సాక్షి, హైదరాబాద్: ప్రజలకు అత్యవసర వైద్య సేవలందించే ‘108’సేవల్లో మార్పులు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్నో ఏళ్లుగా దానిని నిర్వహిస్తున్న జీవీకే సంస్థకు చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉంది. త్వరలో టెండర్లు నిర్వహించి కొత్త ఏజెన్సీకి అప్పగించాలని భావిస్తోంది. అలాగే అత్యంత ఆధునిక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో నామినేషన్ పద్ధతిలో ఒక ప్రముఖ సంస్థకు ఇవ్వాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల టెండర్లకు వెళ్లడమే సరైనదనే నిర్ణయానికి వైద్య ఆరోగ్యశాఖ వచ్చింది. ఈ నేపథ్యంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడా పరిశీలిస్తున్న వైద్యశాఖ అధికారులు.. అందుకోసం మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో ఉన్నారు.
ఉమ్మడి ఏపీలో..వైఎస్ హయాంలో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ‘108’అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో అత్యవసరంగా వైద్యం అవసరమైన వారు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు ‘108’నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా తక్షణమే ఉచితంగా అంబులెన్స్ సేవలు పొందేలా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పట్నుంచే ‘108’గా ఈ పథకం అత్యంత ప్రజాదరణ పొందింది.
అందుబాటులో 333 వాహనాలు..
ప్రస్తుతం రాష్ట్రంలో 358 వాహనాలు ఈ అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో 333 రోడ్లపై అందుబాటులో ఉండగా, మిగిలినవి రిజర్వులో ఉంచారు. అప్పట్లో కొన్ని వాహనాలు చెడిపోగా, వాటి స్థానంలో కొన్ని వాహనాలను ‘గిఫ్ట్ ఏ స్మైల్’కింద అనేకమంది రాజకీయ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు ఉచితంగా అందించారు. ప్రస్తుతం లక్షమంది జనాభాకు ఒకటి చొప్పున ‘108’వాహనం ఉందని అంటున్నారు.రోజుకు ఒక్కో వాహనం నాలుగు ట్రిప్పులు వెళ్లేలా ఈ పథకాన్నితీర్చిదిద్దారు. ఫోన్ చేసిన దాదాపు 20 నిమిషాల్లో బాధితుల వద్దకు చేరుకోవాలనేది నిబంధన.
2007 నుంచి జీవీకే ఆధ్వర్యంలోనే..
ఈ అంబులెన్స్ సర్వీసులను ప్రస్తుతం జీవీకే సంస్థ నిర్వహిస్తుంది. ప్రభుత్వం ఒక్కో వాహనానికి రూ.1.62 లక్షల చొప్పున ఏడాదికి రూ.86 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అందులోనే ప్రాథమిక వైద్యంలో సుశిక్షితులైన సిబ్బంది వేతనాలు, నిర్వహణ ఖర్చు కలిపి ఉంటాయి. 2007 నుంచి ఆ సంస్థకే అప్పగిస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఇప్పటికీ ఆ సంస్థ కార్యకలాపాలు చేస్తోంది. వాస్తవానికి జీవీకే నిర్వహణ సమయం 2016 లోనే ముగిసిందని, కానీ అప్పటినుంచి అలా పొడిగిస్తూ వస్తున్నారని వైద్య, ఆరోగ్య వర్గాలు తెలిపాయి.
ఇక ఆటోమేటిక్‌గా పరుగులు..
ప్రస్తుతమున్న ‘108’అత్యవసర అంబులెన్సులను ఉపయోగించుకుంటూనే, నిర్వహణలో అనేక మార్పులు చేర్పులూ చేయాలని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్యంత ఆధునిక కాల్ సెంటర్‌కు రూపకల్పన చేస్తారు. దానిద్వారా కంప్యూటర్ ఆధారంగా అంబులెన్సులను ఆటోమేటిక్‌గా నడిపిస్తారు. ఆటోమేటిక్ కాల్ డిస్ట్రిబ్యూటర్ (ఏసీడీ) వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
కంప్యూటర్ టెలిఫోన్ ఇంటర్‌ఫేస్ (సీటీఐ), వాయిస్ లాగింగ్ కేపబిలిటీస్, జీపీఎస్ ఇంటిగ్రేషన్, హైలీ సెక్యూర్డ్ నెట్‌వర్క్‌లను రూపొందిస్తారు. తద్వారా అంబులెన్స్ ప్రమాదం జరిగిన స్థలాన్ని అత్యంత వేగంగా (ర్యాపిడ్) గుర్తించి, తక్కువ సమయంలో బాధితులను చేరుకుంటుంది. అలాగే బాధితుడిని తీసుకెళ్లే ఆసుపత్రికి ముందస్తు సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తారు.
విపత్తు నిర్వహణ, పోలీస్, ఫైర్ సర్వీసులకు అనుసంధానం
ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అప్లికేషన్‌ను రూపొందిస్తారు. ఈ అప్లికేషన్‌ను విపత్తు నిర్వహణకు అనుసంధానం చేస్తారు. ఇది పోలీస్, ఫైర్ సర్వీసులతోనూ అనుసంధానం అవుతుంది. అన్ని ‘108’అంబులెన్స్‌లకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. అత్యంత సమర్థులైన, శిక్షణ పొందిన సిబ్బందిని నియమిస్తారు. ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఎన్‌జీవోలతోనూ అనుసంధానం చేయనున్నారు.
ప్రభుత్వ డబ్బు..పేరు ఏజెన్సీది!
భవిష్యత్తులో అన్ని గ్రామాల్లో ఫస్ట్ రెస్పాండర్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తారు. అన్ని కార్పొరేట్ కంపెనీల్లోనూ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. శాటిలైట్ ట్రామా సెంటర్లను రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారుల్లో ఏర్పాటు చేసేలా టెండర్లలో అనేక నిబంధనలు విధిస్తారు. ఆ ప్రకారం ముందుకు వచ్చే ఏజెన్సీ సంస్థనే ఎంపిక చేస్తారు. ముఖ్యంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సామాజిక బాధ్యత) (సీఎస్‌ఆర్) కింద సంస్థే కొంత భరించేలా నిబంధన విధించే అవకాశముంది. అవసరమైతే రివర్స్ టెండరింగ్ పద్ధతిని అనుసరించడంపై కూడా సర్కారు ఆలోచన చేస్తోంది.
ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే సంస్థలు తమ పేరును ప్రచారం చేసుకుంటున్నాయన్న భావన ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఏజెన్సీ కనీసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయడం లేదని వైద్యశాఖ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డబ్బు ఖర్చు చేయకుండా.. సామాజిక బాధ్యత కింద ముందుకు వచ్చే సంస్థలను రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఒక ప్రముఖ కంపెనీ ఈ మేరకు నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం.
మండలానికో ’108’వాహనం
ప్రతి మండలానికి ఒక ‘108’వాహనాన్ని సమకూర్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. తద్వారా దాని పరిధిలోని సమీప గ్రామాలకు తక్కువ సమయంలో చేరుకోవడానికి వీలు కలుగుతుందని, ప్రాణాపాయం నుంచి అనేకమందిని రక్షించ వచ్చని భావిస్తోంది. ప్రస్తుతం లక్ష మంది జనాభాకు ఒకటి చొప్పున ‘108’వాహనం ఉండగా, మండలానికి ఒకటి ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి 70 వేల జనాభాకు ఒకటి చొప్పున ఉండేలా చూడాలని అనుకుంటున్నారు.
వేతనాల పెంపుపై అధ్యయనం
సిబ్బంది వేతనాలను పెంచాలనే కీలక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వేతనాలు పెంచారు. అక్కడ ఎంత పెంచారన్న దానిపై అధికారులు అధ్యయనం చేశారు. ఆ ప్రకారం పెంచడం, ఐదేళ్లకోసారి సవరించడం వంటి అంశాలపైనా ఆలోచన చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని వేతనాలను, ఇతర సేవలనూ అధ్యయనం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment