బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో కందిమళ్ల సతీశ్ (ఫైల్)
సాక్షి ప్రతినిధి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికల సమయంలో భద్రాచలంలో అధికార బీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే కందిమల్ల సతీశ్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. పట్టణంలోని దిగువ చప్టా ప్రాంతానికి చెందిన సతీశ్ అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికను మాయమాటలతో లోబరుచుకుని స్థానికంగా ఓ లాడ్జీకి తీసుకెళ్లాడు.
విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు నేరుగా అక్కడికి వెళ్లి సతీశ్ చేస్తున్న మోసాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడే అతడికి దేహశుద్ధి చేశాక బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన కందిమల్ల సతీశ్‌ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఇప్పటికే సెటిల్‌మెంట్ సతీశ్‌గా భద్రాచలంలో అతడి అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. గతంలో పెళ్లి చేసుకుని, ఆ మహిళ మరణానికి కారణమయ్యాడని, ఇలాంటి వారికి బీఆర్‌ఎస్ అండగా నిలవడం దారుణమని విమర్శించాయి.
పార్టీతో సంబంధం లేదు..
ప్రైవేటు లాడ్జిలో బాలికతో ఉన్న సతీష్ బీఆర్‌ఎస్ యువజన నాయకుడని ఇతర పార్టీల వారు చెప్పడాన్ని తాము ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ భద్రాచలం మండల అధ్యక్షుడు అరికలె తిరుపతిరావు ప్రకటించారు. ఆయనకు బీఆర్‌ఎస్‌లో ఎలాంటి పదవీ లేదని, పార్టీతో సంబంధం లేదని అన్నారు. అయితే నిందితుడు సతీశ్ గతంలో బీఆర్‌ఎస్ పార్టీ నేతలతో కలిసి దిగిన ఫొటోలు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వీడియో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన భద్రాచలంలో రాజకీయ దుమారానికి కారణమైంది.
పోక్సో కేసు నమోదు చేశాం..
బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని భద్రాచలం సీఐ నాగరాజు తెలిపారు. బాలికకు మాయమాటలు చెప్పి లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment