అన్నదాతా దుఃఖీభవ! | TDP Government Crop Damage Money Not Released West Godavari | Sakshi
Sakshi News home page

అన్నదాతా దుఃఖీభవ!

Published Fri, Feb 15 2019 12:40 PM | Last Updated on Fri, Feb 15 2019 12:40 PM

TDP Government Crop Damage Money Not Released West Godavari - Sakshi

ఆకివీడు: సమస్యలు పరిష్కరించకుండా, సంక్షేమం గురించి పట్టించుకోకుండా, గిట్టుబాటు ధర కల్పించకుండా  కేవలం ఎన్నికలు ఉన్నాయి కదా అని కంటితుడుపుగా రూ.పదివేలు చేయూతనందిస్తామని టీడీపీ సర్కారు చెప్పడంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు  అడుగడుగునా దగా చేస్తోందని మదనపడుతున్నారు. 

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు డబ్బులేవీ..! 
ఖరీఫ్‌లో కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన ధాన్యం తాలూకు డబ్బులు ఇప్పటివరకూ రైతుల ఖాతాలకు చేరలేదు. జిల్లాలో ఈ బకాయిలు రూ.150కోట్లు పైనే ఉంటాయని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్ల బకాయిలు ఉంటాయని చెబుతున్నారు. ఎన్నికల సమయం ముంచుకొస్తున్నా.. ఈ బకాయిలపై సర్కారు, ప్రజాప్రతినిధులు నోరుమెదపడం లేదు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.   ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 12.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది.

ఈ ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 169 డ్వాక్రా సంఘాలు, 145 సహకార సొసైటీలు మొత్తం 314 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాయి. ఇప్పటివరకూ  11,50,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాయి.  దీనికి చెల్లింపులు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఇంకా రైతులకు రూ.150 కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతులు ధాన్యం తోలిన రెండుమూడు రోజుల్లోనే సొమ్ము వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రగల్భాలు పోతున్న ప్రభుత్వం ధాన్యం అమ్మి నెలదాటుతున్నా.. సొమ్ములు ఇవ్వలేకపోతోంది. దీంతో రైతులు ఆం దోళన చెందుతున్నారు.  ఇదిలా ఉండగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రవాణా ఇతరత్రా చార్జీల నిమిత్తం మిల్లర్లుకు రూ.80 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది.

రుణమాఫీ అంతంతే..! 
గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన రుణమాఫీ హామీని ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. రైతులను నిండాముంచింది. అనేక ఆంక్షలతో రైతులను అవస్థలపాల్జేసింది. ఐదు విడతలుగా సొమ్ము చెల్లిస్తామన్న సర్కారు నాలుగు, ఐదు విడతలకు సంబంధించిన సుమారు రూ.550కోట్ల చెల్లింపులు నిలిపివేసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ మొత్తాలకు గతంలో పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇచ్చిన సర్కారు గత ఏడాదిలోనే ఆ చెక్కులకు చెల్లింపులు చేయాల్సి ఉంది. కానీ వాయిదా వేస్తూ.. వచ్చింది. రైతులు మొదట్లో వడ్డీలు చెల్లించారు. వారికి రావాల్సిన వడ్డీ రాయితీకి కూడా సర్కారు మంగళం పాడింది.

పరికరాల పంపిణీలోనూ అన్యాయం 
సన్న, చిన్నకారు రైతులకు పరికరాల పంపిణీలోనూ అన్యాయం జరిగింది. చిన్న రైతుల పేరిట బడా రైతులు పరికరాలను అందిపుచ్చుకున్నారు. వీరిలో అధికారపార్టీ బినామీలే ఎక్కువ మంది ఉన్నారు. రైతు రథం పథకంలోనూ ఎన్నో అవకతవకలు జరిగాయి. రైతులకు న్యాయం జరగలేదు. జిల్లాలో సుమారు రూ. 220 కోట్ల మేర యంత్ర పరికరాల పంపిణీ జరిగింది.

అడ్రస్సులేని నష్టపరిహారం
గతంలో వచ్చిన రెండు తుపాన్లకు సంబం ధించిన నష్టపరిహారం కూడా ఇప్పటికీ రైతులకు అందలేదు. జిల్లావ్యాప్తంగా ఇలా రూ.170 కోట్ల బకాయిలు ఉన్నాయని సమాచారం. గత ఏడాది భారీ వర్షాలకు ఖరీఫ్, రబీ పంట తాలూకూ నష్ట పరిహారం రూ.20 కోట్ల మేర విడుదలైనా బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు.  

ఖరీఫ్‌సొమ్ము జమకాలేదు
ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు సొమ్ము ఇప్పటికీ మా ఖాతాల్లో జమ కాలేదు. రబీ సాగుకు పెట్టుబడులు పెట్టేందుకు ఇబ్బందిగా ఉంది. సకాలంలో ధాన్యం సొమ్ము జమ చేయాలి. రైతుకు లాభసాటి ధర ప్రకటించినప్పుడే ఆర్థికంగా గట్టెక్కుతాడు. – మంతెన వెంకట కృష్ణంరాజు, రైతు, చినకాపవరం

రైతుకు ఏమీ అందలేదు

రైతుకు రుణమాఫీ పూర్తిగా అందలేదు. గతంలో వచ్చిన రెండు తుపాన్ల తాలూకూ నష్టపరిహారమూ ఇవ్వలేదు.  వ్యవసాయ పరికరాలూ సరిగా అందడం లేదు. ఖరీఫ్‌ ధాన్యం సొమ్ములు జమ కాలేదు. ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం పట్టించుకోవాలి.  – అడ్డాల నాగరాజు, రైతు, సిద్ధాపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement