సెల్ టవర్ పై నిరసన తెలుపుతున్న గౌతమ్
భద్రాద్రి: తన తాతల నుంచి వచ్చిన రెండున్నర ఎకరాల భూమి, ఇంటిని ఉపసర్పంచ్ అక్రమంగా అక్రమించుకున్నారంటూ మండలంలోని కిన్నెరసాని గ్రామానికి చెందిన సురుగు గౌతమ్ అనే యువకుడు సోమవారం సెల్ టవరెక్కి నిరసన తెలిపాడు. కొత్తగూడెం విద్యానగర్‌లో ఉంటున్న గౌతమ్ కిన్నెరసానిలో తన తల్లిదండ్రులకు చెందిన ఇల్లు, రెండున్నర ఎకరాల భూమిని ఉపసర్పంచ్ కొంగర అప్పారావు ఆక్రమించాడని, ఇల్లు, భూమి ఇప్పించాలని రెవెన్యూ అధికారుల చుట్టూ ఎన్నిసా ర్లు తిరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపించాడు.
తనకు న్యాయం చేసేంతవరకు కిందకు దిగేది లేదని భీష్మించాడు. ఇదే సమస్యపై గతంలో కొత్తగూడెంలో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉదయం 7 గంటల నుంచి సెల్ టవర్‌పై నిరసన వ్యక్తం చేస్తుండగా సమాచారం అందుకున్న రూరల్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ భిక్షం, డీటీ వినయ్ శీలాశ్రీరాం, ఆర్‌ఐ హచ్యా ఘటనా స్థలానికి వెళ్లి కిందకు దిగివస్తే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అయినా గౌతమ్ దిగి రాకపోవడంతో మధ్యాహ్నం 1.30 గంటలకు సీఐ వినయ్‌కుమార్ సెల్‌టవర్ వద్దకు చేరుకుని ఫోన్ ద్వారా నచ్చజెప్పారు. భూమి, ఇంటికి సంబంధించిన కాగితాలు సక్రమంగా ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లి సమస్య పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగివచ్చాడు. అనంతరం కిన్నెరసానిలో ఆక్రమణకు గురైన ఇల్లు, భూమిని గౌతమ్ అధికారులకు చూపించగా పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి భూ రికార్డులను తీసుకుని కలెక్టరేట్‌కు వెళ్లారు. సమస్యను డీఆర్‌ఓ రవీంద్రనాథ్‌కు వివరించగా అక్రమించిన వ్యక్తికి నోటీసులు ఇవ్వాలని డీటీని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment