108 సేవలపైనా ఆంక్షలు | Instructions For 108 Vehicles In Prakasam | Sakshi
Sakshi News home page

108 సేవలపైనా ఆంక్షలు

Published Tue, Jun 26 2018 1:43 PM | Last Updated on Tue, Jun 26 2018 1:43 PM

Instructions For 108 Vehicles In Prakasam - Sakshi

ఒంగోలు: 108...ఈ వాహనం పేరు వింటే మొట్టమొదట గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి. ఆయన సీఎం అయిన వెంటనే పేదల ఆరోగ్యం కోసం 108 వాహనాన్ని ప్రవేశపెట్టి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. 108 పథకం అంతటి ఆదరణ పొందింది. ఇప్పుడు 108 సేవలపైనా ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అనధికారికంగా ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి జిల్లా కోఆర్డినేటర్‌ చెబుతున్న సమాధానం ఒకలా ఉంటే వాస్తవంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య మరోలా ఉంది. 

ఇవీ.. ఆంక్షలు
ఇటీవల టంగుటూరు సమీపంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గుండె, ఊపిరితిత్తులకు మధ్య భాగంలో లోతుగా గాయమైంది. బంధువులు హుటాహుటిన అతడిని టంగుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తీసుకెళ్లాలని సూచించారు. ప్రైవేటుగా వాహనం మాట్లాడుకునే ప్రయత్నం చేయగా క్షతగాత్రుడి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఎవరూ ముందుకు రాలేదు. అతడి బంధువులు 108ను ఆశ్రయించారు. తాము కేవలం రిమ్స్‌కు మాత్రమే తీసుకెళ్తామని, ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లేది లేదని 108 సిబ్బంది తేల్చి చెప్పారు.
ఇటీవల రాణి అనే ఒక మహిళ దుద్దుకూరు సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఎన్నో ఆటోలు ఆ మార్గంలో వెళ్తున్నా ఒక్కరూ కనీసం ఆస్పత్రికి తరలించేందుకు ముందుకు రాలేదు. ఇక లాభం లేదని భావించి 108కు కాల్‌ చేస్తే అరగంటకు వచ్చింది. రిమ్స్‌కు తీసుకెళ్తాం తప్ప.. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిబ్బంది ససేమిరా అన్నారు.  
చీరాలకు చెందిన ఓ కుటుంబం తిరుపతి దైవ దర్శనానికి వెళ్లింది. తిరిగి వచ్చే క్రమంలో ఆ కుటుంబంలో ఒక చిన్న బాబు అస్వస్థతకు గురయ్యాడు . చేతిలో బిడ్డ చేతిలోనే వాలిపోతుండడంతో కుటుంబ సభ్యులు రైలులో నుంచే 108కు కాల్‌ చేశారు. ఒంగోలులో రైలు ఆగడంతోనే 108 సిబ్బంది వారిని వాహనంలోకి ఎక్కించుకున్నారు. రిమ్స్‌కు మాత్రమే తీసుకెళ్తామని చెప్పారు.

గతంలో ఇవ్వన్నీ లేవు
గతంలో ఇలాంటి ఆంక్షలు లేవు. ఎక్కడో ఏదో ఫిర్యాదులు వచ్చాయంటూ జిల్లా కోఆర్డినేటర్లు పలు జిల్లాల్లో దర్యాప్తులు జరిపారు. పలు ప్రైవేటు ఆస్పత్రులు తమ ఆస్పత్రికి కేసు తీసుకొస్తే డబ్బులు ఇస్తామంటూ 108 సిబ్బందికి ఆశ చూపుతున్నారు. దీన్ని పసిగట్టిన 108 పథకం ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. ఒక వేళ అత్యవసరం అనుకుంటే సంబంధిత అంబులెన్స్‌ సిబ్బంది జిల్లా కోఆర్డినేటర్‌తో మాట్లాడి ఆయన అనుమతితో ప్రైవేటు ఆస్పత్రులకు తరలించాలి. వాస్తవానికి సిబ్బంది చేతివాటం అనేది అతి చిన్న సమస్య. దీన్ని నివారించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్నాయి. ఒక వైపు ప్రభుత్వం 108కు సేవలు అందించేందుకు నిధులు అందిస్తున్నా క్షతగాత్రులు మాత్రం ప్రభుత్వ వైద్యశాల నుంచి ప్రైవేటు వైద్యశాలకు వెళ్లేందుకు ప్రైవేటు అంబులెన్స్‌లకు అదనంగా ఖర్చు పెడుతున్నారు. మరో వైపు 108 సిబ్బంది కేస్‌ టేకప్‌ చేసినప్పుడు కాల్‌ సెంటర్‌ సిబ్బందితో మాట్లాడతారు. కాల్‌ సెంటర్‌లోని ఎక్స్‌పర్ట్స్‌ సూచనల మేరకు పనిచేస్తారు. క్షతగాత్రుల అభిప్రాయం తీసుకుంటే పోయేదానికి జిల్లా కోఆర్డినేటర్‌తో ఎందుకు లింక్‌ పెట్టారనేది సందేహం వ్యక్తమవుతోంది.

మూలనపడిన మూడు అంబులెన్స్‌లు
జిల్లాలో మొత్తం 32 అంబులెన్స్‌లు నడుస్తుండగా పలు అంబులెన్స్‌లు దాదాపు డొక్కు వాహనాలుగా మారాయి. ప్రభుత్వం కొత్త వాహనాలు మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరో వైపు గిద్దలూరు, కంభం , పర్చూరుల్లోని 108 వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి. వీటిని బాగు చేసేందుకు మెకానిక్‌ల సమస్య ఎదురవుతోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి వాహనాల మరమ్మతులకు గత యాజమాన్యం రూ.1.50 లక్షలు బకాయి ఉంది. 2017 డిసెంబర్‌ నుంచి యాజమాన్యం మారింది. పాత యాజమాన్యం తమకు బకాయి కట్టలేదంటూ మరమ్మతులు చేసేందుకు ఒప్పందం చేసుకున్న సంస్థ నిరాకరించింది.  

అత్యవసరమైతే అవకాశం ఇస్తున్నాం
అవినీతి మకిలీ అంటకూడదనే ఉద్దేశంతోనే కేసులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నాం. ఒకవేళ క్షతగాత్రులు ఎవరైనా మేము ఫలానా ఆస్పత్రికే తీసుకెళ్లండని కోరితే సిబ్బంది మమ్మల్ని కాంటాక్ట్‌ చేస్తారు. నేను స్వయంగా క్షతగాత్రులతో మాట్లాడిన తర్వాత అనుమతి ఇస్తున్నా. అంతే తప్ప ప్రైవేటు వైద్యశాలలకు తరలించొద్దని ఎలాంటి ఉత్తర్వులు మాకు రాలేదు. దీనిపై మా సిబ్బందికి అవగాహన కల్పిస్తాం.
– బాలాజీ, 108 జిల్లా కోఆర్డినేటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement