
సాక్షి, హైదరాబాద్: పత్తి సాగు గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు 98 శాతం పత్తి పంట సాగైనట్లు వ్యవసాయశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాగుపై వ్యవసాయశాఖ బుధవారం నివేదిక విడు దల చేసింది. ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 40.99 లక్షల ఎకరాలకు చేరినట్లు తెలిపింది. అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 77.65 లక్షల ఎకరాల్లో పంటల సాగయ్యాయి.
ఏడు జిల్లాల్లో లోటు వర్షపాతం...
7 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయ నివేదిక తెలిపింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో లోటు నమోదైందంది. హైదరాబాద్, సిద్దిపేట జిల్లాల్లోనైతే ఏకంగా 33 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదు కాగా, మెదక్‌లో 32 శాతం, సంగారెడ్డి జిల్లాలో 31 శాతం, యాదాద్రి జిల్లాలో 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే 194 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అలాగే 6 మండలాల్లో వర్షాభావం నెలకొంది. ఇక ఆదిలాబాద్, కొమురంభీం, పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 32 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఆ ప్రకారం 115 మండలాల్లో అత్యధిక వర్షం కురిసింది. మిగిలిన 20 జిల్లాల్లో(269 మండలాల్లో) సాధారణ వర్షపాతం రికార్డు అయింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 320.9 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 311.7 మిల్లీమీటర్లు నమోదైంది. జూన్ నెలలో 14 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, ఈ నెలలో ఇప్పటివరకు 14 శాతం లోటు కనిపించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment