Parameshwar reddy
-
12 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు..
తిరుపతి క్రైం: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఓ బాలుడు తెల్లవారుజామున కిడ్నాప్ కాగా... 12 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించి తిరిగి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను మంగళవారం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి మీడియాకు వివరించారు. చెన్నైకి చెందిన చంద్రశేఖర్, మీనా దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం అర్ధరాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని చెన్నై ప్లాట్‌ఫాం వద్ద నిద్రపోయారు. తెల్లవారుజామున మెలకువ వచ్చి చూడగా, రెండో కుమారుడు అరుల్ మురుగన్(2) కనిపించలేదు. దీంతో వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి డీఎస్పీ సురేందర్‌రెడ్డి, క్రైం డీఎస్పీ రవికుమార్, సీఐ మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు వెంటనే బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సీపీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని తెల్లవారుజామున 2.12 గంటలకు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని అవిలాల సుధాకర్‌గా నిర్ధారించుకుని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో అవిలాల సుధాకర్ కిడ్నాప్ చేసిన బాలుడిని ఏర్పేడు మండలంలోని మాల గ్రామంలో తన అక్క నెల్లూరి ధనమ్మ వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టినట్టుగా సమాచారం అందింది. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో పోలీసులు వెళ్లి బాలుడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సుధాకర్‌తోపాటు ధనమ్మ, మరికొందరిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. -
తిరుమలలో ఎలాంటి ఉగ్రవాద కదలికలు లేవు
-
బతికుండగా పదిమందికి పట్టెడన్నం.. చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): తాను బతికి ఉండగా నాగలి చేతబట్టి ధాన్యరాశులు పండించి పదుగురికీ పట్టెడన్నం పెట్టాడు. చివరకు మరణించాక కూడా ఐదుగురికి తన అవయవాలను దానం చేసి వారిలో జీవిస్తున్నాడు. కర్నూలు మండలం పడిదెంపాడు గ్రామానికి చెందిన పరమేశ్వరరెడ్డికి ఈ నెల 5వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని కర్నూలు నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌కు తరలించారు. అతన్ని రక్షించేందుకు మూడురోజుల పాటు వైద్యులు ఎంతో శ్రమించారు. కానీ దురదృష్టవశాత్తూ అతను మంగళవారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆ తర్వాత వైద్యబృందం అవయవదానంపై వారి కుటుంబసభ్యులు భార్య, కుమారులకు, బంధువులకు అవగాహన కల్పించారు. వారి అంగీకారంతో కళ్లు, కాలేయం, రెండు కిడ్నీలు దానం చేశారు. చనిపోతూ అతను మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని మృతుని కుటుంబసభ్యులు తెలిపారు. జీవనధాన్ ఆధ్వర్యంలో అవసరం ఉన్న చోటికి గ్రీన్‌చానెల్ ద్వారా కాలేయం, కిడ్నీలను తరలించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. చదవండి: (సత్తెనపల్లిలో కుమ్మేసుకున్న తెలుగు తమ్ముళ్లు) -
వైఎస్‌ను అలా చూస్తూ ఉండిపోయా.. సీఎం జగన్ ఆప్యాయతకు మారుపేరు
ఓ మారుమూల పల్లె.. దిగువ మధ్యతరగతి కుటుంబం.. తండ్రి ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి.. తల్లి గృహిణి.. ముగ్గురు పిల్లలు.. ఇద్దరు కుమార్తెలు.. ఓ కుమారుడు. నీళ్లు లేక ఊళ్లో అప్పటికే పొలాలు పండని దైన్యం. నాన్న ముగ్గురు బిడ్డలకూ ఒక్కటే మాట పదేపదే చెప్పారు. చదువు.. చదువు.. చదువు.. ఆ ముగ్గురికీ అదే తారకమంత్రమైంది. మిషినరీ, సర్కారు బడులు, కాలేజీల్లో చదువుకున్నప్పటికీ ముగ్గురూ గ్రూప్–1, 2 ఉద్యోగాలు సాధించారు. ఆ ముగ్గురిలో ఓ విద్యార్థి డాక్టర్ అవ్వాలనుకున్నారు.. ఇంటర్లో బైపీసీ తీసుకున్నారు.. కానీ ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్‌కి డొనేషన్ కట్టాలి.. అంత సొమ్ము లేకపోవడంతో ఏమీ నిరుత్సాహపడలేదు.. చక్కగా డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత పీజీ వైపు చూడలేదు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. కష్టం ఫలించి మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–1 పరీక్షల్లో స్టేట్ 8వ ర్యాంక్ సాధించారు. డీఎస్పీ అయ్యారు.. సర్వీస్‌లోకి వచ్చిన కేవలం ఎనిమిదేళ్ల వ్యవధిలోనే ఏకంగా ముఖ్యమంత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వరకు ఎదిగారు.. ఆయనెవరో కాదు.. తిరుపతి జిల్లా ఎస్పీ పోతన్నగారి పరమేశ్వరరెడ్డి. ఆ స్ఫూర్తిదాయక ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఆయన మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, తిరుపతి మాదో చిన్న పల్లెటూరు. ఐదు వందల గడపలు మాత్రమే ఉంటాయి. నాన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)లో చిరుద్యోగిగా పని చేశారు. అమ్మ గృహిణి. మేం ముగ్గురు పిల్లలం. అక్క శ్రీలక్ష్మి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి. చెల్లి నాగజ్యోతి గ్రూప్–2 ఆఫీసర్. వ్యవసాయ నేపథ్యంలో కలిగిన మా కుటుంబంలో ఎస్ఎస్ఎల్సీ చదివిన ప్రథమ వ్యక్తి మా నాన్నే. సాగునీరు సరిగా లేక, బీడు భూముల్లో వ్యవసాయం చేయలేక ఊళ్లో రైతుల కష్టాలను కళ్లారా చూసిన వ్యక్తిగా ఆయన మాకె ప్పుడూ చదువు విలువను తెలియజేస్తూ ఉన్నత విద్య దిశగా నడిపించారు. కేజీ నుంచి డిగ్రీ వరకు మిషినరీ, సర్కారు కళాశాలలే.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అనంతపురం పట్టణంలోని సెయింట్ అగస్టీన్ స్కూల్లో విద్యనభ్యసించా. ఆరు నుంచి పదో తరగతి వరకు ఎల్‌ఆర్‌జి హైస్కూల్లో, ఇంటర్లో బైపీసీ తీసుకుని శ్రీసత్యసాయిబాబా జూనియర్ కళాశాలలో చదివాను. ఎంబీబీఎస్‌లో చేరేందుకు ఎంసెట్ రాసినా డొనేషన్‌తో చేరే ర్యాంక్ వచ్చింది. కానీ నాన్నకు ఆర్థిక భారం కాకూడదనుకున్నా. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బయోటెక్నాలజీలో బీఎస్సీ పూర్తి చేశాను. ఆ తర్వాత పీజీ కోసం వెంపర్లాడలేదు. డిగ్రీ పూర్తి కాగానే గ్రూప్స్‌కు సిద్ధమయ్యాను. స్ఫూర్తినిచ్చిన ఆర్ట్స్ కాలేజీ.. అనంతపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణ, నీలం సంజీవరెడ్డి ఇక్కడే చదువుకున్నారు. సంజీవరెడ్డి అయితే ఇక్కడ అధ్యాపకులుగా కూడా పనిచేశారు. డీజీపీలుగా పనిచేసిన జేవీరాముడు, అరవిందరావు కూడా ఇక్కడే చదివారు. ఇలా ఎందరో విద్యార్థులు ఇక్కడ చదివి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా దేశవ్యాప్తంగా సేవలు అందించారు. ఆ స్ఫూర్తితోనే కళాశాలలో డిగ్రీ చదువుతుండగానే గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యాను. ఇక కళాశాలలో చదువుతున్న రోజుల్లో అనంతపురం ఎస్పీగా పనిచేసిన స్టీఫెన్ రవీంద్రకి పబ్లిక్‌లో ఉన్న క్రేజ్ చూసి పోలీసైతే బాగుండని అనుకున్నా. వైఎస్‌ను అలా చూస్తూ ఉండిపోయా.. 2008లో గ్రూప్–1కి ఎంపికైన అభ్యర్థులను అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఆయనలోని రాజసం, ముఖంపై చిరునవ్వు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయా. ప్రజలకు సేవ చేసేందుకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ప్రభుత్వోద్యోగం. నిజాయితీగా, నిబద్ధతతో పనిచేయాలని ఆయన చెప్పిన మాటలు, ఆయన్ను చూసిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు. ఆయన ఆప్యాయతకు మారుపేరు ముఖ్యమంత్రి సీఎస్ఓగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం అందరికీ రాదు. అరుదుగా వచ్చే ఈ అవకాశం నాకు త్వరగా వరించిందనే చెప్పాలి. తన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరి పట్ల సీఎం వైఎస్ జగన్ ఎంతో ఆప్యాయంగా ఉంటారు. ఉద్యోగుల్లా కాకుండా కుటుంబ సభ్యుల్లా చూస్తారు. ప్రశాంతత ముఖ్యం విద్యార్థి దశ చాలా కీలకం. ఆ సమయంలో ప్రశాంతంగా.. ప్రణాళికా బద్ధంగా చదివితే ఉన్నత లక్ష్యాలను సులువుగా అందుకోవచ్చు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, లక్ష్యం గురితప్పిందనో నిరాశ చెందకూడదు. కనీస సౌకర్యాలు లేని గ్రామాల నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకున్న ఎందరో గొప్ప వ్యక్తులే మనకు ఆదర్శం. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం(ఫైల్) ఇష్టదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి మా కుటుంబానికి ఇష్టదైవం తిరుమల వేంకటేశ్వరస్వామి. నేడు అదే స్వామి వారి పాదాల చెంత జిల్లా ఎస్పీగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. శ్రీ వారి ఆశీస్సులతోనే నాకు ఈ జిల్లాలో పనిచేసే అవకాశం వచ్చిందనుకుంటున్నా. కుటుంబ నేపథ్యం పేరు: పోతన్నగారి పరమేశ్వరరెడ్డి పుట్టిన తేది: 30.07.1983 తల్లిదండ్రులు: నాగలక్ష్మి, నారాయణరెడ్డి సొంతూరు: పులేటిపల్లె గ్రామం, సీకేపల్లి మండలం, అనంతపురం జిల్లా భార్య: సాయిప్రసన్న(ప్రకాశం జిల్లా) పిల్లలు: ధాత్రిసాయిరెడ్డి, వైభవ్ విద్యాభ్యాసం: డిగ్రీ హాబీలు: సినిమాలు చూడటం ఉద్యోగ ప్రస్థానం: 2008లో నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో ర్యాంక్ వచ్చింది. శిక్షణ పూర్తయిన తర్వాత 2011లో మొదటి పోస్టింగ్ కృష్ణా జిల్లా గుడివాడ డీఎస్పీగా వచ్చింది. ఆ తర్వాత వరుసగా.. ►గ్రేహౌండ్స్ కమాండర్ ►కరీంనగర్ జిల్లా జగిత్యాల డీఎస్పీ ►తెలంగాణాలో సీఐడీ డీఎస్పీ ►నెల్లూరు ఏసీబీ డీఎస్పీ ►2018: ఏఎస్పీగా పదోన్నతి. నెల్లూరులోనే అడ్మిన్ ఏఎస్పీగా బాధ్యతలు ►2019: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం ముఖ్య భద్రతాధికారిగా అవకాశం. రెండేళ్ల పాటు విధులు. ►2021: ఐపీఎస్కి ఎంపిక. ►2022: తిరుపతి జిల్లా ఎస్పీగా నియామకం. -
సహకార సంఘ బలం!
పత్తి సాగులో సత్తా చాటుతున్న సూటి విత్తనం మన కోసం మనం ఖరీదైన బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలకు స్వస్తి తిరిగివాడుకోదగిన సూటి విత్తనాలపై గుంటూరు జిల్లా పత్తి రైతుల మక్కువ వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల రైతుల నుంచీ సానుకూల స్పందన మన దేశంలో సాగవుతున్న మొదటి జన్యుమార్పిడి పంట పత్తి. బీటీ పత్తి రాకతో కొన్నేళ్లలోనే పత్తి విత్తనాల ధర అమాంతం పెరిగిపోయింది. రైతుల విత్తనాలు దాదాపు కనుమరుగై విత్తనం పరాధీనమైంది. బహుళజాతి కంపెనీ ఇచ్చినవి విత్తనాలు.. చెప్పింది రేటైంది. బీటీ పత్తి విత్తనాలను ప్రభుత్వం నిర్దేశించిన ధర(450 గ్రాముల సంచి రూ. 930)కు అనేక రెట్లు ఎక్కువ ధర చెల్లించి నల్లబజారులో కొనుక్కున్న రోజులూ వచ్చాయి. బీటీ టెక్నాలజీ వల్లే పత్తి రైతుల ఉద్ధరణ సాధ్యమన్న బుకాయింపుల నడుమ.. మన పరిశోధన, విస్తరణ రంగ సిబ్బందిని బీటీ పత్తి వంగడాల ప్రచారకులుగా మార్చారు. ఈ ఒరవడిని మార్చేదెలా? రైతును తిరిగి విత్తన స్వావలంబన సాధన బాటలో నిలిపేదెలా? ఖర్చు తక్కువతో పంటల సాగును నడిపే దిశలోకి సామాన్య రైతును నడిపేదెలా? ఎలా..?? ఈ ప్రశ్నలకు గుంటూరు జిల్లా రైతులు సంఘటితంగా సమాధానాలు వెదుకుతున్నారు. డా. కురియన్ సహకారోద్యమ స్ఫూర్తితో ‘మన కోసం మనం’ అంటూ.. ప్రతి ఏటా బీటీ విత్తనాలను అధిక ధరకు కొనడం మాని, మెరుగైన దిగుబడులిస్తూ తిరిగి వాడుకోవడానికి వీలయ్యే సూటి రకం పత్తి విత్తనాలను సమకూర్చుకున్నారు. సాగు వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకుంటూనే మంచి దిగుబడులు పొందుతున్నారు. వీరి కృషి రైతు లోకానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. రైతు రక్షణ-1, రైతు రక్షణ-2 అనే సూటి రకాలతోపాటు, రైతు రక్షణ హైబ్రిడ్‌ను కూడా రైతు రక్షణ వేదిక రైతులకు అందుబాటులోకి తెచ్చింది. సూటి రకాల విత్తనాలను అర కేజీ ప్యాకెట్ రూ.100 చొప్పున, హైబ్రిడ్ విత్తనాలను అర కేజీ రూ.450 చొప్పున రైతులకు ఇస్తున్నారు. సూటి రకాల సాగు ఇతర జిల్లాలకూ విస్తరిస్తుండడం విశేషం. ఇలా ప్రారంభమైంది.. గుంటూరు జిల్లాలో రైతు రక్షణ వేదిక రెండేళ్ల క్రితం రూపుదాల్చింది. ఏడు రైతు సంఘాల ప్రతినిధులు, విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్తలు, సైన్స్ ప్రచార కార్యకర్తలు, సామాజిక ఉద్యమకారులు సమష్టిగా ఈ వేదికను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అధికారుల తోడ్పాటు లభించడం విశేషం. విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాలరావు, డా. పరమేశ్వర్‌రెడ్డి, కె. అజయ్‌కుమార్ తదితరులు ఇందులో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వేదిక ఆధ్వర్యంలో పత్తి రైతుల పరస్పర సహాయ సహకార సంఘం (ఏపీఎస్సీఎస్-1324/2012) పురుడు పోసుకుంది. సమావేశాలు నిర్వహించి రైతులను కూడగట్టే ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం సంఘంలో 800 మంది పత్తి రైతులు సభ్యులుగా ఉన్నారు. అందుబాటులోకి రైతు రక్షణ వంగడాలు చిన్న, సన్నకారు రైతుల పరిరక్షణలోని వివిధ పత్తి మూల రకాలలో నుంచి ప్రముఖ బ్రీడర్ జొన్నలగడ్డ రామారావు సహకారంతో కొన్ని అనువైన వంగడాలను రైతు రక్షణ వేదిక సిద్ధం చేసింది. పెద్ద కాయలు కాచే, పురుగులను తట్టుకోగల లక్షణాలున్న పత్తి వంగడాలను ప్రదర్శనా క్షేత్రాల ద్వారా వెలుగులోకి తెచ్చింది. ‘రైతు రక్షణ-1’ పత్తి మొక్కకు పెద్ద కాయలతోపాటు గింజ పరిమాణం కూడా పెద్దదిగా ఉంటుంది. దీన్ని గుంటూరు జిల్లాలోని రైతులతో కాకుండా.. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనూ రైతులతో సాగు చేయించారు. ముందుగా విత్తి, సాగు విధానంలో మెలకువలు పాటించిన పొలాల్లో హైబ్రిడ్‌తో సమానంగా ఇది దిగుబడినిచ్చిందని వేదిక తెలిపింది. అదేవిధంగా, నల్లరేగడి నేలలతోపాటు, తేలిక నేలల్లో వర్షాధారంగా సాగు చేసిన రైతులను కూడా ఈ రకం సంతృప్తినిచ్చింది. ఆలస్యంగా నాటిన సందర్భాల్లో దీనికి గూడ పురుగు, తెల్ల దోమ తాకిడి వచ్చింది. అయినా, ఎకరాకు 10 క్వింటాళ్లకు తక్కువ కాకుండా దిగుబడి వచ్చింది. రైతు రక్షణ-2తో అధిక దిగుబడి పెద్ద కాయలతో, కాయతొలిచే పురుగుల్ని గట్టిగా తట్టుకోగలిగిన మరొక సూటి రకం ‘రైతు రక్షణ-2’. ఇది ముందుగా కాపుకొచ్చి, తక్కువ పంట కాలం(130-145 రోజులు)లోనే మంచి దిగుబడినిచ్చే రకం. కాయ విచ్చుకోవటంలో కూడా అనుకూలత ఉన్న రకం. పొలంలో ఎక్కువ మొక్కల్ని నాటే వీలు కల్పించే రకమిది. సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో హైబ్రిడ్‌తో సమానంగా దిగుబడి(15-18 క్వింటాళ్లు/ఎకరం) ఇవ్వగలదని రైతుల అనుభవంలో తేలినట్లు వేదిక బాధ్యులు తెలిపారు. నాణ్యమైన పత్తిని, ముందుగా మార్కెట్‌కు అందించగలగడం ద్వారా రైతు మెరుగైన ధర పొందే అవకాశం ఉందంటున్నారు. రైతు రక్షణ హైబ్రిడ్‌పై రైతుల సంతృప్తి అదేవిధంగా కంపెనీలకు సంకర (హైబ్రిడ్) విత్తనాలను తయారు చేస్తున్న చిన్న రైతుల ద్వారా.. మంచి దిగుబడినిచ్చే లక్షణాలున్న రైతు రక్షణ హైబ్రిడ్ పత్తి విత్తనాలను కూడా వేదిక అందుబాటులోకి తెచ్చింది. ఈ హైబ్రిడ్ విత్తనాలు కంపెనీల హైబ్రిడ్ విత్తనాలతో సమానంగా దిగుబడిని స్తుండడంతో రైతులు సంతృప్తి చెందుతున్నారని వేదిక చెబుతోంది. ఈ విత్తనాలు కాయతొలిచే పురుగుతోపాటు పచ్చదోమ తాకిడిని కూడా కొంత వరకు తట్టుకున్నాయని, పత్తి తీసేందుకు అనువుగా కాయ పక్వానికొచ్చి పగలటం మరో ప్రయోజనమని వేదిక నేతలు చెబుతున్నారు. రైతు రక్షణ పత్తి విత్తనాల వినియోగం ఏటేటా విస్తరిస్తున్నది. 2013-14లో సుమారు వెయ్యి ఎకరాల్లో రైతు రక్షణ పత్తి విత్తనాలను రైతులు సాగు చేశారు. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నందున వచ్చే(2014-15) పంటకాలంలో మరింత విస్తరిస్తుందని వేదిక ఆశిస్తోంది. ఇతర జిల్లాల్లో రైతులకు కూడా అందుబాటులోకి తేవడానికి 5, 6 వేల అర కిలో విత్తన ప్యాకెట్లను సిద్ధం చేసింది. గుంటూరు పత్తి రైతులు సహకార స్ఫూర్తితో చూపిన సూటి విత్తనం దారి చిన్నా పెద్దా అని తేడా లేకుండా రైతులందరికీ నిస్సందేహంగా వెలుగుబాటే. వివరాలకు: కె. అజయ్‌కుమార్ (73822 96452, 94917 95406), కార్యదర్శి, రైతు రక్షణ వేదిక, చంద్రమౌళి నగర్ 7వ లైను, 1వ అడ్డరోడ్డు, గుంటూరు-522007. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చైనాలోనూ సూటి విత్తనమే..! బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలు తప్ప రైతులకు ప్రత్యామ్నాయం లేదన్న ప్రచారంతో పత్తి విత్తనం అంతా మోన్శాంటో కంపెనీ చెప్పుచేతల్లోకి వెళ్లిపోతోంది. తేలిక నేలల్లో వర్షాధారంగా పత్తి సాగు చేసే రైతులు కూడా అతి ఖరీదైన బీటీ హైబ్రిడ్ విత్తనాన్ని ప్రతి ఏటా కొని వాడాల్సిన దుర్గతి పట్టింది. ఒక్కోసారి వర్షం చాలకపోతే దిగుబడి బాగా తగ్గి అప్పులపాలై రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. సూటి రకం వాడితే విత్తనం ఖర్చుతోపాటు ఎరువులు, పురుగుమందుల ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అన్నిటికీ మించి రైతు చేతిలోనే విత్తనం ఉంటుంది. చైనాలో రైతులు సూటి రకాలనే వాడుతున్నారు. అందుకే మోన్శాంటో అక్కడ దివాలా తీసింది. బ్రెజిల్‌లోనూ ఇంతే. అమెరికాలోనూ సూటి రకాలనే వాడుతున్నారు. ఎక్కడా లేని విధంగా మన దేశంలోనే బీటీ హైబ్రిడ్ తప్ప మరో దారి లేదనేలా మన ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయం కళ్లప్పగించి చూస్తుండడం విషాదకరం. తేలిక నేలల్లో వర్షాధారంగా పత్తి సాగును సజావుగా సాగాలంటే రైతుల సహకార సంఘాల ద్వారా సూటి విత్తనాల వాడకాన్ని వ్యాప్తిలోకి తేవడం అనివార్యం. ఈ లక్ష్యసాధన కోసమే రైతు రక్షణ వేదిక ప్రభుత్వ సంస్థల తోడ్పాటును కూడా తీసుకుంటూ ఇతర జిల్లాల్లోనూ పత్తి సూటి రకాల వ్యాప్తికి కృషి చేస్తోంది. - ప్రొ. ఎన్. వేణుగోపాలరావు (94900 98905), విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త, అధ్యక్షుడు, రైతు రక్షణ వేదిక, గుంటూరు