
ప్రశాంతి నిలయంలో భద్రత కట్టుదిట్టం
ప్రశాంతి నిలయం: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ప్రశాంతి నిలయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వి.రత్న తెలిపారు. శనివారం ఆమె సిబ్బందితో కలసి ప్రశాంతి నిలయంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గణేష్ గేట్, వెస్ట్ గేట్, షాపింగ్ మాల్ ప్రాంతం, సాయికుల్వంత్ సభా మందిరం, భక్తులు బస చేసే బిల్డింగ్‌లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... కాశ్మీర్‌లో ఉగ్రదాడి తర్వాత జిల్లా వ్యాప్తంగా భద్రతా పరమైన అంశాలపై తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు సైతం అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలన్నారు. వివిధ దేశాల నుంచి ప్రశాంతి నిలయానికి భక్తులు వస్తుంటారని, ఇక్కడ భక్తులకు మెరుగైన భద్రత కల్పించాల్సన అవసరం ఉందన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీలు విజయ్ కుమార్, శ్రీనివాసులు, సీఐలు సునీత, ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.