
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన పేదల మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటు చేసిన ‘పరమపద’ వాహనాలు ఆపదలో చిక్కుకున్నాయి. తరచూ రిపేర్లు వస్తుండటం, పలు వాహనాలకు కాలం చెల్లిపోవడంతో మూలనపడ్డాయి. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృతిచెందిన వారి శవాల తరలింపు ప్రశ్నార్థకంగా మారింది. 2016 నవంబర్ 18న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘హెర్సే’ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. గాంధీ, ఉస్మానియా మార్చురీలకు పది చొప్పున, నిమ్స్, నిలోఫర్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రులకు ఐదు చొప్పున వాహనాలు కేటాయించింది. మరో పది వాహనాలను అందుబాటులో ఉంచింది. వీటిలో ప్రస్తుతం ఏడు వాహనాలు మాత్రమే పని చేస్తున్నాయి. అవి కూడా తరచు మార్గమధ్యలో మెరాయిస్తున్నాయి. దీంతోమృతదేహాల తరలింపు నిలిచిపోయి సమస్యలు తలెత్తుతున్నాయి.
పాతవాటికి రంగులేసి..
నగరంలో ఉస్మానియా, గాంధీ తదితర ప్రతిష్టాత్మాక ప్రభుత్వ ఆస్పత్రులు ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం రాష్ట్రం నలుమూలల నుంచి నిరుపేద రోగులు ఇక్కడికి వస్తున్నారు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్న తర్వాత ఆస్పత్రికి చేరుకోవడం, చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో వారిలో పలువురు ఆస్పత్రిలోనే మృత్యువాత పడుతున్నారు. వీరికి తోడు వివిధ రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులతో పాటు ప్రమాదాల్లో మరణించిన వారి మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం ఇక్కడికే తీసుకొస్తుంటారు. అయితే ప్రైవేటు అంబులెన్స్‌లో మృతదేహాల తరలింపు బాధితులకు భారం కావండంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోయిన పేదల మృతదేహాలను వారి సొంత గ్రామాలకు తరలించేందుకు ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ‘హెర్సె’ పథకాన్ని ప్రవేశపెట్టింది. వాస్తవానికి ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెట్టినప్పుడు ఆ మేరకు కొత్త వాహనాలు కొనుగోలు చేయాల్సిఉన్నప్పటికీ...వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. అప్పటికే 108 విభాగంలో సేవలు అందించి వివిధ సాంకేతిక కారణాలతో షెడ్డుకు చేరిన వాహనాలకు తాత్కాలిక రిపేర్లు చేసి వాటిని మార్చురీలకు అప్పగించారు.
అప్పటికే వాటిని కొనుగోలు చేసి చాలా కాలం కావడం, పాతవాటికి కొత్తగా రంగులు అద్దడం, నిర్ధేశిత దూరానికి మించి ప్రయాణించడం, వివిధ రోడ్డు ప్ర మాదాల్లో విడిభాగాలు పూర్తిగా దెబ్బతినడంతో మార్చురీలకు అప్పగించిన కొద్ది రోజులకే అవి మళ్లీ మూలన పడ్డాయి. వీటి స్థానంలో కొత్త వాహనాలు సమకూర్చాలని ఆయా ఆస్పత్రుల అధికారులు వైద్య ఆరోగ్యశాఖకు లేఖ రాసినా పట్టించుకోవడం లేదు. దీంతో మృతదేహాల తరలింపునకు ప్రభుత్వ అంబులెన్స్‌లు లేకపోవడంతో బాధితులు ప్రైవేటు అంబులెన్స్‌లను సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఒక్కో మృతదేహం తరలింపుకు రూ.10 వేలకుపైగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
కొత్త వాహనాల కోసం లేఖ
గాంధీ ఆస్పత్రి మార్చురీకి పది వాహనాలు కేటాయించగా, వాటిలో ఇప్పటికే ఏడు వాహనాలు షెడ్డుకు చేరాయి. ప్రస్తుతం మూడు వాహనాలే పని చేస్తున్నాయి. ఉస్మానియా మార్చురీకి పది వాహనాలు కేటాయించగా, ప్రస్తుతం నాలుగు వాహనాలు మాత్రమే పని చేస్తున్నాయి. ఒక్కో మార్చురీకి రోజుకు సగటున 25 మృతదేహాలు చేరుతుంటాయి. అనాథ మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తుండగా, మిగిలిన వాటిని వారి బంధువులకు అప్పగిస్తుంటారు. మృతదేహాల నిష్పత్తికి తగినన్ని హెర్సే వాహనాలు లేకపోవడంతో ఒక్కో వాహనంలో రెండు మూడు బాడీలను తరలించాల్సి వస్తుందని ఆయా ఆస్పత్రుల అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉచిత అంబులెన్స్‌లు ఉన్నప్పటికీ...ఎందుకు కేటాయించడం లేదని మృతుల బంధువులు తరచూ వైద్యాధికారులతో ఘర్షణలకు దిగుతున్నారు.
ఇలాంటి సమయంలో వారికి సమాధానం చెప్పలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాల తరలింపునకు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు మరో పది వాహనాలు సమకూర్చాల్సిందిగా పేర్కొంటూ ఆయా ఆస్పత్రుల అధికారులు ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సహా ముఖ్య కార్యదర్శులకు లేఖలు రాయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment