
అదృశ్యమైన వ్యక్తి మృతి
గార్లదిన్నె/బ్రహ్మసముద్రం: కనిపించకుండా పోయిన బ్రహ్మసముద్రం మండలం కోనాపురం గ్రామానికి చెందిన దండు కరేగౌడ (44) గురువారం ఉదయం గార్లదిన్నె వద్ద మృతదేహమై కనిపించాడు. పోలీసులు తెలిపిన మేరకు... కొంత కాలంగా మానసికంగా ఇబ్బంది పడే కరేగౌడ ఈ నెల 19న గార్లదిన్నెలో నివాసముంటున్న చెల్లెలు ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు సాయంత్రం అలా బయటకు వెళ్లి వస్తానంటూ చెల్లెలుకు తెలిపి ఇల్లు విడిచిన వెళ్లిన ఆయన రాత్రయినా రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. చివరకు బంధువులు ఊర్లలోనూ ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం మధ్యాహ్నం గార్లదిన్నెలోని అక్షర ఇంటర్నేషనల్ పాఠశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. వడదెబ్బతో మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోలీసులు వైరల్ చేయడంతో గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అప్రమత్తమై మృతదేహాన్ని పరిశీలించి, మృతుడిని కరేగౌడగా నిర్ధారించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు గార్లదిన్నె పీఎస్ ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు.
యువకుడి బలవన్మరణం
రాప్తాడు రూరల్: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం రూరల్ మండలం నరసనాయనికుంటకు చెందిన రామచంద్ర నాయక్ కుమారుడు సిద్ధునాయక్ (19) 5వ తరగతి వరకు చదువుకున్నాడు. కేటరింగ్ కార్మికుడిగా పని చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న సిద్దు నాయక్ గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న అవ్వ.. విగతజీవిగా ఉరికి వేలాడుతున్న సిద్దునాయక్‌ను చూసి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని యువకుడి మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న అనంతపురం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
మెడికో ఆత్మహత్యాయత్నం
● పెంచికలపాడు విశ్వభారతి మెడికల్ కళాశాలలో ఘటన
కోడుమూరు రూరల్: గూడూరు మండలం పెంచికలపాడు విశ్వభారతి మెడికల్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని కళాశాలపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన శ్రీనివాసులు, అనిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా, పెద్ద కుమార్తె హన్సిక.. విశ్వభారతి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల నిర్వహించిన పరీక్ష సరిగా రాయలేకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం సాయంత్రం కళాశాల రెండో అంతస్తుపై నుంచి దూకింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను సహ విద్యార్థులు సిబ్బంది వెంటనే కళాశాలలోని హాస్పిటల్‌కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కె.నాగలాపురం పోలీసులు విచారణ చేపట్టారు.
ఐసీడీఎస్ పరిధిలోకి
‘ప్రధానమంత్రి మాతృవందన యోజన’
అనంతపురం: ప్రధానమంత్రి మాతృవందన యోజన శిక్షణ కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ నుంచి ఐసీడీఎస్ పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అనంతపురంలో ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు, సీడీపీఓలకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్రస్థాయి అధికారులు, మెడికల్ డిపార్ట్‌మెంట్ కో–ఆర్డినేటర్లు ,నోడల్ ఆఫీసర్ వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

అదృశ్యమైన వ్యక్తి మృతి