గులాబీ పురుగు పీడ మరెక్కడా లేదు! | The pink worm is not elsewhere! | Sakshi
Sakshi News home page

గులాబీ పురుగు పీడ మరెక్కడా లేదు!v

Published Mon, Aug 21 2017 11:27 PM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM

గులాబీ పురుగు పీడ మరెక్కడా లేదు!

గులాబీ పురుగు పీడ మరెక్కడా లేదు!

పత్తి సాగు కాలాన్ని 6 నెలల్లో ముగించడమే పరిష్కారం
అంతర్జాతీయ పత్తి సలహా సంఘం సాంకేతిక అధిపతి
డాక్టర్‌ కేశవ్‌ క్రాంతితో ‘సాగుబడి’ ఈ–మెయిల్‌ ఇంటర్వ్యూ


అంతర్జాతీయ పత్తి సలహా సంఘం(ఐసీఏసీ) ప్రపంచ దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులతో కూడినది. దీని కేంద్ర సచివాలయం వాషింగ్టన్‌లో ఉంది. పత్తి సాగుపై ఆయా దేశాలకు సాంకేతిక, శాస్త్రీయ సలహాలను అందిస్తుంది. ఈ సంఘంలో సాంకేతిక విభాగం అధిపతిగా పనిచేస్తున్న తెలుగు శాస్త్రవేత్త డాక్టర్‌ కేశవ్‌ క్రాంతితో  ‘సాక్షి సాగుబడి’ తాజాగా ఈ–మెయిల్‌ ఇంటర్వ్యూ చేసింది.

పత్తి సాగు సీజన్‌ ప్రారంభంలోనే గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో గులాబిరంగు  కాయతొలిచే పురుగు రైతులను బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. దీని పీడ పత్తిని విస్తారంగా  సాగు చేస్తున్న చైనా, పాకిస్తాన్‌ సహా ఏ దేశంలోనూ లేదన్నారు. ఇతర దేశాల మాదిరిగా 5–6 నెలల్లో పత్తి సాగు పూర్తయ్యే వంగడాల రూపకల్పనే ఉత్తమ పరిష్కారమని  డా. క్రాంతి చెబుతున్నారు.

 
♦ పత్తి కాయలు తొలిచే గులాబీ రంగు పురుగు ఈ ఖరీఫ్‌ సీజన్‌ మొదట్లోనే తెలంగాణ, ఆంధ్రాతోపాటు 5 రాష్ట్రాల్లో పెచ్చరిల్లింది. రైతాంగాన్ని బెంబేలెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పత్తి సాగవుతున్న దేశాల్లో కూడా ఇలాగే ఉందా?
మన దేశంలో గులాబీరంగు పురుగు సమస్య, ముఖ్యంగా గత ఏడాది డిసెంబర్‌ తర్వాత కూడా పత్తి పంట సాగు కొనసాగిన ప్రాంతాల్లో, తిరిగి తలెత్తుతుందని ముందుగా ఊహించినదే. ఈ సమస్య మన దేశంలోనే ఉంది. ఇతర దేశాల్లో లేదు. దీనికో ముఖ్య కారణం ఉంది. పత్తి విత్తిన తర్వాత 5–6 నెలల్లో పంటను తీసెయ్యాలి. అంతకుమించి  దాదాపు ఏడాది పొడవునా పత్తి సాగులో ఉండడం వల్ల, పత్తిని మాత్రమే ఆశించే ఈ పురుగులు మనుగడ సాగించగలుగుతున్నాయి.

అందువల్ల మన దేశంలో గులాబీ రంగు పురుగు సమస్యగా మారింది. పత్తి విత్తనోత్పత్తి చేసే రైతులు మన దేశంలో సుమారు 2 లక్షల హెక్టార్లలో దాదాపుగా ఏడాది పొడవునా పత్తి పంటను సాగు చేస్తున్నారు. ఇతర దేశాల్లో ఐదారు నెలల్లో పత్తి సాగును పూర్తి చేసి, మరో ఆరు నెలల తర్వాతే తిరిగి పత్తి విత్తుకుంటున్నారు. ఈలోగా పురుగులు నశిస్తున్నాయి. అందువల్ల వారికి గులాబీ రంగు పురుగు బెడద తలెత్తడం లేదు.

♦ మన మాదిరిగానే బీటీ పత్తిని సాగు చేస్తున్న చైనాలో పరిస్థితి ఏమిటి?
చైనాలో 1997 నుంచి బీటీ–1 (సీఆర్‌వై1ఏసీ)ని మాత్రమే సాగుచేస్తోంది. అయినా, గులాబీ రంగు పురుగు అక్కడ సమస్యగా మారలేదు. గులాబీ రంగు పురుగు సమస్య చైనాలో కొన్నేళ్ల క్రితం, పాకిస్తాన్‌లో గత ఏడాది తలెత్తినప్పటికీ.. ఏడాది పొడవునా పత్తి సాగులో లేదు కాబట్టి పురుగుల సంతతి సమస్యాత్మకంగా మారలేదు. పాకిస్తాన్‌లో బీటీ–1కు గులాబీ రంగు పురుగు అలవాటుపడిపోయినప్పటికీ పత్తిని 6–7 నెలల్లో ముగించి, తర్వాత గోధుమను సాగు చేసే అలవాటు ఉండటం వల్ల.. ఈ పురుగు సమస్యాత్మకంగా మారడంలేదు.
     
మన దేశంలో గులాబీ రంగు పురుగు రాకుండా ముందస్తు చర్యలు ఏమైనా తీసుకున్నారా..?
మన దేశంలో బీటీ 1, బీటీ 2 (బోల్‌గార్డ్‌–2) రకం బీటీ విత్తనాలకు గులాబీ రంగు పురుగు అలవాటు పడిపోయింది. పైగా 2016–17 నాటి పత్తి పంట పొలాల్లో ఎడతెగకుండా ఏడాదంతా కొనసాగింది. ఈ కారణాల రీత్యా ఈ ఆగస్టులోనే పత్తి చేలల్లో గులాబీ రంగు పురుగు ఉధృతమవుతుందని ఫిబ్రవరిలోనే ఢిల్లీలోని ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాను.
     
► ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేమిటి?
ప్రస్తుతం బీటీ పత్తి విత్తన కంపెనీలు ఒక కాపీ (జ్ఛిఝజ్డీyజౌuట) ఉన్న బీటీ జన్యువులనే వాడుతున్నారు. రెండు కాపీలు (జిౌఝ్డౌyజౌuట) ఉన్న బీటీ జన్యువులతో కూడిన హైబ్రిడ్స్‌ను మాత్రమే మార్కెట్‌లో అమ్మాలని విత్తన కంపెనీలను ప్రభుత్వం ఆదేశించాలి. మా సలహా మేరకు ఇప్పటికే ఒక కంపెనీ ఈ పని చేసి, సత్ఫలితాలు పొందుతోంది. పత్తి రైతులకు ప్రభుత్వం గట్టిగా చెప్పాల్సిందేమిటంటే.. డిసెంబర్‌ నెలాఖరుకన్నా ముందే పత్తి పంటను పూర్తి చెయ్యాలి. ఆ తర్వాత పొలంలో పత్తి మొక్కలు ఉండకూడదు. ఇందుకోసం పత్తి విత్తన కంపెనీలు కూడా మధ్యకాలిక లేదా స్వల్పకాలిక హైబ్రిడ్‌ విత్తనాలను మాత్రమే రైతులకు అమ్మాలని విత్తన కంపెనీలకు ఆదేశాలివ్వాలి.
     
► సింథటిక్‌ పైరిత్రాయిడ్‌ పురుగుమందులకు సేంద్రియ ప్రత్యామ్నాయాలేవీ లేవా?
ట్రైకోగామా పరాన్నజీవులను సకాలంలో పత్తి పొలంలో విడుదల చేస్తే గులాబీరంగు కాయతొలిచే పురుగులను గుడ్ల దశలోనే అరికట్టవచ్చు. ఈ పరాన్నజీవులను జీవనియంత్రణ ప్రయోగశాలల్లో పెంపొందించవచ్చు. సిఐసిఆర్, ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం తదితర యూనివర్సిటీలలో ఇవి అందుబాటులో ఉన్నాయి.

లింగాకర్షక బుట్టలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేయడం ఒక మంచి ఉపాయం. అయినప్పటికీ, గులాబిరంగు కాయతొలిచే పురుగు యాజమాన్యాన్ని రసాయన రహిత పద్ధతుల్లో చేపట్టాలనుకుంటే చేయాల్సినది.. ఒకటి: 150–180 రోజుల్లో పంట పూర్తయ్యే పత్తి వంగడాలను రూపొందించుకోవడం ఉత్తమం. రెండు: పత్తి పంట పూర్తయ్యాక కనీసం 180 రోజులు గడచిన తర్వాతే తదుపరి పత్తి విత్తుకోవాలి.
     
► సిఐసిఆర్‌ రూపొందించిన లింగాకర్షక బుట్టలను రైతులు పొందాలంటే ఎలా?
నేను సిఐసిఆర్‌లో పనిచేస్తున్నప్పుడు సరికొత్త ఫెరొమోన్‌ ఫార్ములేషన్‌ను రూపొందించాను. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వాటికన్నా ఇది ఎక్కువ రెక్కల పురుగులను ఆకర్షించగలుగుతుంది. 30–45 రోజులు పనిచేస్తుంది. లింగాకర్షక బుట్ట (రెండు ల్యూర్‌లు సహా) ధర రూ. 25గా సిఐసిఆర్‌ విక్రయిస్తున్నది. పన్నులు, రవాణా చార్జీలు అదనం.

పర్యవేక్షణ:
పత్తి చేలల్లో తొలి దశలో ఎకరానికి 2–3 లింగాకర్షక బుట్టలు పెట్టాలి.

లింగాకర్షక బుట్టలు:
 అక్టోబర్‌ చివరి నాటికి ప్రతి ఎకరంలో 20–30 వరకు లింగార్షక బుట్టలు ఏర్పాటు చేయాలి. నవంబర్‌ ఆఖర్లో లేదా డిసెంబర్‌ మొదట్లో ల్యూర్‌ను మార్చాలి.

ఇప్పుడు చేయాల్సిందేమిటి..?
సీజన్‌ మొదట్లోనే గులాబీ రంగు పురుగు వచ్చిందని బెంబేలెత్తిపోవాల్సిన పని లేదు. లింగాకర్షక బుట్టలు, పైరిత్రాయిడ్‌ మందుల వాడకం ద్వారా నియంత్రించవచ్చు. నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా స్థానం (సి.ఐ.సి.ఆర్‌.) లింగాకర్షక బుట్టలను తయారు చేసింది. దీని ఖరీదు రూ. 20–25 మాత్రమే. వీటిని ఎకరానికి 20–30 చొప్పున పెడితే సమస్య తగ్గుతుంది.

సెప్టెంబర్‌ నుంచి హెక్టారుకు 5 చొప్పున లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి, పురుగు తీవ్రతను అంచనా వేసుకోవాలి. ఒక్కో బుట్టలో ఒక రాత్రికి 8 తల్లి రెక్కల పురుగుల చొప్పున వరుసగా 3 రోజులు పడితే ఇక ఆలస్యం చేయకుండా పైరిత్రాయిడ్‌ పురుగుమందులు పిచికారీ చేయాలి. దీనితోపాటు ఎకరానికి 20–30 లింగాకర్షక బుట్టలను పత్తి రైతులంతా సామూహికంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఏర్పాటు చేసిన 35–40 రోజులు పనిచేస్తుంది. ఆ తర్వాత మార్చుకోవాలి.

120 రోజుల ‘యుగాంక్‌’ సంగతులేమిటి?
నాగపూర్‌లోని సీఐసీఆర్‌ రూపొందించిన 100–120 రోజుల్లో పూర్తయ్యే ‘యుగాంక్‌’ పత్తి సూటి వంగడంపై క్షేత్రప్రయోగాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది దేశంలో చాలా చోట్ల దీన్ని ప్రయోగాత్మకంగా పండించి చూస్తారు. ఫలితాలు అనుకూలంగా ఉంటే త్వరలోనే రైతులకు అందించే ప్రక్రియ మొదలు కావచ్చు. ఈ వంగడాన్ని త్వరగా రైతులకు అందించాలన్నదే నా కోరిక. నేనే అక్కడికి వెళ్లి ఈ ప్రక్రియను వేగవంతం చేయాల్సి వస్తుందేమో.
 
సూటిరకం బీటీ పత్తి వంగడాలకు పచ్చజెండా!
ప్రతి ఏటా కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా తిరిగి వాడుకునే సూటిరకం బీటీ పత్తి వంగడాలకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) ఇటీవల పచ్చజెండా ఊపింది. నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సీఐసీఆర్‌) రూపొందించిన ఈ వంగడాలు మరో 2–3 ఏళ్లలో రైతులకు అందుబాటులోకి రావచ్చు. సీఐసీఆర్‌ ఈ వంగడాలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్నది.

వచ్చే ఏడాది జాతీయ విత్తన సంస్థ (ఎన్‌.ఎస్‌.సి.) ద్వారా పెద్ద ఎత్తున విత్తనోత్పత్తి చేసిన తర్వాత రైతులకు అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విత్తనాలను రైతులు ఒకసారి కొంటే.. తాము పండించిన పత్తి నుంచి విత్తనాలు తీసి తిరిగి విత్తుకోవచ్చని, ఇతర విత్తనాలతో కలవకుండా ఉంటే నాలుగేళ్ల పాటు తిరిగి వాడుకోవచ్చని సీఐసీఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.ఎస్‌. లదానియా చెప్పారు. పత్తి పంటను డిసెంబర్‌ కల్లా పూర్తి చేస్తే తప్ప గులాబి రంగు పురుగును నిర్మూలించలేమన్నారు. నీటి పారుదల సదుపాయం ఉన్నప్పటికీ డిసెంబర్‌ నాటికి పత్తి పంటను ముగించడం ముఖ్యమన్నారు.

లింగాకర్షక బుట్టల కోసం సంప్రదించాల్సిన సిఐసిఆర్‌ చిరునామా:
THE DIRECTOR, CENTRAL INSTITUTE FOR COTTON RESEARCH, PB.No 2 SHANKARNAGAR PO NAGPUR 440 010; Phone: 07103-275536/38 (office)Fax: 07103-275529, E-mail: itmucicrngp@gmail.com

ఈ–మెయిల్‌ ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement