మరింత సేవకు.. | CM YS Jagan launched 146 new ambulances Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మరింత సేవకు..

Published Tue, Jul 4 2023 3:41 AM | Last Updated on Tue, Jul 4 2023 3:41 AM

CM YS Jagan launched 146 new ambulances Andhra Pradesh - Sakshi

తాడేపల్లిలో 108 అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: అత్యవసర వైద్య సేవ­లను మరింత బలోపేతం చేయడంలో భాగంగా 146 కొత్త 108 వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. క్యాంపు కార్యా­లయం బయట ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్న ఆయన అత్యాధునిక వసతులతో కూడిన అంబులెన్స్‌ వాహ­నాన్ని పరిశీలించారు.

ఇందులో ఉండే వసతుల గురించి వైద్య శాఖ ప్రత్యేక ప్రధా­న కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సీఎంకు వివరించారు. అనారోగ్య బాధితులను ఏ విధంగా అంబులెన్స్‌లోకి ఎక్కిస్తారో సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేదిక­పైకి చేరుకుని దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం జగన్‌ నివా­ళులు అర్పించారు. తర్వాత జెండా ఊపి అంబులెన్స్‌లను ప్రారంభించారు.

ఈ కార్య్ర­కమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడ­దల రజిని, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ నందిగం సురేశ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ నివాస్, ఆరోగ్య­శ్రీ సీఈవో హరేందిరప్రసాద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికారులు పాల్గొ­న్నారు.

108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా రూ.34.79 కోట్లతో 146 కొత్త అంబులెన్స్‌­లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన 108 వ్యవస్థను బలోపేతం చేస్తూ 2020లోనే మండలానికి ఒక 108 అంబులెన్స్‌ను సమకూర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో 768 అంబులెన్స్‌లు ఉన్నాయి. కాగా, వీటిలో మరమ్మతులకు గురైన వాహనాల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement