
15 మంది చిన్నారులకు బీఎంటీ చికిత్స
అనంతపురం మెడికల్: ఉమ్మడి జిల్లాలోని 15 మంది తలసీమియా బాధిత చిన్నారులకు బెంగళూరులోని సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో బోన్ మ్యారో ట్రాన్స్‌ఫ్లాంటేషన్ చేయనున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ఫ్లాంటేషన్‌పై తలసీమియాతో బాధపడుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులకు గురువారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. తలసీమియా బాధిత చిన్నారులకు అందించి సదుపాయాలను సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధి ఆంకాలజిస్టు డాక్టర్ మోహన్ రెడ్డి, అభిజిత్, పుష్ప వివరించారు. డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... తలసీమియాతో బాధపడే చిన్నారులకు ప్రీవెంటివ్, చికిత్సనందించేందుకు సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ సహాయం చేస్తోందన్నారు. సర్వజనాస్పత్రిలో గైనిక్ విభాగంలో తలసీమియా జన్యు లోపాన్ని గుర్తించడానికి ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 20 వారాలున్న 1,500 మంది గర్భిణుల్లో తలసీమియా జన్యులోపాన్ని గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో 40 మందిలో జన్యులోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరిలో 8 మంది పుల్ మ్యాచింగ్, మరో ఏడుగురు హాప్ మ్యాచింగ్ అయ్యారన్నారు. అంకాలజిస్టు డాక్టర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ... కేంద్రం సహకారంతో చిన్నారులకు బెంగళూరులోని జైన్ ఆస్పత్రిలో చికిత్సనందిస్తారన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్‌దీన్‌కుమార్, డాక్టర్ శంకర్‌నారాయణ, తదితరులు పాల్గొన్నారు.