subabul farmers
-
‘సుబాబుల్ రైతులను ఆదుకుంటాం’
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం తీరుతో సుబాబుల్ రైతులకు అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుబాబుల్ రైతుల విషయంలో అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్యాయంగా వ్యవహరించారని ఆరోపించారు. సుబాబుల్ రైతులతో సమావేశం ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తనకు చెప్పారని తెలిపారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి వసంత కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా సుబాబుల్ రైతులను దేవినేని సోమరిపోతులని విమర్శలు చేశారని మండిపడ్డారు. అదేవిధంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. సుబాబుల్ రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభలో మంచి శుభవార్త చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సుబాబుల్ రైతులకు రూ.5.40 కోట్ల బకాయిలను చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అదేవిధంగా కౌలు రైతులకు రూ. 12, 500 ఇస్తామని సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల వ్యవసాయ రంగం మరింత విస్తరించనుందని సామినేని ఉదయభాను ఆశాభావం వ్యక్తం చేశారు. -
ధరల చెల్లింపులో దబాయింపు!
సాక్షి, అమరావతి: సుబాబుల్, జామాయిల్, సరుగుడు కర్రకు ధరలేక రైతులు లబోదిబోమంటున్నారు. బడా పేపర్ మిల్లులను కట్టడి చేయడంలో రాష్ట్రంలోని గత ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో వాళ్లు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. అందరి సమక్షంలో కుదుర్చుకున్న కనీస ఒప్పంద ధరను సైతం ఇవ్వలేమని ఐటీసీ సహా ఇతర పేపర్ మిల్లులు తెగేసి చెబుతున్నాయి. ఫలితంగా జామాయిల్ రైతులు ఎకరానికి సుమారు 25 వేలు, సుబాబుల్ రైతులు ఎకరానికి రూ.20 వేలు ఏటా నష్టపోతున్నారు. ధరల వ్యవహారంలో కంపెనీలు రైతుల్ని ఏమాత్రం ఖాతరుచేయకుండా అగౌరవపరుస్తున్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వమైనా తమ గోడు పట్టించుకోవాలని సుబాబుల్, జామాయిల్ రైతుల సంఘం కోరుతోంది. రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలలో సాగు.. రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఎకరాలలో సుబాబుల్, జామాయిల్ (యూకలిప్టస్), సరుగుడు (చౌకలు) సాగవుతోంది. విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాధారిత పంటగా వీటిని సాగుచేస్తున్నారు. మొత్తం సాగులో 40 శాతం వరకు ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఉంది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం 80 వేల నుంచి లక్ష మంది వరకు ఈ తోటల్ని పెంచుతుంటారు. ఒకసారి ఈ మొక్కల్ని నాటితే పది పన్నెండేళ్ల పాటు ఉంచవచ్చు. వానలు ఉండి కాస్తంత సస్యరక్షణ చేస్తే మూడేళ్లలో తొలిసారి కర్ర కొట్టవచ్చు. మూడేళ్లకు కౌలు కలుపుకుని ఎకరానికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. అన్నీ సవ్యంగా ఉంటే 25 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుంది. మిల్లుల ఇష్టారాజ్యం.. ధరలు దారుణం 2014కి ముందు సుబాబుల్, జామాయిల్ ధరలు టన్నుకు రూ. 4,400 నుంచి రూ.4,600 మధ్య ఉండేది. ఆ తర్వాత ధరలు క్రమేణా తగ్గడం మొదలుపెట్టాయి. దీంతో రైతులు ఆందోళనకు దిగడంతో టీడీపీకి చెందిన ఆనాటి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రైతులు, పేపర్ మిల్లుల ప్రతినిధులతో సమావేశమై కనీస ధరను రూ.4,600గా నిర్ణయించారు. అయితే, ఇందుకు మిల్లర్లు ప్రత్యేకించి ఐటీసీ వంటి కంపెనీలు ససేమిరా అనడమే కాకుండా రూ.4,000లకు మించి ఇవ్వలేమని భీష్మించాయి. ఈలోగా వ్యవసాయ మంత్రి మారిపోవడంతో రైతులు మళ్లీ మొరపెట్టుకున్నారు. జిల్లాకో రేటు పెట్టుకునేందుకు, తమ ఏజెంట్లతో కొనుగోలు చేయించేందుకు అనుమతివ్వాలని కంపెనీలు పట్టుబట్టి సాధించాయి. కంపెనీ ఏజెంట్లు, ఏఎంసీ అధికారులు కుమ్మక్కై ఏదో నామమాత్రంగా నిబంధనల ప్రకారం కొన్నట్టు చూపి మిగతా కర్రను తమ ఇష్టానుసారం కొంటున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, చీమకుర్తి ప్రాంతంలో రూ.4,400లకు కొనాల్సిన జామాయిల్ కర్రను టన్ను రూ.1,800, సుబాబుల్‌ను రూ.2 వేల నుంచి రూ.2,400 మధ్య కొంటున్నారు. అదే కృష్ణాజిల్లా నందిగామలో రూ.2 వేలకు మించి ఇవ్వడంలేదు. కర్ర కొట్టుడు, రవాణా ఖర్చులను తామే భరిస్తున్నందున ఇంతకుమించి ఇవ్వలేమని పేపర్ మిల్లులు తెగేసి చెబుతున్నాయి. రవాణా సౌకర్యం బాగుంటే ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే మారుమూల అయితే ధర తక్కువగా ఉంటోందని సుబాబుల్ రైతుల సంఘం నాయకుడు హనుమారెడ్డి చెప్పారు. ప్రతి రైతుకూ ఏటా రూ.25 వేలు నష్టం ధర లేకపోవడంతో రైతులు ఏటా ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25 వేల వరకు నష్టపోతున్నారు. దీనిపై రైతులు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నాచేసినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం జామాయిల్ కర్ర టన్నుకు నిర్ణయించిన రూ.4,400ను, సుబాబుల్‌కు నిర్ణయించిన రూ.4,200ల ధరైనా ఇవ్వకపోతే తాము బతికేదెలా? అని ప్రశ్నిస్తున్నా రైతుల వేదన అరణ్యరోదనగానే మిగిలింది. ఆ ధరతో కొనుగోలు చేయలేమని ఐటీసీ, ఏపీ పేపర్ మిల్స్, జేకే పేపర్ మిల్స్ చెబుతున్నాయి. పేపర్ ధర పెరుగుతున్నప్పుడు ముడిసరకు ధర ఎందుకు పెరగదని రైతులు ప్రశ్నిస్తున్నారు. తీసి ఇవ్వాలంటే ఎలా? గత ప్రభుత్వ అనాలోచిత చర్యవల్ల రైతులే తమ తోటల్ని నరికి కర్రను స్టాక్ పాయింట్‌కు తరలించాల్సిన పరిస్థితి. ఇది చాలదన్నట్టు ఆ కర్రకుండే తాటను సైతం రైతులే తీయించి పేపర్ మిల్లులకు సరఫరా చేయాలని ప్రకాశం జిల్లాలో షరతు విధించారు. ఈ నిబంధనను తొలగించాలని రైతులు ఆందోళన చేస్తే దాన్ని తీసివేయడానికి బదులు రాష్ట్రవ్యాప్తంగా అదే విధానాన్ని అమలుచేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
సు‘బాబు’ల్ ‘మోసం’
సాక్షి, చీమకుర్తి: ‘‘ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అమలు చేయాలని కలెక్టర్‌ను కలిశాం. మంత్రి దృష్టికి తీసుకుపోయాం. చివరకు జిల్లాకు వచ్చినప్పుడు ఒకసారి, రాజధానికే పోయి మరోసారి సీఎంకు కర్ర కొనుగోళ్లలో జరుగుతున్న అన్యాయంపై మొరపెట్టుకున్నాం. పోరాటంతో ఐదేళ్లు గడిచిపోయాయి గానీ కర్రసాగు చేసే మా బాధలు మాత్రం పరిష్కారం కాలేదని’’ రైతులు వాపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, రైతు సంఘం నాయకులు వివిధ దశల్లో పోరాటాలు చేశారు తప్ప రైతుల కష్టానికి ఫలితం లేదు. జామాయిల్ కర్ర టన్నుకు రూ.4400, సుబాబుల్ కర్రకు రూ.4200 వంతున కొనుగోలు చేయాలని ప్రభుత్వమే జీఓ నంబరు 31 విడుదల చేసింది. ఆ జీవో ప్రకారమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తుంటే పేపర్ మిల్లుల యజమానులు మార్కెట్ కమిటీలను తుంగలో తొక్కి ప్రత్యేకంగా దళారులను అడ్డం పెట్టుకొని జామాయిల్ టన్నును రూ.2500, సుబాబుల్ టన్నును రూ.2 వేలు వంతున కొంటూ రైతుల కష్టాన్ని దళారులు, పేపర్ మిల్లుల యాజమాన్యాలు దోచుకుంటున్నాయని రైతులు ఆరోపించారు. దళారులు అక్రమ మార్గంలో కొనుగోలు చేస్తున్న కర్ర లారీలను ఆపి రైతులందరికీ సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోగా దానిపై మంత్రివర్గ ఉపసంఘం కనీసం కన్నెత్తి కూడా చూడలేదనే విమర్శలు రైతుల్లో వ్యక్తమవుతోంది. పేపర్ మిల్లుల యజమానులు కొనుగోలు చేయకపోగా నిలదీశారనే నెపంతో సంతనూతలపాడు, చీమకుర్తి మండలాలకు చెందిన రైతుల కర్రను కక్ష పూరితంగా కొనుగోలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో 42 శాతం వాటా ప్రకాశం జిల్లాదే: రాష్ట్రంలో సాగయ్యే జామాయిల్, సుబాబుల్లో 42 శాతం వాటా ఒక్క ప్రకాశం జిల్లా నుంచే సాగవుతుందని రైతుసంఘం నాయకుల గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. జిల్లాలో జామాయిల్ 1.07 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. సుబాబుల్ 60 వేల ఎకరాల్లో, సరుగుడు 8 వేల ఎకరాల్లో సాగవుతుందని రైతులు చెబుతున్నారు. గతంలో వర్షాలు పుష్కలంగా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలకే పొలంలో కర్ర కోతకు వచ్చేది. నాలుగైదేళ్ల నుంచి సకాలంలో వర్షాలు లేక ఐదేళ్లయినా కర్ర కోతకు రాకపోగా ఒక్కో ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే అనేక వేల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్ కర్రను కొనుగోలు చేసేవారు లేక కోతకు వచ్చిన కర్ర కూడా పొలాల్లోనే ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మార్కెట్లో పేపర్ ఖరీదు టన్నుకు రూ.15 వేలు పెరిగిందని, గతంతో పోల్చుకుంటే 50 శాతం పేపర్ ధర పెరగగా, దానికి ముడి సరుకుగా ఉన్న సుబాబుల్, జామాయిల్ కర్రకు మాత్రం ఐదేళ్ల క్రితం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వకపోగా దానిలో సగానికి సగం కోతపెట్టి సగం ధర మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. -
నాడు నవాబులు..నేడు గరీబులు!
సుబాబుల్ ఒకప్పడు రైతులకు కాసులు కురిపించిన పంట. నేడు అదే రైతులకు పెను భారంగా మారింది.సుబాబుల్ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పిన సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం పంటను కొనే వారు లేరు. గిట్టుబాటు ధర లేదు. ఈ స్థితిలో పంట ఉంచాలో.. తొలగించాలో తెలియక అయోమయంలో ఉన్నారు రైతులు. ప్రస్తుత పరిస్థితుల్లో అయిన కాడికి తెగ నమ్ముకొని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవడం మినహా గత్యంతరం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందిగామ : పశ్చిమ కృష్ణా వ్యాప్తంగా 60,320 ఎకరాల్లో సుబాబుల్ పంట సాగులో ఉంది. గడచిన రెండేళ్లుగా వేలాది ఎకరాల్లో కర్ర నరుకుడుకు సిద్ధంగా ఉంది. గిట్టుబాటు ధర లభించకపోవడం, దళారుల పెత్తనం అధికం కావడం, కంపెనీలు సైతం ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తుండటంతో పంటను అమ్ముకోవాలా, వద్దా అనే సంకట స్థితి నెలకొంది. పంటను అమ్ముకోకుంటే, పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి. దీనికితోడు చెట్టు బరువు పెరిగిపోయి కొద్దిపాటి గాలులకే విరిగిపోతుండటంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. ఉన్నంతలో అయినకాడికి అమ్ముకొని ఇకపై ఈ పంటకు స్వస్తి పలకాలనే యోచనలో ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. పెను భారమైంది సాగర్ ఎడమ కాల్వకు చివరలో ఉన్న ఈ ప్రాంతంలో పంటలు వర్షాధారంపైనే సాగవుతాయి. వర్షాలు సరిగా పడక, వాతావరణం అనుకూలించకపోవడంతో దిక్కుతోచని పశ్చిమ కృష్ణా రైతాంగం సుబాబుల్ పంట వైపు మొగ్గు చూపింది. ఆరంభంలో కంపెనీలు సైతం ఈ పంటను అధికంగా ప్రోత్సహించాయి. వేలాది హెక్టార్లలో సుబాబుల్ పంట సాగైంది. ఆరంభంలో 20 వేల ఎకరాల్లో సాగైన ఈ పంట 60 వేల ఎకరాలను తాకింది. ఇంతవరకు బాగానే ఉన్నా, నాలుగేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వం సుబాబుల్ పంటను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతోపాటు రైతులను పక్కన పెట్టి కంపెనీలకు కొమ్ము కాయడం ప్రారంభించింది. నాటి నుంచి రైతుల కష్టాలు ప్రారంభమయ్యాయి. అంతకంతకు అవి రెట్టింపవుతుండటం, దళారులు, వ్యాపారులు కుమ్మక్కై గిట్టుబాటు ధర రాకుండా అడ్దుకోవడం, ప్రభుత్వ చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇక ఈ పంట సాగు వల్ల తమకు నష్టమే తప్ప లాభం కూడా ఉండదన్న నిర్థారణకు వచ్చిన రైతులు ఈ పంట సాగు నుంచి బయట పడాలన్న యోచనలో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది పంటను తొలగించుకుంటుండగా, మిగిలిన వారు అమ్మకం పూర్తయిన వెంటనే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని భావిస్తున్నారు. అరకొరగా కొనుగోళ్లు జిల్లాలో మొత్తం 19 ఏఎంసీలుండగా, పశ్చిమ కృష్ణా పరిధిలోనే సుబాబుల్ పంట అధికంగా ఉన్న నందిగామ, జగ్గయ్యపేట, కంచకచర్ల ఏఎంసీల పరిధిలో మాత్రమే సుబాబుల్ కొనుగోళ్లు జరుగుతున్నాయి. మొత్తం ఐదు కంపెనీలుండగా, నందిగామ ఏఎంసీ పరిధిలో ఒక కంపెనీ మాత్రమే కర్ర కొనుగోళ్లు చేపడుతుండగా, మిగిలిన రెండు చోట్ల రెండేసి కంపెనీలు కొనుగోళ్లు జరుపుతున్నాయి. ఈ మూడు ఏఎంసీల పరిధిలో కొనుగోళ్లు అరకొరగానే జరుగుతున్నాయి. తమ వంతు కోసం వేల సంఖ్యలో రైతులు ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. మద్దతు ధర రూ.4.600 చేస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు ఆ పని చేయకపోగా, ఉన్న ధరలో రూ.200 తగ్గించి రూ.4,200 గిట్టుబాటు ధర ప్రకటిస్తూ, జీఓ జారీ చేసింది. ప్రస్తుతం అందులో సగం ధరకు కూడా కంపెనీలు కొనుగోళ్లు చేపట్టకపోవడం గమనార్హం. ఈ పరిస్థితి ఊహించ లేదు వాతావరణం అనుకూలించక, సాగు నీరు సక్రమంగా అందక సుబాబుల్ పంట సాగు చేపట్టాను. ఐదెకరాల్లో పంట సాగు చేశాను. అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే రెండెకరాల్లో పంట తొలగించాను. టన్ను రూ.2 వేలకు అమ్ముకున్నాం. మరో రెండెకరాల్లోని కర్రను అయినకాడికి అమ్ముకొని వాటిలో కూడా పంట తొలగించాలని నిర్ణయించుకున్నాను. ఇంతటి గడ్డు పరిస్థితులు తలెత్తుతాయని ఊహించ లేదు.–మానుకొండ కృష్ణారెడ్డి, రైతు ప్రభుత్వం చొరవ చూపాలి కంపెనీల ప్రతినిధులు, దళారులు కలసి రైతులను అడ్డంగా దోచుకుంటున్నారు. ఉద్దేశ పూర్వకంగా ధరలు తగ్గిస్తున్నారు. సుబాబుల్ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ దశలో ప్రభుత్వం ఆదుకొని కొనుగోళ్లు చేపడితే, తొలకరి సమయానికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు రైతులకు అవకాశం దక్కుతుంది.–పాలేటి సతీష్, ఏఎంసీ మాజీ చైర్మన్ -
రైతులపై కర్రపెత్తనం..!
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో సుబాబుల్, జామాయిల్ కర్ర కొనుగోలు ఒప్పందానికి పేపరు మిల్లుల యజమానులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఎన్ని ఒప్పందాలు జరిగినా.. అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులు చేసిన అగ్రిమెంట్లే అడ్రస్ లేకుండా పోతున్నాయి. చివరకు దళారే కింగ్ అవుతూ చక్రం తిప్పుతున్నాడు. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో సామాజిక వనాలు సాగవుతున్నాయి. మరో 10 వేల ఎకరాల్లో సరుగుడు తోటలు సాగవుతున్నాయి. జామాయిల్, సుబాబుల్, సరుగుడు వంటి తోటలను ప్రత్యామ్నాయంగా రైతులు జిల్లాలో సాగుచేస్తున్నారు. ఏటా 40 వేల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్ కర్ర కోతకు వస్తోంది. ఆ సమయానికి పేపరు మిల్లుల యజమానులు గద్ధలా వాలి దోపిడీ రచన చేస్తున్నారు. మార్కెట్లో దళారీలను పెంచిపోషించి రైతులపైకి ఎగదోలడం పరిపాటిగా మారింది. కర్ర కొనుగోలుకు సంబంధించి 1999 నుంచి రైతులకు, పేపరు మిల్లులకు మధ్య ప్రభుత్వం ఆధ్వర్యంలో ధరల ఒప్పందం జరుగుతోంది. పాలకుల సమక్షంలో చేసిన ఒప్పంద ధరను వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా సక్రమంగా అమలుచేస్తూ వచ్చారు. అయితే, గత నాలుగు సంవత్సరాలుగా పాత విధానం గతి తప్పింది. కలెక్టర్, రైతులు, ప్రజాప్రతినిధులు, మంత్రుల సమక్షంలో జరిగిన ఒప్పంద ధరలు అమలుకు నోచుకోవడంలేదు. ఏటా రైతులకు కోట్లలో నష్టం... 10–10–2016న ఒంగోలులో కలెక్టర్ సమక్షంలో టన్ను సుబాబుల్ రూ.4,000, జామాయిల్ టన్ను రూ.4,200కు కొనుగోలు చేసే విధంగా ఒప్పందం జరిగింది. ఒప్పందమైతే జరిగిందిగానీ, నేటికీ అమలుకు నోచుకోలేదు. టన్ను జామాయిల్ రూ.2,700, సుబాబుల్ రూ.3,400కు కొనుగోలు చేస్తూ రైతుల పొట్టగొడుతున్నారు. కర్ర తాట తీసి రైతులు తీసుకెళ్తున్నా తక్కువ ధరకే కొనుగోలు చేయడం నిత్య కృత్యమైంది. దీని వలన రైతులకు టన్ను జామాయిల్ కర్రకు రూ.1500, సుబాబుల్ కర్రకు రూ.600 నష్టపోవాల్సి వస్తోంది. ఎకరాకు సరాసరిన జామాయిల్ పంటలో రూ.35,000, సుబాబుల్ కర్రకు రూ.12,000 వరకు దోపిడీ జరుగుతోంది. ఫలితంగా ఏటా సామాజిక వనాల రైతులు కోట్లలో నష్టపోతున్నారు. మీ కోసంలో జేసీకి రైతు సంఘం ఫిర్యాదు రైతులకు జరుగుతున్న అన్యాయంపై జోక్యం చేసుకుని సుబాబుల్, జామాయిల్ ఒప్పంద ధరలపై సమీక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మికి రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపీనాథ్, మండవ శ్రీనివాసరావు, రైతులు కలిసి సోమవారం మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. పేపరుమిల్లుల ప్రతినిధులు, రైతు ప్రతినిధులతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి కొత్త ఒప్పందం చేయాలని కోరారు. లేకపోతే రైతులు ఆర్థికంగా ఎంతో నష్టపోతారని తెలిపారు. -
మంత్రి లోకేశ్‌కు చేదు అనుభవం
విజయవాడ: ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు, కృష్ణాజిల్లా సుబాబుల్ రైతులు మంగళవారం మంత్రి లోకేశ్‌ను కలిశారు. మూడేళ్ల నుంచి తమ డబ్బుల కోసం మార్కెట్ యార్డ్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ, రేపు డబ్బులు ఇస్తామని తిప్పుతున్నారంటూ రైతులు ఆవేదన చెందారు. 310మంది రైతులకు సుమారు రూ.10 కోట్లు వరకూ రావాలని వారు తెలిపారు. డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు కంటతడి పెట్టారు. తమ బాధలు చెప్పుకుంటున్న రైతులపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత సమయం ఓపిక పట్టాలని ఆయన రైతులకు సూచించారు. అయితే ఇంకెంతకాలం తాము ఓర్పుగా ఉండాలని రైతులు...మంత్రి లోకేశ్‌ను సూటిగా ప్రశ్నించారు. -
రైతుల బకాయిలు ఇప్పించడంలో ప్రభుత్వం విఫలం
నందిగామ : ఎస్పీఎం కంపెనీ సుబాబుల్ రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు విమర్శించారు. బకాయిల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఏఎంసీ కార్యాలయం ఎదుట బుధవారం నిర్వహించన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఎస్పీం కంపెనీ ఏఎంసీకి కేవలం రూ. రెండు కోట్ల విలువ చేసే బ్యాంకు గ్యారంటీ ఉండగా రూ.14 కోట్ల వరకు ఎలా అప్పు పెట్టారని ప్రశ్నించారు. కంపెనీ వారు కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారన్నారు. అయినప్పటికీ కలెక్టర్ కంపెనీకి నోటీసుల పేరిట కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఏఎంసీ నిధుల నుంచి కానీ, ప్రభుత్వం కానీ వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కంపెనీ వారు ఈ ప్రాంత రైతులకు డబ్బులు ఇవ్వకుండా వేరే ప్రాంతంలో సుబాబుల్ కర్ర కొంటున్నారని, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. దీక్ష చేస్తున్న రైతులు, రైతు నాయకులకు జగన్మోహన్రావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు కోవెలమూడి ప్రమీల, ఎంపీపీ వల్లంకొండ భద్రఖాళి, పార్టీ నియోజకవర్గ నాయకుడు కోవెలమూడి వెంకట నారాయణ, కార్యాలయ ఇన్చార్జి డాక్టర్ ఎం. అరుణకుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మంగునూరి కొండారెడ్డి, మండల కన్వీనర్ నెలకుదిటి శివనాగేశ్వరరావు, మండల రైతు కన్వీనర్ చిలుకూరి బుచ్చిరెడ్డి, నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యుడు కత్తురోజు శ్రీనివాసాచారి, పలు విభాగాల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాకాలపాటి రోజానమ్మ, జిల్లేపల్లి రంగారావు, మువ్వల శ్రీనివాసరావు, కొండా కృష్ణారెడ్డి, నెలకుర్తి సత్యనారాయణ, రవికిరణ్ రెడ్డి, షేక్ ఫాతిమా, ఆవుల విజయ్, కిరణ్ పాల్గొన్నారు.