
ఇటీవల కింగ్‌కోఠి ఆస్పత్రి ముందు నిలిచిపోయిన సర్వీసు
సాక్షి, సిటీబ్యూరో: ఆపదలో పిలిస్తే చాలూ కుయ్..కుయ్‌మంటూ పరుగెత్తుకొచ్చే 108 అత్యవసర సర్వీసులకు ఆపదొచ్చింది. సమయానికి ఆయిల్ మార్చకపోవడం, సర్వీసింగ్ చేయించకపోవడం, తదితర నిర్వహణ లోపం వల్ల వాహనాలు తరచూ మొరాయిస్తున్నాయి. ఒక్కోసారి బాధితులను మధ్యలోనే దింపేసి వేరే వాహనాల్లో తరలించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 316 సర్వీసులు ఉండగా, వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 42 వాహనాలు పనిచేస్తున్నాయి. 1787 మంది క్షేత్రస్థాయిలో(పైలెట్, ఈఎంటీ), 73 మంది కాల్‌సెంటర్‌లో పని చేస్తున్నారు. ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈఎం టీలు, పైలెట్లు ఇటీవల సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. హెచ్చరికలను బేఖాతార్ చేస్తూ సమ్మె కొనసాగిస్తున్న 930 మందిని టెర్మినేట్ చేయడం, వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవడం తెలిసిందే. నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే గ్రేటర్ రహదారులపై డ్రైవింగ్‌లో సరైన అనుభవం లేని వ్యక్తులతో వాహనాలను నడిపిస్తుండటం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం ఈ సమ్మె కాలంలోనే వందవాహనాల వరకు డ్యామేజైనట్లు తెలిసింది. గతంలో రోజుకు ఏడు నుంచి ఎనిమిది కేసులను అటెండ్ చేసిన వాహనాలు..నిర్వహణ లోపం వల్ల ప్రస్తుతం ఐదారు కేసులనే అటెండ్ చేస్తున్నాయి.
ఇటీవల సాంకేతిక లోపంతో కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి ఎదురుగా 108 వాహనం నిలిచిపోయింది. సమస్యను గుర్తించడమే పైలెట్‌కు కష్టంగా మారింది. ఉప్పల్‌లోని ఓ రిపేరింగ్ సెంటర్‌కు నిత్యం నాలుగైదు వాహనాలు చేరుకుంటుండటం పరిస్థితికి నిదర్శనంగా చెప్పొచ్చు.
ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్లే
ఆపదలో ఉన్న రోగులకు సత్వర వైద్యసేవలు అందించాలనే ఆలోచనతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2005 సెప్టెంబర్ 15న 108 ఉచిత అంబులెన్స్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పట్లో ప్రభుత్వం, సత్యం ఈఎంఆర్‌ఐల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. 2011 తర్వాత ప్రభుత్వానికి జీవీకే–ఈఎంఆర్‌ఐకి మధ్య ఒప్పందం కుదిరింది. 2016 సెప్టెంబర్‌తో ఒప్పందం గడువు ముగిసింది. ఆ తర్వాత కూడా అదే సంస్థకు బాధ్యతలను కట్టబెట్టింది. దీర్ఘకాలికంగా ఒకే సంస్థకు ఇవ్వడం, ఈ సేవలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో సమస్య తలెత్తింది. వాహనాల మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం నెలకు రూ.21 వేలు చెల్లిస్తున్నా..వేళకు సర్వీసింగ్ చేయించకపోవడం, దెబ్బతిన్న పార్ట్‌లను మార్చకపోవడం వల్ల ఇంజన్‌లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఇటీవల సమ్మెలోకి వెళ్లిన సీనియర్ ఈఎంటీ, పైలెట్లను విధుల నుంచి తొలగించడం, వారిస్థానంలో వచ్చిన వారికి అత్య వసర సేవలపై కనీస అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మార్గమధ్యలో కనీస వైద్యసేవలు అందకపోవడం గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
యథావిధిగా సేవలు
జీవీకే ఈఎంఆర్‌ఐ అత్యవసర సర్వీసులన్నీ యథావిధిగా పని చేస్తున్నాయి. ఉద్యోగులు సమ్మెలో ఉన్నప్పటికీ సేవలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చూశాం. నిర్వహణ పరంగా ఎలాంటి లోపాలు లేవు. అన్ని వాహనాల్లోనూ ఫైలెట్ సహా ఈఎంటీ ఉన్నారు. అత్యవసర రోగులకు ప్రాధమిక వైద్యసేవలు అందిస్తున్నారు. వాహనంలో ఆక్సిజన్ సహా అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి సమస్యలు లేవు. వాహనాలకు విధిగా సర్వీసింగ్ చేయిస్తున్నాం. ఇప్పటికే పాత వాహనాల స్థానంలో 150 కొత్త వాహనాలు ఏర్పాటు చేశాం. ఉద్యోగుల టెర్మినేట్ అంశం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఆదేశాల ప్రకరమే నడుచుకుంటాం. – బ్రహ్మానందరావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment