జి ఎదుట హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. అనంతరం న్యాయమూర్తి అనుమతితో పోలీసులు నిందితులను కస్టడీకి తీసుకుని విచారణ చేయనున్నారు. నిందితులు దొంగలించిన కియా కార్ల ఇంజిన్లను పడవలు, చెరుకు రసం మిషన్ల కోసం విక్రయించినట్లు తెలిసింది. పోలీసు కస్టడీ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
పండ్లను కృత్రిమంగా
మాగబెడితే చర్యలు
● జాయింట్ కలెక్టర్
అభిషేక్ కుమార్ హెచ్చరిక
ప్రశాంతి నిలయం: ఇంకా పక్వానికి రాని పండ్లను కృత్రిమ రసాయనాలు వినియోగించి మాగబెట్టి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ‘ఆహార సంరక్షణ, ప్రమాణాల చట్టం–2006’ అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. మామిడి, అరటి, బొప్పాయి, దానిమ్మ పండ్లను క్యాల్షియం కార్బైడ్‌తోపాటు ఇతర హానికర రసాయనాలతో కృత్రిమంగా మాగబెట్టి విక్రయించడం వల్ల వాటిని తినే వారు రోగాల బారిన పడుతున్నారన్నారు. చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. అందువల్ల ఎవరూ పండ్లను కృత్రిమంగా మాగబెట్టకూడదన్నారు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రూ.లక్ష వరకూ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఎవరైనా పండ్లను రసాయనాలతో మాగబెడుతుంటే 9441463315 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమావేశంలో ఫుడ్ సేఫ్టీ అధికారి రామచంద్ర, తస్లీమ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మద్యం మత్తులో గొడవ