
‘అనంత’లో దొంగల స్వైర విహారం
అనంతపురం: నగరంలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకూ ఐదు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. నాలుగో రోడ్డు ఎక్స్‌టెన్షన్ శాంతినగర్ గౌరవ గార్డెన్స్‌లో ఉండే ఐదు ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేశారు. గౌరవ్ గార్డెన్ రెండో క్రాస్‌లో ఆర్. మణికంఠ, డి.మహేశ్వరరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, రాజమౌళి, నీలిమ ఇంటి యజమానులు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటి తలుపులకు వేసిన తాళాలతో పాటు ఇన్నర్‌లాకులను సైతం దొంగలు తొలగించారు. ముందుగా తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి చోరీలకు తెగబడ్డారు. రిటైర్డ్ ఆఫీసర్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు దొంగలు చోరీల్లో పాల్గొన్నట్లు తెలిసింది. పోలీసులకు సమాచారం అందడంతో ఉదయమే ఘటనాస్థలాలకు వెళ్లి పరిశీలించారు. వేలిముద్రలను సేకరించారు.
ముఖానికి మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు..
గౌరవ్ గార్డెన్స్‌లో ఏకంగా ఐదు ఇళ్లల్లో చోరీ జరగడం నగర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇద్దరు దొంగలు ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు ధరించారు. కనీసం ఫింగర్ ప్రింట్‌లు కూడా దొరకకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 5:15 నిమిషాల వరకు ఐదు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. అయితే ఐదు ఇళ్లల్లో విలువైన వస్తువులు చోరీకి గురికాలేదు. బంగారు లాకర్లలో పెట్టుకోవడంతో విలువైన వస్తువులు పోలేదు. ఒక ఇంట్లో 8 తులాల బంగారు, వెండి ఉన్నప్పటికీ, బీరువాలో పెట్టకుండా.. పోపు డబ్బాలో దాచుకున్నారు. దీంతో వీరి సొమ్ము భద్రంగా ఉంది. సీసీ కెమెరాల ఫుటేజీని సైతం పరిశీలించి పోలీసులు నిర్ధారణ చేశారు. ఇదిలా ఉండగా, చోరీ జరిగిన ఇళ్లను అనంతపురం అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాసరావు, త్రీటౌన్ సీఐ కే.శాంతిలాల్ పర్యవేక్షించారు.