సహకార సంఘ బలం! | Cotton seed is a direct example of the capability | Sakshi
Sakshi News home page

సహకార సంఘ బలం!

Published Mon, May 26 2014 12:14 AM | Last Updated on Mon, Oct 1 2018 4:42 PM

సహకార సంఘ బలం! - Sakshi

సహకార సంఘ బలం!

పత్తి సాగులో సత్తా చాటుతున్న సూటి విత్తనం
 
మన కోసం మనం

  • ఖరీదైన బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలకు స్వస్తి
  • తిరిగివాడుకోదగిన సూటి విత్తనాలపై  గుంటూరు జిల్లా పత్తి రైతుల మక్కువ
  • వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల రైతుల నుంచీ సానుకూల స్పందన

మన దేశంలో సాగవుతున్న మొదటి జన్యుమార్పిడి పంట పత్తి. బీటీ పత్తి రాకతో కొన్నేళ్లలోనే పత్తి విత్తనాల ధర అమాంతం పెరిగిపోయింది. రైతుల విత్తనాలు దాదాపు కనుమరుగై విత్తనం పరాధీనమైంది. బహుళజాతి కంపెనీ ఇచ్చినవి విత్తనాలు.. చెప్పింది రేటైంది. బీటీ పత్తి విత్తనాలను ప్రభుత్వం నిర్దేశించిన ధర(450 గ్రాముల సంచి రూ. 930)కు అనేక రెట్లు ఎక్కువ ధర చెల్లించి నల్లబజారులో కొనుక్కున్న రోజులూ వచ్చాయి. బీటీ టెక్నాలజీ వల్లే పత్తి రైతుల ఉద్ధరణ సాధ్యమన్న బుకాయింపుల నడుమ.. మన పరిశోధన, విస్తరణ రంగ సిబ్బందిని బీటీ పత్తి వంగడాల ప్రచారకులుగా మార్చారు. ఈ ఒరవడిని మార్చేదెలా? రైతును తిరిగి విత్తన స్వావలంబన సాధన బాటలో నిలిపేదెలా? ఖర్చు తక్కువతో పంటల సాగును నడిపే దిశలోకి సామాన్య రైతును నడిపేదెలా? ఎలా..??
 
 ఈ ప్రశ్నలకు గుంటూరు జిల్లా రైతులు సంఘటితంగా సమాధానాలు వెదుకుతున్నారు. డా. కురియన్ సహకారోద్యమ స్ఫూర్తితో ‘మన కోసం మనం’ అంటూ..  ప్రతి ఏటా బీటీ విత్తనాలను అధిక ధరకు కొనడం మాని, మెరుగైన దిగుబడులిస్తూ తిరిగి వాడుకోవడానికి వీలయ్యే సూటి రకం పత్తి విత్తనాలను సమకూర్చుకున్నారు. సాగు వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకుంటూనే మంచి దిగుబడులు పొందుతున్నారు. వీరి కృషి రైతు లోకానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. రైతు రక్షణ-1, రైతు రక్షణ-2 అనే సూటి రకాలతోపాటు, రైతు రక్షణ హైబ్రిడ్‌ను కూడా రైతు రక్షణ వేదిక రైతులకు అందుబాటులోకి తెచ్చింది. సూటి రకాల విత్తనాలను అర కేజీ ప్యాకెట్ రూ.100 చొప్పున, హైబ్రిడ్ విత్తనాలను అర కేజీ రూ.450 చొప్పున రైతులకు ఇస్తున్నారు. సూటి రకాల సాగు ఇతర జిల్లాలకూ విస్తరిస్తుండడం విశేషం.   
 
 ఇలా ప్రారంభమైంది..
గుంటూరు జిల్లాలో రైతు రక్షణ వేదిక రెండేళ్ల క్రితం రూపుదాల్చింది. ఏడు రైతు సంఘాల ప్రతినిధులు, విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్తలు, సైన్స్ ప్రచార కార్యకర్తలు, సామాజిక ఉద్యమకారులు సమష్టిగా ఈ వేదికను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అధికారుల తోడ్పాటు లభించడం విశేషం. విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాలరావు, డా. పరమేశ్వర్‌రెడ్డి, కె. అజయ్‌కుమార్ తదితరులు ఇందులో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వేదిక  ఆధ్వర్యంలో పత్తి రైతుల పరస్పర సహాయ సహకార సంఘం (ఏపీఎస్‌సీఎస్-1324/2012) పురుడు పోసుకుంది. సమావేశాలు నిర్వహించి రైతులను కూడగట్టే ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం సంఘంలో 800 మంది పత్తి రైతులు సభ్యులుగా ఉన్నారు.
 
 అందుబాటులోకి రైతు రక్షణ వంగడాలు
చిన్న, సన్నకారు రైతుల పరిరక్షణలోని వివిధ పత్తి మూల రకాలలో నుంచి ప్రముఖ బ్రీడర్ జొన్నలగడ్డ రామారావు సహకారంతో కొన్ని అనువైన వంగడాలను రైతు రక్షణ వేదిక సిద్ధం చేసింది. పెద్ద కాయలు కాచే, పురుగులను తట్టుకోగల లక్షణాలున్న పత్తి వంగడాలను ప్రదర్శనా క్షేత్రాల ద్వారా వెలుగులోకి తెచ్చింది.
 
 ‘రైతు రక్షణ-1’  పత్తి మొక్కకు పెద్ద కాయలతోపాటు గింజ పరిమాణం కూడా పెద్దదిగా ఉంటుంది. దీన్ని గుంటూరు జిల్లాలోని రైతులతో కాకుండా.. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనూ రైతులతో సాగు చేయించారు. ముందుగా విత్తి, సాగు విధానంలో మెలకువలు పాటించిన పొలాల్లో హైబ్రిడ్‌తో సమానంగా ఇది దిగుబడినిచ్చిందని వేదిక తెలిపింది. అదేవిధంగా, నల్లరేగడి నేలలతోపాటు, తేలిక నేలల్లో వర్షాధారంగా సాగు చేసిన రైతులను కూడా ఈ రకం సంతృప్తినిచ్చింది. ఆలస్యంగా నాటిన సందర్భాల్లో దీనికి గూడ పురుగు, తెల్ల దోమ తాకిడి వచ్చింది. అయినా, ఎకరాకు 10 క్వింటాళ్లకు తక్కువ కాకుండా దిగుబడి వచ్చింది.
 
 రైతు రక్షణ-2తో అధిక దిగుబడి  
 పెద్ద కాయలతో, కాయతొలిచే పురుగుల్ని గట్టిగా తట్టుకోగలిగిన మరొక సూటి రకం ‘రైతు రక్షణ-2’. ఇది ముందుగా కాపుకొచ్చి, తక్కువ పంట కాలం(130-145 రోజులు)లోనే మంచి దిగుబడినిచ్చే రకం. కాయ విచ్చుకోవటంలో కూడా అనుకూలత ఉన్న రకం. పొలంలో ఎక్కువ మొక్కల్ని నాటే వీలు కల్పించే రకమిది. సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో హైబ్రిడ్‌తో సమానంగా దిగుబడి(15-18 క్వింటాళ్లు/ఎకరం) ఇవ్వగలదని రైతుల అనుభవంలో తేలినట్లు వేదిక బాధ్యులు తెలిపారు. నాణ్యమైన పత్తిని, ముందుగా మార్కెట్‌కు అందించగలగడం ద్వారా రైతు మెరుగైన ధర పొందే అవకాశం ఉందంటున్నారు.
 
 రైతు రక్షణ హైబ్రిడ్‌పై రైతుల సంతృప్తి
 అదేవిధంగా కంపెనీలకు సంకర (హైబ్రిడ్) విత్తనాలను తయారు చేస్తున్న చిన్న రైతుల ద్వారా.. మంచి దిగుబడినిచ్చే లక్షణాలున్న రైతు రక్షణ హైబ్రిడ్ పత్తి విత్తనాలను కూడా వేదిక అందుబాటులోకి తెచ్చింది. ఈ హైబ్రిడ్ విత్తనాలు కంపెనీల హైబ్రిడ్ విత్తనాలతో సమానంగా దిగుబడిని స్తుండడంతో రైతులు సంతృప్తి చెందుతున్నారని వేదిక చెబుతోంది. ఈ విత్తనాలు కాయతొలిచే పురుగుతోపాటు పచ్చదోమ తాకిడిని కూడా కొంత వరకు తట్టుకున్నాయని, పత్తి తీసేందుకు అనువుగా కాయ పక్వానికొచ్చి పగలటం మరో ప్రయోజనమని వేదిక నేతలు చెబుతున్నారు.  

 రైతు రక్షణ పత్తి విత్తనాల వినియోగం ఏటేటా విస్తరిస్తున్నది. 2013-14లో సుమారు వెయ్యి ఎకరాల్లో రైతు రక్షణ పత్తి విత్తనాలను రైతులు సాగు చేశారు. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నందున వచ్చే(2014-15) పంటకాలంలో మరింత విస్తరిస్తుందని వేదిక ఆశిస్తోంది. ఇతర జిల్లాల్లో రైతులకు కూడా అందుబాటులోకి తేవడానికి 5, 6 వేల అర కిలో విత్తన ప్యాకెట్లను సిద్ధం చేసింది. గుంటూరు పత్తి రైతులు సహకార స్ఫూర్తితో చూపిన సూటి విత్తనం దారి చిన్నా పెద్దా అని తేడా లేకుండా రైతులందరికీ నిస్సందేహంగా వెలుగుబాటే.
 
 వివరాలకు: కె. అజయ్‌కుమార్ (73822 96452, 94917 95406), కార్యదర్శి, రైతు రక్షణ వేదిక, చంద్రమౌళి నగర్ 7వ లైను, 1వ అడ్డరోడ్డు, గుంటూరు-522007.
- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
 
 చైనాలోనూ సూటి విత్తనమే..!
 బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలు తప్ప రైతులకు ప్రత్యామ్నాయం లేదన్న ప్రచారంతో పత్తి విత్తనం అంతా మోన్‌శాంటో కంపెనీ చెప్పుచేతల్లోకి వెళ్లిపోతోంది. తేలిక నేలల్లో వర్షాధారంగా పత్తి సాగు చేసే రైతులు కూడా అతి ఖరీదైన బీటీ హైబ్రిడ్ విత్తనాన్ని ప్రతి ఏటా కొని వాడాల్సిన దుర్గతి పట్టింది. ఒక్కోసారి వర్షం చాలకపోతే దిగుబడి బాగా తగ్గి అప్పులపాలై రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. సూటి రకం వాడితే విత్తనం ఖర్చుతోపాటు ఎరువులు, పురుగుమందుల ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అన్నిటికీ మించి రైతు చేతిలోనే విత్తనం ఉంటుంది. చైనాలో రైతులు సూటి రకాలనే వాడుతున్నారు. అందుకే మోన్‌శాంటో అక్కడ దివాలా తీసింది.
 
బ్రెజిల్‌లోనూ ఇంతే. అమెరికాలోనూ సూటి రకాలనే వాడుతున్నారు. ఎక్కడా లేని విధంగా మన దేశంలోనే బీటీ హైబ్రిడ్ తప్ప మరో దారి లేదనేలా మన ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయం కళ్లప్పగించి చూస్తుండడం విషాదకరం.  తేలిక నేలల్లో వర్షాధారంగా పత్తి సాగును సజావుగా సాగాలంటే రైతుల సహకార సంఘాల ద్వారా సూటి విత్తనాల వాడకాన్ని వ్యాప్తిలోకి తేవడం అనివార్యం. ఈ లక్ష్యసాధన కోసమే రైతు రక్షణ వేదిక  ప్రభుత్వ సంస్థల తోడ్పాటును కూడా తీసుకుంటూ ఇతర జిల్లాల్లోనూ పత్తి సూటి రకాల వ్యాప్తికి కృషి చేస్తోంది.

 - ప్రొ. ఎన్. వేణుగోపాలరావు (94900 98905), విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త, అధ్యక్షుడు, రైతు రక్షణ వేదిక, గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement