
పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక ప్రగతి
ప్రశాంతి నిలయం: పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని, అందువల్ల ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తగిన సహకారం అందించి పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పారిశ్రామిక ప్రగతిపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఉందన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక పాలసీకి అనుగుణంగా జిల్లా అర్థిక అభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమల స్థాపన కోసం అందిన దరఖాస్తుల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలన్నారు. కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలని పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తిని ఆదేశించారు. అనంతరం జిల్లాలో సీఎస్‌ఆర్ కార్యకలాపాలను సమీక్షించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, ఏసీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహాని, డీపీఓ సమత, ఎల్డీఎం రమణకుమార్, పరిశ్రమల శాఖ అధికారి కె.కృష్ణమూర్తి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి హేమంత్‌రెడ్డి, సీపీఓ విజయ్‌కుమార్, నాబార్డ్ అధికారి అనురాధ, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘మన మిత్ర’పై అవగాహన కల్పించాలి
వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్‌పోస్టర్లను కలెక్టర్‌కు బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో విడుదల చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ‘మన మిత్ర’ పేరిట వాట్సాప్ గవర్నెన్స్‌ను అమల్లోకి తెచ్చిందన్నారు. దీని ద్వారా ప్రస్తుతం 210 సేవలు అందిస్తోందన్నారు. రానున్న రోజుల్లో 350 సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ సేవలు ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం ఏప్రిల్ 15 నుంచి ‘ప్రతి ఇంటికి మన మిత్ర’ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రతి పౌరుడి ఫోన్‌లో 9552300009 నంబర్ సేవ్ చేయించాలన్నారు. పౌరులకు కావాల్సిన ధ్రువపత్రాలు కూడా వాట్సాప్ ద్వారా పొందే అవకాశం ఉందన్నారు.
జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేయాలి
అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం