కొనుగోలు చేసే వారు లేక ముదిరిపోతున్న సుబాబుల్ తోట
సుబాబుల్ ఒకప్పడు రైతులకు కాసులు కురిపించిన పంట. నేడు అదే రైతులకు పెను భారంగా మారింది.సుబాబుల్ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పిన సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం పంటను కొనే వారు లేరు. గిట్టుబాటు ధర లేదు. ఈ స్థితిలో పంట ఉంచాలో.. తొలగించాలో తెలియక అయోమయంలో ఉన్నారు రైతులు. ప్రస్తుత పరిస్థితుల్లో అయిన కాడికి తెగ నమ్ముకొని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవడం మినహా గత్యంతరం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నందిగామ : పశ్చిమ కృష్ణా వ్యాప్తంగా 60,320 ఎకరాల్లో సుబాబుల్ పంట సాగులో ఉంది. గడచిన రెండేళ్లుగా వేలాది ఎకరాల్లో కర్ర నరుకుడుకు సిద్ధంగా ఉంది. గిట్టుబాటు ధర లభించకపోవడం, దళారుల పెత్తనం అధికం కావడం, కంపెనీలు సైతం ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తుండటంతో పంటను అమ్ముకోవాలా, వద్దా అనే సంకట స్థితి నెలకొంది. పంటను అమ్ముకోకుంటే, పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి. దీనికితోడు చెట్టు బరువు పెరిగిపోయి కొద్దిపాటి గాలులకే విరిగిపోతుండటంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. ఉన్నంతలో అయినకాడికి అమ్ముకొని ఇకపై ఈ పంటకు స్వస్తి పలకాలనే యోచనలో ఉన్నట్లు రైతులు చెబుతున్నారు.
పెను భారమైంది
సాగర్ ఎడమ కాల్వకు చివరలో ఉన్న ఈ ప్రాంతంలో పంటలు వర్షాధారంపైనే సాగవుతాయి. వర్షాలు సరిగా పడక, వాతావరణం అనుకూలించకపోవడంతో దిక్కుతోచని పశ్చిమ కృష్ణా రైతాంగం సుబాబుల్ పంట వైపు మొగ్గు చూపింది. ఆరంభంలో కంపెనీలు సైతం ఈ పంటను అధికంగా ప్రోత్సహించాయి. వేలాది హెక్టార్లలో సుబాబుల్ పంట సాగైంది. ఆరంభంలో 20 వేల ఎకరాల్లో సాగైన ఈ పంట 60 వేల ఎకరాలను తాకింది. ఇంతవరకు బాగానే ఉన్నా, నాలుగేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వం సుబాబుల్ పంటను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతోపాటు రైతులను పక్కన పెట్టి కంపెనీలకు కొమ్ము కాయడం ప్రారంభించింది. నాటి నుంచి రైతుల కష్టాలు ప్రారంభమయ్యాయి. అంతకంతకు అవి రెట్టింపవుతుండటం, దళారులు, వ్యాపారులు కుమ్మక్కై గిట్టుబాటు ధర రాకుండా అడ్దుకోవడం, ప్రభుత్వ చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇక ఈ పంట సాగు వల్ల తమకు నష్టమే తప్ప లాభం కూడా ఉండదన్న నిర్థారణకు వచ్చిన రైతులు ఈ పంట సాగు నుంచి బయట పడాలన్న యోచనలో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది పంటను తొలగించుకుంటుండగా, మిగిలిన వారు అమ్మకం పూర్తయిన వెంటనే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని భావిస్తున్నారు.
అరకొరగా కొనుగోళ్లు
జిల్లాలో మొత్తం 19 ఏఎంసీలుండగా, పశ్చిమ కృష్ణా పరిధిలోనే సుబాబుల్ పంట అధికంగా ఉన్న నందిగామ, జగ్గయ్యపేట, కంచకచర్ల ఏఎంసీల పరిధిలో మాత్రమే సుబాబుల్ కొనుగోళ్లు జరుగుతున్నాయి. మొత్తం ఐదు కంపెనీలుండగా, నందిగామ ఏఎంసీ పరిధిలో ఒక కంపెనీ మాత్రమే కర్ర కొనుగోళ్లు చేపడుతుండగా, మిగిలిన రెండు చోట్ల రెండేసి కంపెనీలు కొనుగోళ్లు జరుపుతున్నాయి. ఈ మూడు ఏఎంసీల పరిధిలో కొనుగోళ్లు అరకొరగానే జరుగుతున్నాయి. తమ వంతు కోసం వేల సంఖ్యలో రైతులు ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది.
మద్దతు ధర రూ.4.600 చేస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు ఆ పని చేయకపోగా, ఉన్న ధరలో రూ.200 తగ్గించి రూ.4,200 గిట్టుబాటు ధర ప్రకటిస్తూ, జీఓ జారీ చేసింది. ప్రస్తుతం అందులో సగం ధరకు కూడా కంపెనీలు కొనుగోళ్లు చేపట్టకపోవడం గమనార్హం.
ఈ పరిస్థితి ఊహించ లేదు
వాతావరణం అనుకూలించక, సాగు నీరు సక్రమంగా అందక సుబాబుల్ పంట సాగు చేపట్టాను. ఐదెకరాల్లో పంట సాగు చేశాను. అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే రెండెకరాల్లో పంట తొలగించాను. టన్ను రూ.2 వేలకు అమ్ముకున్నాం. మరో రెండెకరాల్లోని కర్రను అయినకాడికి అమ్ముకొని వాటిలో కూడా పంట తొలగించాలని నిర్ణయించుకున్నాను. ఇంతటి గడ్డు పరిస్థితులు తలెత్తుతాయని ఊహించ లేదు.–మానుకొండ కృష్ణారెడ్డి, రైతు
ప్రభుత్వం చొరవ చూపాలి
కంపెనీల ప్రతినిధులు, దళారులు కలసి రైతులను అడ్డంగా దోచుకుంటున్నారు. ఉద్దేశ పూర్వకంగా ధరలు తగ్గిస్తున్నారు. సుబాబుల్ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ దశలో ప్రభుత్వం ఆదుకొని కొనుగోళ్లు చేపడితే, తొలకరి సమయానికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు రైతులకు అవకాశం దక్కుతుంది.–పాలేటి సతీష్, ఏఎంసీ మాజీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment