మూలకు నెట్టేసి.. భ్రష్టు పట్టించేసి.. | 108 Staff Strike In Vizianagaram | Sakshi
Sakshi News home page

మూలకు నెట్టేసి.. భ్రష్టు పట్టించేసి..

Published Thu, Jul 25 2019 8:54 AM | Last Updated on Thu, Jul 25 2019 8:57 AM

108 Staff Strike In Vizianagaram - Sakshi

గత ప్రభుత్వంలో ఇదీ 108 వాహనం దుస్థితి

అత్యవసర వేళ ఆదుకునే ఆపద్బాంధవిని మూలకు నెట్టేశారు. ప్రాధాన్యమివ్వాల్సిన ఈ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఎంతోమంది బాధితులకు సాయమందించిన అందులోని ఉద్యోగులను కనీసంగానైనా గుర్తించకుండా వదిలేశారు. వారికి కల్పించాల్సిన సదుపాయాలను నీరుగార్చేశారు. గ్రాట్యుటీ... లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌వంటి వాటిని బకాయిపెట్టేశారు. ఇదీ గత పాలకుల నిర్వాకం. ఇప్పుడదే ప్రస్తుత ప్రభుత్వానికి గుదిబండగా తయారైంది. వారి బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది ఆందోళనకు దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారి సమస్యలు చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై పడింది. గత ప్రభుత్వ పాపం ఇప్పుడు మోయాల్సిన దుస్థితి దాపురించింది.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆపదలో ఉన్నారని ఒక్క ఫోన్‌ చేస్తే చాలు కుయ్‌.. కుయ్‌.. కుయ్‌.. అంటూ ఇరవై నిమిషాల్లో సంఘటనా ప్రాంతానికి చేరుకుని సాయం అందించే ప్రాణ ప్రదాయినిగా 108 వాహనాలను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. ఆయన ఉన్నంతకాలం అలాగే అమలు జరిగేలా చూసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల మందిని 108 అంబులెన్స్‌లు కాపాడాయి. గత టీడీపీ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. వాటిలో పనిచేస్తున్న సిబ్బందికి కాంట్రాక్టు తీసుకున్న సంస్థ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎగవేస్తున్నా పట్టించుకోకుండా నిద్రపోయింది. చివరికి 108 వాహనాలు నడపడానికి అవసరమైన ఇంధనం కూడా సమకూర్చకుండా, బాగోగులకు కనీస ప్రాదాన్యం ఇవ్వకుండా వాహనాలన్నీ తుప్పుపట్టి పాడైపోయేలా చేసింది. ఫలితంగా ఈ రోజు 108 ఉద్యోగులు 135 మంది సమ్మె బాట పట్టాల్సిన దుస్థితి వచ్చింది

కండిషన్‌ కోల్పోయిన వాహనాలు
జిల్లాలో 108 అంబులెన్సులు 27 ఉన్నాయి. వీటిలో చాలా వరకూ పనిచేసే స్థితిలో లేవు. ఇందులో 66 మంది ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌)లు, 69 మంది ఫైలట్‌(డ్రై వర్లు) పనిచేస్తున్నారు. ఎమర్జెన్సీ కేసులు, మెడికల్‌ ఎమర్జెన్సీ, ప్రసూతి కేసులు, ట్రామా వాహనం, కార్డియాక్, రెస్పిరాట్రీ, రివర్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వంటి సేవలను 108 వాహనం ద్వారా ప్రజలకు అందుతోంది. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా 108 ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ గతంలో 108 నిర్వహించిన యాజమాన్యం చెల్లించకపోయినప్పటికీ అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా నేడు వారంతా సమ్మె చేయడానికి కారణమయ్యారు. గ్రాడ్యూటీతో పాటు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ డబ్బులు కూడా 108 ఉద్యోగులకు జీవీకే యాజమాన్యం ఇవ్వలేదు.

వాహనాల నిర్వహణ గాలికి
108 అంబులెన్సుల నిర్వహణను గతంలో జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థ నిర్వహించేది. 2017లో ఈ అంబులెన్సుల నిర్వహణను బీవీకే సంస్థ టెండర్లలో దక్కించుకుంది. అప్పటినుంచి బీవీకే సంస్థ 108  అంబులెన్సుల నిర్వహణను చూస్తోంది. ఈ సంస్థకు 108 అప్పగించేసరికి అందులోని ఉద్యోగులకు జీవీకే  ఈఎంఆర్‌ఐ సంస్థ గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ డబ్బులు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో ఒక్కో ఉద్యోగికి రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకూ బకాయిలు రావాల్సి ఉంది. వాటిని ఇప్పించాల్సిందిగా గత టీడీపీ ప్రభుత్వ హయంలో ఉద్యోగులు ఆందోళనలు కూడ చేశారు. వారికి జీవీకే యాజమాన్యం నుంచి గ్రాట్యు టీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ బిల్లులు వచ్చేలా చేస్తామని అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు 108 ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.

కానీ ఎప్పటిలాగే మాటతప్పిన చంద్రబాబు రెండేళ్లపాటు 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదు. పైగా వారికి ఉద్యోగ భద్రత కూడా లేకుండా 108 వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సరికొత్తగా అడుగులు వేస్తోంది. ఈ దశలో మరలా 108 ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. దీనికి తోడు ఆరోగ్యశ్రీ, 108కు వైఎస్‌ఆర్‌ కాలం నాటి వైభవాన్ని తిరిగి తీసుకువస్తామని సాక్షాత్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలనుకున్నట్లున్నారు. దానిలో భాగంగానే సమ్మె చేపట్టారు. నిజానికి గత ప్రభుత్వమే గనుక 108 ఉద్యోగులను పట్టించుకుని, ఆ వ్యవస్థను పటిష్టం చేసిఉంటే ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తేది కాదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement