ఒంగోలు టూటౌన్ : జిల్లాలో సుబాబుల్, జామాయిల్ కర్ర కొనుగోలు ఒప్పందానికి పేపరు మిల్లుల యజమానులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఎన్ని ఒప్పందాలు జరిగినా.. అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులు చేసిన అగ్రిమెంట్లే అడ్రస్ లేకుండా పోతున్నాయి. చివరకు దళారే కింగ్ అవుతూ చక్రం తిప్పుతున్నాడు. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది.
జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో సామాజిక వనాలు సాగవుతున్నాయి. మరో 10 వేల ఎకరాల్లో సరుగుడు తోటలు సాగవుతున్నాయి. జామాయిల్, సుబాబుల్, సరుగుడు వంటి తోటలను ప్రత్యామ్నాయంగా రైతులు జిల్లాలో సాగుచేస్తున్నారు. ఏటా 40 వేల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్ కర్ర కోతకు వస్తోంది. ఆ సమయానికి పేపరు మిల్లుల యజమానులు గద్ధలా వాలి దోపిడీ రచన చేస్తున్నారు. మార్కెట్లో దళారీలను పెంచిపోషించి రైతులపైకి ఎగదోలడం పరిపాటిగా మారింది. కర్ర కొనుగోలుకు సంబంధించి 1999 నుంచి రైతులకు, పేపరు మిల్లులకు మధ్య ప్రభుత్వం ఆధ్వర్యంలో ధరల ఒప్పందం జరుగుతోంది. పాలకుల సమక్షంలో చేసిన ఒప్పంద ధరను వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా సక్రమంగా అమలుచేస్తూ వచ్చారు. అయితే, గత నాలుగు సంవత్సరాలుగా పాత విధానం గతి తప్పింది. కలెక్టర్, రైతులు, ప్రజాప్రతినిధులు, మంత్రుల సమక్షంలో జరిగిన ఒప్పంద ధరలు అమలుకు నోచుకోవడంలేదు.
ఏటా రైతులకు కోట్లలో నష్టం...
10–10–2016న ఒంగోలులో కలెక్టర్ సమక్షంలో టన్ను సుబాబుల్ రూ.4,000, జామాయిల్ టన్ను రూ.4,200కు కొనుగోలు చేసే విధంగా ఒప్పందం జరిగింది. ఒప్పందమైతే జరిగిందిగానీ, నేటికీ అమలుకు నోచుకోలేదు. టన్ను జామాయిల్ రూ.2,700, సుబాబుల్ రూ.3,400కు కొనుగోలు చేస్తూ రైతుల పొట్టగొడుతున్నారు. కర్ర తాట తీసి రైతులు తీసుకెళ్తున్నా తక్కువ ధరకే కొనుగోలు చేయడం నిత్య కృత్యమైంది. దీని వలన రైతులకు టన్ను జామాయిల్ కర్రకు రూ.1500, సుబాబుల్ కర్రకు రూ.600 నష్టపోవాల్సి వస్తోంది. ఎకరాకు సరాసరిన జామాయిల్ పంటలో రూ.35,000, సుబాబుల్ కర్రకు రూ.12,000 వరకు దోపిడీ జరుగుతోంది. ఫలితంగా ఏటా సామాజిక వనాల రైతులు కోట్లలో నష్టపోతున్నారు.
మీ కోసంలో జేసీకి రైతు సంఘం ఫిర్యాదు
రైతులకు జరుగుతున్న అన్యాయంపై జోక్యం చేసుకుని సుబాబుల్, జామాయిల్ ఒప్పంద ధరలపై సమీక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మికి రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపీనాథ్, మండవ శ్రీనివాసరావు, రైతులు కలిసి సోమవారం మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. పేపరుమిల్లుల ప్రతినిధులు, రైతు ప్రతినిధులతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి కొత్త ఒప్పందం చేయాలని కోరారు. లేకపోతే రైతులు ఆర్థికంగా ఎంతో నష్టపోతారని తెలిపారు.
రైతులపై కర్రపెత్తనం..!
Published Tue, Oct 10 2017 6:50 AM | Last Updated on Tue, Oct 10 2017 6:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment