
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 108 అంబులెన్స్‌ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టినట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 439 అంబులెన్స్‌లు మాత్రమే ఉన్నాయని.. వీటి సంఖ్యను 710కి పెంచుతామని తెలిపారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా 108, 104 వాహనాలకు సంబంధించి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన 108, 104 వాహనాలు గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘పేద ప్రజల ఆరోగ్యంపై దివంగత నేత వైఎస్సార్ కనబరిచిన నిబద్ధతను ఇతర ప్రభుత్వాలు గుర్తించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. గత ఐదు ఏళ్లుగా టీడీపీ ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడం వల్ల 108, 104 పథకాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. ఈ పథకాలు మళ్లీ పేద ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. వీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. ఈ బడ్జెట్‌లో 104కు రూ.179.76 కోట్లు, 108కు రూ.143.38 కోట్లు కేటాయించారు. అంతకుముందు లేని మరిన్ని కొత్త సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. కన్ను, చెవికి సంబంధించిన సేవలు అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. 104 వాహనాల్లో మందుల కొరత లేకుండా చూస్తాం. 108 వాహనాలు సమయ పాలన ఉండేలా కృషి చేస్తామ’ని తెలిపారు.
అంతకు ముందు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి .. మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్‌లు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. గత ప్రభుత్వ హయంలో అవి పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. పేషెంట్‌లను దగ్గర్లోని నెట్‌వర్క్ ఆస్పత్రులకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని కోరారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. 108లో సిబ్బంది సంఖ్యను పెంచాలని, సౌకర్యాలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment