మండలానికి అండ 108 | Telangana Government To Supply 108 Vehicles To Every Mandal | Sakshi
Sakshi News home page

మండలానికి అండ 108

Published Mon, Oct 21 2019 1:44 AM | Last Updated on Mon, Oct 21 2019 5:03 AM

Telangana Government To Supply 108 Vehicles To Every Mandal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక ‘108’ అత్యవసర వైద్య సేవల వాహనాన్ని సమకూర్చాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందుకు సంబంధించి సమాలోచనలు జరుపుతోంది. ప్రతి మండ లానికి ‘108’ సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తే దాని పరిధిలోని సమీప గ్రామా లకు తక్కువ సమయంలో చేరుకోవడానికి వీలు కలుగుతుందని, ప్రాణాపాయం నుంచి అనేక మందిని రక్షించవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం 358 వాహ నాలు ‘108’ వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో 333 వాహనాలు రోడ్లపై అందు బాటులో ఉండగా మిగిలినవి రిజర్వులో ఉన్నాయి. పట్టణాలు, నగరాల్లోనూ ఇవే వాహనాలు అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు చేరుస్తున్నాయి. ప్రతి లక్ష జనాభాకు ఒకటి చొప్పున ప్రస్తుతం ‘108’ వాహనం ఉండగా మండలానికి ఒకటి పెంచడం ద్వారా ప్రతి 70 వేల జనాభాకు ఒక వాహనాన్ని అందు బాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారం రాష్ట్రంలో 589 మండలాలుండగా ఆ మేరకు వాహనాల సంఖ్యను పెంచనుంది.

దేశవ్యాప్త అధ్యయనం...
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి అందుబాటులోకి తెచ్చిన ‘108’ అత్యవసర వైద్య సేవల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో అత్యవసర వైద్యం అవసరమైనవారు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు అంబులెన్స్‌ సేవలను ఉచితంగా పొందుతున్నారు. రోజుకు ఒక్కో వాహనం నాలుగు ట్రిప్పులు వెళ్లేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దారు. ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లోగా బాధితుల వద్దకు చేరుకోవా లనేది నిబంధన. 2007 నుంచి అంబులెన్స్‌ సర్వీసులను జీవీకే సంస్థ నిర్వహిస్తోంది. వాహనాల నిర్వహణ ఖర్చు, సిబ్బంది వేతనాలు కలిపి ప్రభుత్వం ఆ సంస్థకు ఏటా రూ. 86 కోట్లు చెల్లిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఇప్పటికీ ఆ సంస్థ కార్యకలాపాలు చేపడుతోంది. దాని నిర్వహణ ఒప్పందం 2016లో ముగిసినా పొడిగిస్తూ వస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మూడు నెలల క్రితం టెండర్ల ద్వారా 108 సర్వీసుల నిర్వహణ బాధ్యతను ఒక ప్రతిష్టాత్మక సంస్థకు అప్పగించాలనుకున్నా అది కుదరలేదు. అయితే ‘108’ సేవల్లో మరిన్ని విప్లవాత్మక మార్పులు చేసి కొత్త నిబంధనలతో సేవలను అందుబాటులోకి తేవాలని సర్కారు నిర్ణయించింది. అందుకోసం సేవల అమలు తీరును తెలుసుకునేందుకు ఆరోగ్యశాఖలోని రాష్ట్రస్థాయి అధికారుల బృందాలు ఢిల్లీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి వచ్చాయి. అందుకు సంబంధించి ఎటువంటి మార్పులు చేయాలన్న దానిపై నివేదిక తయారు చేసి రెండ్రోజుల కిందట ప్రభుత్వానికి సమర్పించాయి.

సీఎస్‌ఆర్‌ కింద నిర్వహణకు ముందుకొచ్చిన అరబిందో...
‘108’ సేవల కోసం ఏటా రూ. 86 కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం మూడు నెలలకోసారి నిర్వహణ సంస్థకు చెల్లించాల్సి ఉండగా ఒక్కోసారి బిల్లుల చెల్లింపులు, ఇతరత్రా సాంకేతిక కారణాలతో నిధుల విడుదల ఆలస్యమవుతోంది. దీంతో పలు సందర్భాల్లో డీజిల్‌ కొరత, ఉద్యోగులకు వేతనాల చెల్లింపు జరగక వాహన సేవల్లో అంతరాయం ఏర్పడుతోందని వైద్య బృందాలు తమ నివేదికలో ప్రస్తావించాయి. ఈ నేపథ్యంలో ‘108’ నిర్వహణ పూర్తి బాధ్యతను తమకు అప్పగిస్తే కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద రూ. 30 కోట్లు ఖర్చు చేస్తామని అరబిందో ఫార్మా వర్గాలు పేర్కొన్నాయని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఒక అధికారి వ్యాఖ్యానించారు. దీనివల్ల నిధుల కొరత ఉండదని, అంతరాయం ఏర్పడదని, సర్కారుపైనా భారం తగ్గుతుందని భావిస్తున్నారు. ఈసారి టెండర్లకు వెళ్లాలని సర్కారు భావించినా ఆ ఆలోచనను విరమించుకొని నామినేషన్‌ పద్ధతిలోనే అప్పగించాలని యోచిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం. 

వాళ్లు ముందుకొచ్చారు...
‘108’ వాహన సేవల నిర్వహణకు అరబిందో ఫార్మా ముందుకొచ్చిన విషయం వాస్తవమే. సీఎస్‌ఆర్‌ కింద రూ. 30 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. దీనివల్ల సర్కారుపై భారం ఉండదని భావిస్తున్నాం. అయితే ఇవన్నీ ప్రతిపాదనలే.. వాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
– ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement