
జగన్‌ను ఎదుర్కోలేకే కూటమి కుట్రలు
సోమందేపల్లి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణచూసి ఓర్వలేక, ఆయన్ను ఎదుర్కొనే ధైర్యం లేక కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. బుధవారం ఆమె సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి ఈనెల 8న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తే పోలీసులు భద్రత కల్పించలేకపోయారన్నారు. ప్రజాభిమానం మెండుగా ఉన్న నాయకుడు కాబట్టే అభిమానులు భారీగా తరలివచ్చారన్నారు. హెలిప్యాడ్ వద్ద పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే అభిమానులు చుట్టుముట్టారని, ఈ క్రమంలోనే హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినిందన్నారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం.. ఆ నెపాన్ని ఇతరులపై తోసివేసేందుకు సిద్ధమైందన్నారు. ఈ క్రమంలోనే విచారణ పేరుతో పైలెట్లను రప్పించిందన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో పర్యటించకుండా కట్టడి చేసేందుకు ప్రైవేట్ ఛాపర్ యజమానులను బెదిరిస్తోందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా... జన సునామీని ఆపలేరన్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడని చెప్పుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతిలో గోమాతల మృతిపై ఎందుకు స్పందించలేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌న్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు అసభ్యకరంగా మాట్లాడితే వారిని వదిలి... ప్రశ్నించిన వారిపై కక్షగట్టి అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. హిందూపురం నియోజకవర్గ నాయకుడు వేణురెడ్డితో పాటు మరికొందరు వైఎస్సార్ సీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గజేంద్ర, జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, సర్పంచ్ అంజినాయక్, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు మంజు, సింగిల్ విండో చైర్మన్లు ఆదినారాయణరెడ్డి, సూర్యప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్