13 ఏళ్లుగా '108 అంబులెన్స్‌' రూపంలో.. వెంటాడిన మృత్యువు! | - | Sakshi
Sakshi News home page

13 ఏళ్లుగా '108 అంబులెన్స్‌' రూపంలో.. వెంటాడిన మృత్యువు!

Published Tue, Mar 19 2024 1:05 AM | Last Updated on Tue, Mar 19 2024 9:27 AM

- - Sakshi

స్వప్న (ఫైల్‌)

చికిత్స పొందుతూ ఈఎంటీ స్వప్న మృతి

రెండు దఫాలు రోడ్డు ప్రమాదానికి గురైన 108 వాహనం

మెదడులో బలమైన గాయం.. 7నెలలు విధులకు దూరం

చివరికి చికిత్స కోసం అదే వాహనంలో వెళ్లి కన్నుమూత

ఉద్యోగిగా గుర్తించని ప్రస్తుత యాజమాన్యం.. ఆదుకోవాలని వేడుకోలు

వరంగల్‌: 108.. ఈ నంబర్‌ వినగానే మృత్యువు దారిదాపుల్లో ఉన్న వారి ప్రాణాలు లేచి వస్తాయి. ఈ వాహనం.. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన ఎంతో మందిని మృత్యువు అంచుల నుంచి కాపాడుతోంది. అయితే అదే వాహనం.. తన వద్దే ఈఎంటీగా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిని బలితీసుకుంది. ఆ ఉద్యోగిని విషయంలో మృత్యువు 13 ఏళ్ల నుంచి వెంటాడుతోంది. రెండు సార్లు రోడ్డు ప్రమాదాలకు గురి చేసింది. ఫలితంగా అందరికీ ప్రాణదాతగా ఉన్న 108 వాహనం తమ ఉద్యోగి పాలిట మృత్యుశకటంగా మారి బలితీసుకున్న ఘటన సహా ఉద్యోగులు, బాధిత ఉద్యోగి కుటుంబీకులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.

మొదటి నుండి ఇలా..
దివంగత నేత వైఎస్సార్‌ 108 వాహనాలు ప్రారంభించిన తొలిరోజులు.. 2007లో హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన సూదమళ్ల స్వప్న ఈఎంటీగా విధుల్లో చేరారు. విధుల్లో చురుకుగా ఉండే స్వప్న ఉత్తమ పనితీరుతో సహా ఉద్యోగులు, ఉన్నతాధికారుల ప్రశంసలతోపాటు పలు అవార్డులు అందుకున్నారు. విధుల్లో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు, హనుమకొండ, ఏటూరునాగారం, తాడ్వాయి, పరకాల తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 108 వాహనంలో 108 ప్రసవాలు చేసి రికార్డు సృష్టించారు.

ఇలా హుషారుగా సాగుతున్న స్వప్న జీవితానికి, తన సంతోషానికి కారణమైన 108 వాహనమే ఈ విషాదానికి కారణమైంది. 2010 సంవత్సరంలోలో 108 వాహనంలో కేయూసీ పాయింట్‌ వద్ద విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఓ ప్రమాద ఘటనా స్థలికి వెళుతుండగా కేయూసీ– హసన్‌పర్తి రోడ్డులో తమ 108 వాహనం ఘొర ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వప్న హైదరాబాద్‌లో చికిత్స పొందింది.

అయితే మెదడులో తీవ్ర గాయం కావడంతో రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెప్పారు. ఒకటికి మూడుసార్లు ఆపరేషన్లు చేశారు. అయినా పూర్తిగా కోలుకోలేకపోయింది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యపరిస్థితి పూర్తిగా దిగజారడంతో మళ్లీ విధుల్లో చేరింది. కరోనా కాలంలో రెట్టించిన ఉత్సాహంతో విధుల్లో చేరింది. తన పునర్జన్మ కరోనా బాధితుల కోసమే అంటూ ధైర్యంగా పనిచేసింది. కానీ స్వప్న విషయంలో విధి వెక్కిరించింది. 108 రూపంలో వెంటాడుతున్న మృత్యువు మరోసారి దెబ్బతీసింది. 2021లో పరకాల 108 వాహనంలో పనిచేస్తూ ఓ క్షతగాత్రుడిని ఎంజీఎం తరలించి వెళ్తోంది.

ఈ క్రమంలో 108 వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఫలితంగా తను పనిచేస్తున్న వాహనం రెండోసారి మృత్యుశకటమై ఆసుపత్రి పాలు చేసింది. నాటి నుంచి స్వప్న మంచానికే పరిమితమైంది. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సహా ఉద్యోగులు తమకు తోచిన మేర ఆర్థిక సాయం చేశారు. దీంతో మరోమారు వారం క్రితం తను పనిచేసిన...తనను మృత్యుకూపంలోకి నెట్టిన 108వాహనంలో హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా స్వప్న తిరిగి రాలేదు. ఆదివారం కనిపించని లోకాలకు తరలింది. అదే సంస్థ వాహనంలో విగతజీవిగా వచ్చింది. 13 ఏళ్లు స్వప్నను వెంటాడి వధించిన మృత్యువు తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది.

ఉద్యోగి కాదంటున్న యాజమాన్యం
సుమారు దశాబ్దకాలం పాటు తమ సంస్థలో పని చేసి విధుల్లో ప్రమాదానికి గురై మృతి చెందిన స్వప్ర.. ప్రస్తుతం ఆ సంస్థకు కానిది అయింది. ఎందుకంటే కొద్ది రోజుల కిత్రం సంస్థ పేరును ‘గ్రీన్‌ హెల్త్‌ సర్వీస్‌’గా మార్చారు. మార్చిన తరువాత గతంలో ఉన్న ఉద్యోగుల నుంచి బయోమెట్రిక్‌, ఇతర సమాచారం తీసుకుని నమోదు చేసుకున్నారు. ఆ సమయంలో స్వప్న మంచానికే పరిమితమైంది. దీంతో తమ సంస్థలో పనిచేస్తున్నట్లు కొత్త ఐడీ నంబర్‌ ఉంటేనే గుర్తింపు ఇస్తామని సంస్థ చెపుతోందని సహా ఉద్యోగులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది అన్యాయమని వారు వాపోతున్నారు.

కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే..
కడు పేద కుటుంబంలో ఉన్న స్వప్న ఒంటరిగా ఉంటోంది. తన అక్కకు ముగ్గురు సంతానం. ఇందులో ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అక్కకు భర్త లేడు. దీంతో వారిలో ఒక కూతురును స్వప్న పెంచుకోవడంతోపాటు అక్క కుటుంబ బాధ్యతలు తనే చూస్తోంది. స్వప్న మృతితో ఇప్పుడు తమకు ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని ఆ కుటుంబం రోదిస్తోంది. దశాబ్దానికి పైగా 108లో సేవలందించి అందరికీ దూరమైన స్వప్న విషయంలో ప్రభుత్వం స్పందించాలని సహా ఉద్యోగులు, కుటుంబీకులు కోరుతున్నారు.

సంస్థకూడా ఉద్యోగిగా గుర్తించి పరిహారం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. స్వప్న విషయంలో సంస్థ గుర్తింపు ఇవ్వడానికి సాంకేతిక కారణాలు చూపినా అందులో ఉన్న ఉద్యోగులు మానవత్వం చాటుకున్నారు. సంస్థ రాష్ట్ర బాధ్యుడు ఖలీద్‌ సూచన మేరకు జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ పాటి శివకుమార్‌ ఆధ్వర్యంలో స్వప్న అంత్యక్రియలకు ఆదివారం రూ. 10 వేలు అందించారు. మిగతా విషయాలు తమ పరిధిలో లేవన్నారని ఉద్యోగులు చెబుతున్నారు.

ఇవి చదవండి: ప్రాణం పోస్తారనుకుంటే.. తీశారు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement