
పోషక లోపాలు నివారిస్తే అధిక దిగుబడులు
- పత్తి సాగులో పోషకాలు లోపిస్తే మొక్కల పదుగుదలకు ఆటంకం
- సకాలంలో చర్యలు తీసుకోకుంటే దిగుబడులు పడిపోయే ప్రమాదం
- ముందస్తు చర్యలు మేలంటున్న జి.కొండూరు ఏవో జి.శ్రీనివాసరావు
పత్తి సాగులో ఏ పోషకం లోపించినా పైరు పెరుగుదల సక్రమంగా ఉండదు. దిగుబడి తగ్గిపోతుంది. పోషకలోపాలు ఉన్నప్పుడు మొక్కలోని ఏ భాగంలోనైనా లక్షణాలు కనిపించొచ్చు, నిపించకపోవచ్చు. ముందస్తు చర్యలు పాటిస్తే పైరుకు పోషకాలు సకాలంలో అందుతాయి. మొక్కల పెరుగుదల బాగుంటుంది. అధిక దిగుబడులు కూడా పొందేందుకు అవకాశం ఉంటుందని జి.కొండూరు వ్యవసాయ శాఖాధికారి జి.శ్రీనివాసరావు సూచించారు. పత్తిలో పోషకలోపాలు గుర్తించడం, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే....
పత్తిలో పోషక లోపాలు రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు. పత్తికి కావాల్సిన ఏ పోషకం లోపించినా పంట దిగుబడి తగ్గిపోతుంది. పైరులో పోషక లోపాలున్నప్పుడు ప్రత్యేకంగా లోప లక్షణాలు మొక్కపై ఏ భాగంలోనైనా కనిపించవచ్చు, లేదా కనిపించకపోవచ్చు. ఒక్కొక్క సారి పోషక లోప చిహ్నాలు ఇతర చిహ్నాలను పోలి ఉండవచ్చు. ఉదాహరణకు పత్తిని ఎర్రనల్లి ఆశించినప్పుడు ఆకులు ఎర్రబడతాయి. మెగ్నీషియం లేదా భాస్వరం లోపాలున్నా లేదా బెట్ట ఎక్కువైనా, లేదా నీరు ఎక్కువైనా కూడా ఎర్ర ఆకులు కనిపిస్తాయి. ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గినప్పుడు కూడా ఆకులు ఎర్రబారవచ్చు. అందువల్ల చిహ్నాల ఆధారంగా లోప పోషకాన్ని గుర్తించటంలో జాగ్రత్త వహించాలి.
- జి.కొండూరు
ఆకులు రంగు కోల్పోతే..
నత్రజని, భాస్వరం ఎరువులు అధిక మోతాదులో వాడి పొటాషియం వేయనప్పుడు, పత్తిలో పొటాషియం లోప చిహ్నాలు కనపడతాయి. మొదట ఆకుల చివర్లు తమ సహజ ఆకు పచ్చరంగును కోల్పోతాయి. ఊదా రంగుతో కూడిన గోధుమ రంగుకు మారతాయి. క్రమంగా ఆకులు గట్టిపడి ఎండిపోతాయి. భూసార పరీక్ష ఆధారంగా సూచించిన మేరకు పొటాషియం పోషకాన్ని సల్పేట్ ఆఫ్ పొటాష్ రూపంలో విత్తిన తర్వాత 30, 60, 90 రోజుల్లో నత్రజని ఎరువుతో పాటు వేసి ఈ లోపాన్ని నివారించవచ్చు.
బోరాన్ లోపిస్తే..
బోరాన్ లోపం వల్ల కొత్తగా పెరిగే చివరి మొగ్గలు దెబ్బతింటాయి. కొమ్మల చివరి మొగ్గల పెరుగుదల ఆగిపోయి పక్క మొగ్గల పెరుగుదల వచ్చి మొక్క గుబురుగా మారుతుంది. ఆకులు, కాడలు, చివరి మొగ్గలు రంగు రూపాలు మారిపోతాయి. అన్ని భాగాలు ముతకగా, దళసరిగా మారుతాయి. దీని నివారణకు లీటరు నీటికి బోరాక్స్ గ్రాము చొప్పున విత్తిన 60,90 రోజుల్లో పిచికారి చేసుకోవాలి.
ఆకులు ఎర్రబారితే మెగ్నీషియం లోపం
సున్నం అధికంగా ఉన్న నేలల్లో సూపర్‌పాస్పేట్, పొటాష్ ఎరువులు అధికంగా వాడినపుడు పత్తిలో మెగ్నీషియం లోపం కనిపించే అవకాశం ఉంది. ముదురు, మధ్య ఆకులు ఎర్రబారితే మెగ్నీషియం లోపస్థాయిలో ఉన్నట్లు కనిపెట్టవచ్చు. అయితే భాస్వరం లోపం వల్ల కానీ, బెట్ట నేలలు, లేక అధిక తేమ, ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గినప్పుడు కూడా ఆకులు ఎర్రబారుతాయి. ఆయా కారణాలతో కాకుండానే ఆకులు ఎర్రబారినట్లు గుర్తిస్తేనే మెగ్నీషియం లోపంగా భావిం చాలి. దీని నివారణకు మెగ్నీషియం సల్పేట్‌ను లీటరు నీటికి 10 గ్రాములు చొప్పున విత్తిన 45, 75 రోజుల్లో పైరు మొత్తం మీద పిచికారీ చేయాలి.
జింకు ధాతు లోపం
బంక మన్ను అధికంగా ఉండే నల్లరేగడి నేలలు, సున్నం అధికంగా ఉండే నేలల్లో ఈ పోషక లోపం వస్తుంది. జింకు లోపం చిహ్నాలు విత్తిన మూడు వారాలు తర్వాత కనిపిస్తాయి. ఆకులు ఎరుపుతో కూడిన తుప్పు రంగులో ఉంటాయి. లేత పైరులో లోప చిహ్నాలు మధ్య ఆకుల మీద కనిపిస్తాయి. ఆకులు ఆకుపచ్చ రంగు కోల్పోయి, ఈనెల మధ్య భాగం బంగారు రుంగులోకి మారుతాయి. గోధుమ రంగు మచ్చలు ఆకుల చివర్లు నుంచి మొదలకు విస్తరిస్తాయి. ఆకు చివర్లు ఎండిపోతాయి.
ఆకులు పైకి కానీ కిందకు కాని ముడుచు కుంటాయి. జింకు లోపించిన మొక్క పెరుగుదల సరిగా లేక ఆకులు, కాడలు, కాండం చిన్నగా మారి గుబురుగా మారతాయి. దీని నివారణకు దుక్కిలో 20 కిలోల జింకు సల్పేట్‌ను వేసి జింకు లోపాన్ని నివారించవచ్చు. జింకు లోప చిహ్నాలు పైరు మీద కనిపించినప్పుడు జింకు సల్పేట్ లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున నాలుగైదు రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేసి నివారించుకోవచ్చు.
జి.శ్రీనివాసరావు
88866 13373