వైద్యారోగ్య శాఖలో కమీషన్ల దందా!
* పరికరాల కొనుగోలులో భారీగా అక్రమాలు
* ముడుపులిచ్చిన కంపెనీలకే కట్టబెట్టేందుకు యత్నం
* వాటికి అనుకూలంగా నిబంధనల్లో మార్పులు..
* 10 నుంచి 15 శాతం కమీషన్లు అడిగారని ఓ కంపెనీ ప్రతినిధి వెల్లడి
* బాగోతం వెనుక వైద్యారోగ్య శాఖను పర్యవేక్షించే ప్రముఖుడు
* గాంధీ ఆస్పత్రిలో హృద్రోగ నిపుణుడి ఆధ్వర్యంలో వ్యవహారం
* ఆ నిపుణుడిని మంత్రికి పరిచయం చేసింది తానేనన్న డీఎంఈ
* ప్రస్తుతం ముఖ్య కార్యదర్శి చేతికి టెండర్ల వ్యవహారం
* 24వ తేదీనే టెండర్ల గడువు ముగిసినా 5వ తేదీ వరకూ పొడిగింపు
* వ్యవహారంపై స్పందించని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు రూ. 208 కోట్లతో వైద్య పరికరాల కొనుగోళ్లకు సంబంధించి భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎంఎస్‌ఐడీసీ) పర్యవేక్షించాల్సిన ఈ వ్యవహారం చివరకు గాంధీ ఆస్పత్రిలో రహస్యంగా జరిగిన తీరు అధికారవర్గాల్లో కలకలం రేపుతోంది. సుమారు 22 విభాగాలకు సంబంధించిన పరికరాల కొనుగోలు వ్యవహారం కేవలం ఒక హృద్రోగ నిపుణుడు చెప్పినట్టు జరిగింది. వైద్య నిపుణుల కమిటీ లేదు.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు.. వైద్యారోగ్య శాఖను పర్యవేక్షించే ప్రముఖుడు కోరిన మొత్తాన్ని ముట్టజెప్పేందుకు ముందుకు వచ్చిన ఐదు కంపెనీలకు ఈ కాంట్రాక్టు అప్పగించడమే దీని వెనుక ప్రధాన ఉద్దేశమనే ఆరోపణలు వస్తున్నాయి.
ఐదు కంపెనీల చుట్టూనే నిబంధనలు..
మొత్తం రూ. 208 కోట్లకు గాను తొలిదశలో రూ. 60 కోట్లతో పరికరాల కొనుగోళ్లకు టెండర్లు పిలిచారు. తొలుత టెండర్‌లో ఉన్న నిబంధనలు... ప్రీ బిడ్ మీటింగ్, సాంకేతిక్ కమిటీ బిడ్‌కు వచ్చే సరికి మారిపోయాయి. యాభై కంపెనీలు ఈ టెండర్లలో పాల్గొంటే ఐదు కంపెనీల చుట్టే వ్యవహారం నడిచింది. వాస్క్యులర్ సర్జరీ, కిడ్నీ మార్పిడి పరికరాలు, ఎండోస్కొపీ, బ్రాంకోస్కొప్ సెట్ లు, హోలిమియం లేజర్ సర్జికల్, అడల్ట్ నెఫ్రొస్కొప్ సెట్‌లు, అడల్ట్ యురెట్రోనోస్కొప్, స్కైటోస్కొప్ సెట్‌లు, పీడియాట్రిక్ సైటోస్కో ప్ సెట్‌లు, హెపటిక్ సర్జరీ, యూరో సర్జరీ వర్క్‌స్టేషన్‌లు, ఆపరేషన్ థియేటర్ టేబుళ్లు తదితర ముప్ఫైకి పైగా ఖరీదైన పరికరాల కొనుగోళ్లను ఈ కంపెనీలకే కట్టబెట్టే విధంగా నిబంధనల్లో మార్పులు చేశారు.
కీలక సూత్రధారులు ముగ్గురు..!
ఈ పరికరాల కొనుగోలు కుంభకోణంలో వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ముగ్గురు కీలక సూత్రధారులని వినవస్తోంది. వీరిలో వైద్యవిద్యా విభాగానికి చెందిన ఒక అధికారి, రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థలో సీనియర్ అధికారి, గాంధీ ఆస్పత్రికి చెందిన హృద్రోగ నిపుణుడు ఉన్నారు. ఈ తతంగాన్ని తెరవెనుక నుంచి ఆ శాఖ ప్రముఖుడికి చెందిన వ్యక్తి నడిపారు. ఏపీఎంఎస్‌ఐడీసీలోని బయో మెడికల్ ఇంజనీర్లను గాంధీ ఆస్పత్రికి పిలిపించుకుని ఏ కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వా లో నిర్ణయించారు. దీనికి అంగీకరించని ఓ బ యో మెడికల్ ఇంజనీర్ దీనిపై ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌కు లేఖ రాశారు.
అభ్యంతరాలు పట్టించుకోలేదు..
పరికరాల టెండర్లపై వారం రోజుల కింద ప్రీబిడ్, టెక్నికల్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో గాంధీ ఆస్పత్రి వైద్యుడు పర్యవేక్షణాధికారి. ఆయన తనకున్న పలుకుబడితో కొన్ని కంపెనీలకు అనుకూలంగా నిబంధనలు మార్చారు. కొందరు అధికారులు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. సాధారణంగా అయితే ప్రతి ఆస్పత్రి నుంచి ఆయా పరికరాలు అవసరమైన విభాగం హెడ్‌లు వచ్చి దీనిపై చర్చించాలి. కానీ గాంధీ ఆస్పత్రికి చెందిన ఆ హృద్రోగ నిపుణుడే... న్యూరో, జనరల్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ వంటి విభాగాలకు అవసరమైన పరికరాలనూ ఆమోదించేశారు. ఈ జాబితాపై వైద్యవిద్యా డెరైక్టర్ పుట్టా శ్రీనివాస్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎగ్జిక్యూటివ్‌డెరైక్టర్ రాజేందర్ సంతకాలు చేశారు.
ముఖ్య కార్యదర్శి వద్ద ఫైలు..
ఈ వైద్య పరికరాల కొనుగోలు వ్యవహారం ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా చేతిలో ఉంది. వాస్తవానికి టెండర్ తుది గడువు ఈ నెల 24తోనే ముగిసింది. కానీ శనివారం ముఖ్య కార్యదర్శి గడువును వచ్చే నెల 5వ తేదీ వరకూ పొడిగించారు. అయితే పరికరాల కొనుగోలుకు సంబంధించి అవకతవకలపై ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదులు వెళ్లాయి. చాలా మంది కంపెనీల ప్రతినిధులు ఈ బాగోతాన్ని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
మంత్రికి పరిచయం చేసింది నేనే: వైద్యవిద్యా డెరైక్టర్ పుట్టా శ్రీనివాస్
పరికరాల కుంభకోణంలో కీలక పాత్రధారిగా చెప్పుకుంటున్న గాంధీ వైద్యుడిని ఓ సందర్భంలో మంత్రి రాజయ్యకు పరిచయం చేసింది తానేనని వైద్యవిద్యా డెరైక్టర్ డా.పుట్టా శ్రీనివాస్ తెలిపారు. మంత్రి అనుమతి ఇచ్చాకే ఆయనను పర్యవేక్షణాధికారిగా నియమించుకున్నామని చెప్పారు. అయితే ఆయన అక్రమాలకు పాల్పడింది తనకు తెలియదని పేర్కొన్నారు.
తాను కంపెనీల జాబితా మీద సంతకం చేసింది వాస్తవమేనని... కొన్ని కంపెనీలకు అనుకూలంగా నిబంధనలు మార్చిన విషయం తనకు తెలియదని వివరించారు. ఒక్క స్పెషాలిటీ వైద్యుడిని కూడా పిలవకుండా ఎలా సంతకాలు పెట్టారని ప్రశ్నించగా... త్వరలోనే హెచ్‌వోడీలను పిలిచి పరిశీలిస్తామని చెప్పారు. ఇప్పటికే ముఖ్య కార్యదర్శికి టెండర్ల వ్యవహారంపై మెయిల్ ద్వారా వివరణ ఇచ్చినట్టు శ్రీనివాస్ తెలిపారు. కాగా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలపై ఏపీఎంఎస్‌ఐడీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజేందర్ అందుబాటులోకి రాలేదు. పదే పదే ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు.
రహస్యంగా ఒప్పందం..
పరికరాల కొనుగోలుకు సంబంధించి ప్రీ బిడ్ భేటీకి ముందురోజే ఆయా కంపెనీల ప్రతినిధులతో అధికారులు రహస్యంగా సమావేశం నిర్వహించారని అందులో పాల్గొన్న ఓ కంపెనీ ప్రతినిధి సాక్షికి తెలిపారు. సమావేశంలో పాల్గొన్న గాంధీ వైద్యులు తమను 10 నుంచి 15 శాతం కమీషన్లు అడిగారని... కొందరం ఇవ్వలేమని చెప్పామని వెల్లడించారు. దీంతో తెల్లారేసరికి తమ కంపెనీలకు సంబంధించిన ‘స్పెసిఫికేషన్స్ (ప్రత్యేకతలు)’ నిబంధనల నుంచి మాయమయ్యాయని ఆయన చెప్పారు. కమీషన్లు ఇచ్చేందుకు ఒప్పుకొన్న కంపెనీలకు సంబంధించిన ప్రత్యేకతలన్నింటినీ ఆమోదించినట్టు పేర్కొన్నారు.
ఆ ఐదు కంపెనీలు, పరికరాలు...
కంపెనీ | ఏ పరికరాలకు |
కార్ట్‌స్ట్రొజ్ | ల్యాప్రొస్కోపిక్ పరికరాలు |
బెట్‌షొల్డ్ | ఆపరేషన్ థియేటర్ లైట్లు |
బి బ్రాన్ | ఓటీ ల్యాప్రొస్కోపిక్ పరికరాలు |
స్ట్రైకర్ | ఆపరేషన్ టేబుళ్లు |
సోరింగ్ | లివర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌పరికరాలు |