అన్‌ ‘ఫిట్‌’ | Ambulance Vehicles Damaged In Krishna | Sakshi
Sakshi News home page

అన్‌ ‘ఫిట్‌’

Published Tue, Aug 7 2018 1:11 PM | Last Updated on Sat, Aug 18 2018 2:15 PM

Ambulance Vehicles Damaged In Krishna - Sakshi

నూజివీడులో షెడ్‌కు పరిమితమైన 108 వాహనం

సాక్షి, అమరావతిబ్యూరో: ఎంతో మహోన్నత ఆశయంతో మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన 108, 104 అంబులెన్సుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది. కనీస మరమ్మతులు చేయించకుండా వాహనాలు తిప్పడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. అత్యవసర సమయాల్లో బాధితులను రక్షించేందుకు ఏర్పాటుచేసిన 108 సర్వీసులే ప్రమాదాలకు లోనవుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మొబైల్‌ వాహనం ద్వారా వైద్య సేవలు అందించేందుకు ప్రవేశపెట్టిన 104 పథకం అమలు సైతం దయనీయంగానే ఉంది. ప్రమాదకర వాహనాలు ప్రజల ప్రాణాలతోచెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వం ఈ వాహనాల బాధ్యతలనుచూసే సంస్థలు వీటి నిర్వహణను గాలి కొదిలేయడంతోనే ఈ దుస్థితి నెలకొంది. ఎలాంటి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌(ఎఫ్‌సీ) లేకపోయినా ఈ వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి.

జిల్లాలో 104కు చెందిన 24 వాహనాలుండగా ఒక్క అంబులెన్స్‌కు ఫిట్‌నెస్‌ కానీ, ఆర్‌సీ కానీ, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ కానీ లేవు. అదేవిధంగా మూడు 108 వాహనాలు కూడా ఎఫ్‌సీ లేకుండానే తిరుతున్నాయి. కలిదిండి, ఇబ్రహీంపట్నం, చాట్రాయి మండల కేంద్రాల్లో ఉన్న 108 వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేదు. అయినా వాటి నిర్వహణ బాధ్యతలు చూసే సంస్థలు ఆయా వాహనాలను రోగులను తరలించేందుకు పంపుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 104 వాహనం ఒక రోజు ఓ గ్రామానికి వెళ్లి వస్తే ఆ వాహనానికి రూ. 10 వేలు నిర్వహణ సంస్థ పీఎస్‌ఎంఆర్‌కు అందుతుంది. అందువల్లే ఆవి ఫిట్‌గా లేకపోయినా కాసులకు కక్కుర్తిపడి వాటిని రోజూ తిప్పుతున్నారని సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇటీవల ఫిట్‌నెస్‌ లేని 104 వాహనం ప్రమాదానికి గురికాగా డ్రైవరుతో సహా ఎనిమిది నెలల గర్భిణి అయిన నర్సు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 104 సిబ్బంది ఆందోళనకు దిగారు. ఇలాంటి వాహనాల్లో తాము పనిచేయమని వారు స్పష్టం చేశారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్పందించి  ఈ వాహనాలన్ని ఫిట్‌గా ఉండేలా మరమ్మతులు చేయిస్తామని ఈ ఏడాది మే 1వ తేదీన స్వయంగా ప్రకటించారు. మూడు నెలలు గడిచినా ఫలితం లేకపోవడం విచారకరం.

గర్భిణనిని తీసుకెళ్తూ...
జిల్లాలోని గరికిముక్కల గ్రామానికి చెందిన మేరికి పురిటి నొప్పులతో గత నెల 30వ తేదీన కలిదిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. అత్యవసరంగా ఆమెను 108 వాహనంలో సమీప పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యలో గుర్వాయిపాలెం ఇటుకల బట్టీ వద్దకు రాగానే 108 వాహనం ముందు చక్రం విరిగిపోయింది. డ్రైవర్‌ సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ వాహనానికి ఫిట్‌నెస్‌ లేనికారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. చాలా వరకు అంబులెన్స్‌లకు కాలం చెల్లడం. ఉన్నవి కూడా కండీషన్‌లో లేకపోవడం. పాడైపోయిన ఉపకరణాలు (స్పేర్‌పార్ట్స్‌) సరైన మరమ్మతులకు నోచుకోకపోవడంతో జిల్లాలో 108 వాహనాలు తరచూ షెడ్లకు చేరుతున్నాయి. ముఖ్యంగా ఫిట్‌నెస్‌ లేని వాహనాల వల్ల అటు రోగులతోపాటు ఇటు సిబ్బంది సైతం ప్రాణాలను పణంగా పెట్టాల్సిరావడం విచారకరం. రాష్ట్రంలో మూలనపడ్డ అంబులెన్స్‌లను 15 రోజుల్లోగా మరమ్మతులు చేయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించినా ఫలితం లేకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.

ముక్కుతూ.. మూల్గుతూ..!
జిల్లాలో 108 అంబులెన్స్‌ వాహనాలు 33 ఉన్నాయి. వీటిలో 20కిపైగా వాహనాలు తరచూ మరమ్మతుల కోసం మెకానిక్‌ షెడ్డుకు చేరుతున్నాయి. వీటి నిర్వహణ బాధ్యత చూసుకునే సంస్థ యాజమాన్యం వాహనాల మరమ్మతుల విషయంలో పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మెకానిక్‌ షెడ్డు నుంచి బయటకు వచ్చిన వాహనాలు వారం రోజులు తిరగక ముందే మళ్లీ అక్కడికే చేరుతుండటం గమనార్హం. అలాగే చాలా వాహనాల్లో సరైన సౌకర్యాలు ఉండడం లేదు. ఉదాహరణకు నూజివీడు 108 వాహనం తీసుకుంటే ఏదైనా తేలికపాటి వర్షం వచ్చినా ఈ వాహనంలో కూర్చోవడానికి వీలుండదు. వాహనం లోపలి ఉండే రోగులు కూడా ఈ బాధలు తప్పవు. వర్షం నీటితో వాహనం తడిసిపోయేది. ఒకవేళ వర్షంలో వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. వాహనం వైఫర్‌ బ్లేడ్స్‌ పనిచేయకపోవడం ఇందుకు కారణం. ఇలా జిల్లా మొత్తంగా 108 వాహనాల వల్ల రోగులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు మేల్కోకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో దీపంలా మారే ప్రమాదం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement