
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి సాగుకు పెద్దపీట పడుతోంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 53.64 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలు వేసినట్టు వ్యవసాయ శాఖ తన నివేదికలో పేర్కొంది. సాధారణ పత్తి సాగు 43 లక్షల ఎకరాలే కాగా,ఈ సీజన్‌లో అది అదనంగా 10 లక్షల ఎకరాలకు పెరిగింది. రికార్డు స్థాయిలో 53 లక్షల ఎకరాలు దాటిపోయిందని నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం సాగు విస్తీర్ణంలో 84% పంటలు వేశారు. అందులో గత ఖరీఫ్‌లో ఈ సమయానికి సాగు లెక్కల తో పోలిస్తే వరి,కందులు, జొన్న, వేరుశనగ పంటల విస్తీర్ణం పెరగ్గా, మొక్కజొ న్న, చెరకు, సోయా బీన్ పంటల విస్తీర్ణం తగ్గింది. గత సీజన్‌లో ఈ సమయానికి కురిసిన దానికన్నా 21% ఎక్కువ వర్షపాతం నమోదైంది.
నియంత్రిత సాగు బాటలో...
ఈ సీజన్లో పంటల సాగు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నియంత్రిత బాటలోనే ఉందని గణాం కాలు చెబుతున్నాయి. సాధారణం కంటే 16 లక్షల ఎకరాలు ఎక్కువగా ఈ ఏడాది పత్తి 60.16 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఇప్పటికే 53 లక్షలకు పైగా ఎకరాల్లో విత్త నాలు పడ్డాయి. ఇది 89%. పంటల వారీగా చూస్తే వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జొన్న (70%), కందులు (66%), పెసలు (62%), మినుములు (75%), సోయాబీన్ (83%), చెరకు (67%) సాగయ్యాయి. ఇక, వరి ఈ ఖరీఫ్ లో 41.76 లక్షల ఎక రాల్లో సాగు చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక కాగా, అందులో 36% అంటే 15.13 లక్షల ఎకరాల్లో ఇప్పటి వరకు నాట్లు పడ్డాయి. ఇతర పంటల్లో ఆముదం 33,951 ఎకరాల్లో (37%), వేరుశనగ 11,578 ఎక రాల్లో (28%) సాగయ్యాయి.
మక్కలు తగ్గాయి: ఈసారి రాష్ట్రంలో చర్చనీయాంశమైన మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. గత సీజన్‌లో ఈ సమయానికి 8 లక్షల ఎకరాలకు పైగా ఈ పంట వేయగా, ఈసారి 1.75 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ వానాకాలంలో 1,25 ,45,061 ఎకరాల్లో సాగు చేపట్టాలనేది ప్రభుత్వ ఆలోచన కాగా, అందులో 69% అంటే 86, 45,534 ఎకరాల్లో అన్ని రకాల పంటలు కలిపి సాగయ్యాయి.
వ్యవసాయ శాఖ నివేదికలోని ముఖ్యాంశాలు..
► రాష్ట్రంలో ఈ సీజన్ సాధారణ వర్షపాతం 358.3 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 21% అధి కంగా 433.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. 18 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ, 13 జిల్లాల్లో సాధారణ స్థాయిలో, 2 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
► మొత్తం ఆహార ధాన్యాల సాధారణ సాగు 50 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికి 27 లక్షల ఎకరాలకు పైగా సాగైంది.
సగటు కన్నా ఎక్కువ వర్షం కురిసిన జిల్లాలు
భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్(అర్బన్), కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సిద్ధిపేట, జనగామ, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, జోగుళాంబ, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, నారాయణ్ పేట.
సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు
ఆదిలాబాద్, కొమురంభీం,మంచిర్యాల, వరంగల్ (రూరల్), జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్, ములుగు, నల్లగొండ.
లోటు జిల్లాలు: నిర్మల్, నిజామాబాద్.
Comments
Please login to add a commentAdd a comment