ఖరీఫ్‌కి కష్టకాలం దాపురించింది. జూన్, జూలై నెలల్లో వర్షాలు ముఖం చాటేయడంతో పంటచేలు చుక్కనీటి కోసం నోరెళ్లబెట్టాయి. నారుమళ్లు, నాట్లకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా అన్నదాతల గుండెల్లో దావానలం రగులుతోంది.
సాక్షి, కొవ్వూరు(పశ్చిమ గోదావరి): రెండు నెలల నుంచి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరుణుడు ముఖం చాటేశాడు. ఫలితంగా ఖరీఫ్ సాగు నిరాశాజనకంగా సాగుతోంది. వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతున్నాయి. సమృద్ధిగా వర్షాలు పడకపోవడంతో రిజర్వాయర్లలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో నీరు చేరలేదు. ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే ఎన్నడూలేని విధంగా రైతులు ఒడిదుడుకులను చవిచూస్తున్నారు. జూన్ నెలలో సాధారణం కంటే తక్కువగా నమోదైతే జూలై నెలలోనూ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మూడు వారాలు గడుస్తున్నా ఇంత వరకు చెప్పుకోదగిన వర్షం కురవలేదు. జూలైలో ఇప్పటి వరకు సాధారణం కంటే 47.7 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం రైతులు అల్పపీడనంపైనే ఆశలు పెట్టుకున్నారు. రానున్న నాలుగు రోజుల్లో ఓ మెస్తారు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. దీంతో రైతులు వరుణుడి కరుణ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది జూలై 18 నాటికి జిల్లాలో దాదాపు సగం ఆయకట్టులో నాట్లు వేస్తే ఇప్పుడు 30 శాతం కుడా నాట్లు వేయలేదు. రుతు పవనాలు రావడం 15 రోజులు ఆలస్యం కావడంతో జిల్లాలో ఖరీఫ్ సాగు జాప్యమైంది.
జూలైలోనూ లోటు వర్షపాతం!
ఈ ఏడాది జూన్‌లో లోటు వర్షపాతం రికార్డయితే జూలై నెలలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో 48 మండలాలు ఉంటే జూన్‌లో 30 మండలాల్లోనూ, జూలైలో 18 మండలాల్లో తీవ్ర వర్షభావ çపరిస్థితులు నెలకొన్నాయి. మరో 21 మండలాల్లోనూ వర్షభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణ వర్ష పాతం కంటే 60శాతం పైగా తక్కువ కురిసిన మండలాలను తీవ్ర వర్షాభావ మండలాలుగా పరిగణిస్తారు. 20 నుంచి 60 శాతంలోపు వర్షపాతం తక్కువగా నమోదైన మండలాలను వర్షభావ మండలాలుగా ప్రకటిస్తారు. ఇరవై శాతం తక్కువగా వర్షపాతం రికార్డుయిన మండలాలను సాధారణ మండలాలుగా పరిగణిస్తారు. జూలైలో కేవలం తొమ్మిది మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం (20శాతం వ్యత్యాసం) నమోదైంది. మిగిలిన అన్ని మండలాల్లోనూ వర్షాభావ పరిస్థితులు కనిపించాయి.
ఇప్పటి వరకూ వర్షపాతం ఇలా..
నల్లజర్లలో 86.8 శాతం, ద్వారకాతిరుమలలో 78.9, భీమడోలులో 83.5, ఆకివీడులో 81.8 శాతం, పెనుమంట్రలో 80.8 శాతం, అత్తిలిలో 79.2 శాతం, చాగల్లులో 77.2, నిడదవోలులో 72.3, నిడమర్రులో 75.0, గణపవరంలో 72.6, దెందులూరులో 73.9 శాతం చొప్పున సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదైంది. వేలేరుపాడు, కుక్కునూరు, కొయ్యలగూడెం, మొగల్తూరు తదితర మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే కేవలం పది శాతంలోపు వ్యత్యాసంతో వర్షం కురిసింది.
1,313 హెక్టార్లలో పూర్తికాని నారుమళ్లు
ఎన్నడూ లేని విధంగా ఈసారి జిల్లాలో ఇంకా నారుమళ్ల ప్రక్రియ పూర్తి కాలేదు. వర్షాలు ఆలస్యం కావడమే ఇందుకు ప్రధాన కారణం. జిల్లాలో 11,452 హెక్టార్లలో నారుమళ్లు పోయాల్సి ఉండగా ఇంతవరకు 10,139 హెక్టార్లలో మాత్రమే వేశారు. ఇంకా 1,313 హెక్టార్లలో నారుమళ్లు పోయాల్సి ఉంది. గత ఏడాది ఇదే సమయానికి నారుమళ్ల ప్రక్రియ పూర్తి కావడమే కాకుండా నాట్లు కూడా 50 శాతం పూర్తి చేశారు. గోదావరి డెల్టా ఆయకట్టులో ఈ ఏడాది 8,528 హెక్టార్లలో నారుమళ్లు వేయాల్సి ఉండగా 7,692 మాత్రమే వేశారు. ఇంకా 836 హెక్టార్లలో పోయాలి. మెట్ట ప్రాంతంలో 2,923 హెక్టార్లకు గాను 2,447 హెక్టార్లలో పోశారు. ఇంకా 476 హెక్టార్లలో నారుమళ్లు పోయాల్సి ఉంది. ప్రస్తుతం డెల్టాలో 90శాతం, మెట్టలో 84శాతం నారుమళ్లు పోశారు. నీరు సమృద్ధిగా లేకపోవడం, మెట్ట ప్రాంతంలో చెరువులు, ప్రాజెక్టులలో పూర్తిస్థాయిలో నీరు చేరకపోవడం, వర్షాభావ పరిస్థితుల కారణంగా నారుమళ్ల ప్రక్రియ నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మందకొడిగానే నాట్లు
జిల్లాలో గత ఏడాదితో పొలిస్తే ఖరీఫ్ వరినాట్లు మందకొడిగానే సాగుతున్నాయని చెప్పవచ్చు. గత జూలైలో ఇదే సమయానికి 1.09,429 హెక్టార్లలో నాట్లు వేస్తే ఇంత వరకు 63,993 హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. జిల్లాలో 2,29,030 హెక్టార్ల వరిసాగు సాధారణ విస్తీర్ణం కాగా, దీనిలో డెల్టాలో 1,70,567 హెక్టార్లు ఉంటే 63,993 హెక్టార్లు, మెట్టలో 58,463 హెక్టార్లుకి గాను 16,923 హెక్టార్లలో నాట్లు వేశారు. జిల్లాలో సరాసరి 27.9 శాతం ఆయకట్టులో నాట్లు పడ్డాయి. జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 2,55,469 హెక్టార్లు ఉంటే ప్రస్తుతం 73,729 హెక్టార్లలో మాత్రమే పంట వేశారు. పత్తి 6,512 హెక్టార్లకు 1,274 హెక్టార్లలో వేశారు. చెరుకు పంట 12,178 హెక్టార్లకు గాను 8,144 హెక్టార్లలో పంట వేశారు.
Comments
Please login to add a commentAdd a comment