భద్రాద్రి: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయి. లక్కీ డ్రా వచ్చిందని, విలువైన వాహనాలు, వస్తువులు గెలుచుకున్నారంటూ సైబర్ నేరగాళ్లు ఆశ పెట్టి ఓటీపీ నంబరు తెలుసుకుని, అకౌంట్లలో నగదు జమ చేయించుకుంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా యాప్‌లో పెట్టుబడి పెడితే రోజూ కొంత మొత్తం చొప్పున నిరంతరం తిరిగి డబ్బు జమచేస్తామని నమ్మించారు. సుమారు రూ. 2.5 కోట్లు కాజేశారు. దీంతో సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో పలువురు పాక్స్‌కాన్ యాప్‌లో పెట్టి ఆర్థికంగా నష్టపోయారు.
బుధవారం ఈ యాప్ అకస్మాత్తుగా క్లోజ్ అవడంతో లబోదిబోమంటున్నారు. స్థానికుల కథనం ప్రకారం... మండల కేంద్రంలోని దమ్మపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా మూడు నెలల క్రితం పాక్స్‌కాన్ అనే యాప్ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది ప్లే స్టోర్‌లో అందుబాటులో లేదు. కేవలం లింక్ ద్వారా మాత్రమే ఒకరి నుంచి మరొకరికి పంపుకున్నారు.
లింక్ ద్వారా యాప్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న పలువురు యువకులు పెట్టుబడి పెట్టారు. రూ.500 నుంచి ప్రారంభమై రూ. లక్ష వరకు పెట్టుబడి పెట్టవచ్చని, రూ.500 పెట్టుబడి పెడితే రోజూ రూ.12.50 చొప్పన తిరిగి వస్తాయని, యాప్ లింక్‌ను వేరొకరికి పంపి పెట్టుబడి పెట్టిస్తే, అందులో 10 శాతం కమీషన్ వస్తుందని యాప్ నిర్వాహకులు నమ్మించారు. మొదటిలో పెట్టుబడిన పెట్టిన వారికి రోజూ డబ్బులు తిరిగి పంపించారు.
దీంతో నమ్మకం కుదిరి వారు మళ్లీ ఎక్కువ పెట్టుబడి పెట్టారు. వారిని చూసి మరికొందరు యువత కూడా యాప్‌లో పెట్టుబడి పెట్టారు. ఇలా 250 మంది వరకు పెట్టుబడి పెట్టి, ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు కూడా క్రియేట్ చేసుకున్నారు. కాగా రెండు వారాల క్రితం పెట్టిన పెట్టుబడి మొత్తం 10 రోజుల్లో తిరిగి ఇస్తామని యాప్ ద్వారా ప్రచారం చేయాగా చాలామంది రూ.5 వేల నుంచి రూ. లక్ష చొప్పున రూ. 2.5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు.
పది రోజుల గడిచినా ఎవరికీ తిరిగి రూపాయి ఇవ్వలేదు. దీంతో ఆందోళనకు గురయ్యారు. ఇంకా తిరిగి వస్తాయనే ఆశతో ఎదురుచూస్తుండగా మంగళవారం రాత్రి పాక్స్‌కాన్ యాప్‌ను ఆన్‌లైన్‌లో పూర్తిగా క్లోజ్ చేశారు. టెక్నికల్ సమస్యగా భావించిన పెట్టుబడి దారులు, వేచిచూసి బుధవారం యాప్‌ను ఒపెన్ చేయడానికి ప్రయత్నించిన సాధ్యం కాలేదు. దీంతో తాము తీవ్రంగా మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు.
Comments
Please login to add a commentAdd a comment