రైతుల బకాయిలు ఇప్పించడంలో ప్రభుత్వం విఫలం
నందిగామ : ఎస్పీఎం కంపెనీ సుబాబుల్ రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు విమర్శించారు. బకాయిల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఏఎంసీ కార్యాలయం ఎదుట బుధవారం నిర్వహించన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఎస్పీం కంపెనీ ఏఎంసీకి కేవలం రూ. రెండు కోట్ల విలువ చేసే బ్యాంకు గ్యారంటీ ఉండగా రూ.14 కోట్ల వరకు ఎలా అప్పు పెట్టారని ప్రశ్నించారు. కంపెనీ వారు కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారన్నారు.
అయినప్పటికీ కలెక్టర్ కంపెనీకి నోటీసుల పేరిట కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఏఎంసీ నిధుల నుంచి కానీ, ప్రభుత్వం కానీ వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కంపెనీ వారు ఈ ప్రాంత రైతులకు డబ్బులు ఇవ్వకుండా వేరే ప్రాంతంలో సుబాబుల్ కర్ర కొంటున్నారని, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. దీక్ష చేస్తున్న రైతులు, రైతు నాయకులకు జగన్మోహన్‌రావు మద్దతు తెలిపారు.
కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు కోవెలమూడి ప్రమీల, ఎంపీపీ వల్లంకొండ భద్రఖాళి, పార్టీ నియోజకవర్గ నాయకుడు కోవెలమూడి వెంకట నారాయణ, కార్యాలయ ఇన్‌చార్జి డాక్టర్ ఎం. అరుణకుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మంగునూరి కొండారెడ్డి, మండల కన్వీనర్ నెలకుదిటి శివనాగేశ్వరరావు, మండల రైతు కన్వీనర్ చిలుకూరి బుచ్చిరెడ్డి, నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యుడు కత్తురోజు శ్రీనివాసాచారి, పలు విభాగాల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాకాలపాటి రోజానమ్మ, జిల్లేపల్లి రంగారావు, మువ్వల శ్రీనివాసరావు, కొండా కృష్ణారెడ్డి, నెలకుర్తి సత్యనారాయణ, రవికిరణ్ రెడ్డి, షేక్ ఫాతిమా, ఆవుల విజయ్, కిరణ్ పాల్గొన్నారు.