
ముందస్తు ప్రణాళికలు రూపొందించండి
ప్రశాంతి నిలయం: సత్యసాయి బాబా శతజయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సత్యసాయి శతజయంతి వేడుకల నిర్వహణపై ప్రభుత్వ అధికారులలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సత్యసాయి శతజయంతి వేడుకలు ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్నాయని, ప్రపంచ నలుమూలల నుంచి భక్తులతోపాటు ప్రముఖులు తరలిరానున్నారన్నారు. ప్రధాన మంత్రితోపాటు అత్యున్నత స్థాయి ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. భక్తులకు, ప్రముఖులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రత్యేక హెలిప్యాడ్‌ల ఏర్పాటుతోపాటు ఇంకా అవసరం అయితే అదనపు హెలిప్యాడ్‌ల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు, భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్, పోలీస్ బందోబస్తు, రవాణా సేవలు, నిరంతర విద్యుత్, తాగునీరు, పట్టణ సుందరీకరణ పనులు, భక్తుల కోసం తాత్కాలిక బస్సు ష్టేషన్‌ల ఏర్పాటు, తాత్కాలిక వసతి, మొబైల్ టాయిలెట్స్, చిత్రావతి నది సుందరీకరణ, భద్రతా చర్యలు, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయసారథి, పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు చలం, రోమెల్, డీఆర్‌డీఎ పీడీ నరసయ్య, డీపీఓ సమత తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి శతజయంతి ఉత్సవాలపై సమీక్షలో కలెక్టర్