
వాహనంలో పనిచేయని ఆక్సిజన్ రెగ్యులేటర్
పిఠాపురం : 108 వాహనాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా మరో నిండు ప్రాణం బలైపోయింది. వాహనంలో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
బాధిత కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం..
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణం ఇందిరా కాలనీకి చెందిన కూరపాటి చిన గంగరాజుకు భార్య చింతాలమ్మ, ఇద్దరు కుమారులున్నారు. ఆయన కొంతకాలం కిందట అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకున్నాక వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున గంగరాజు ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఇది గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగుపడడంతో ఇంటికి తీసుకువచ్చారు. ఇంతలో శుక్రవారం ఉదయం మళ్లీ అదే పరిస్థితి ఎదురవగా ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది.
108లో అయితే ఆక్సిజన్ ఉంటుందని భావించి ఫోన్ చేశారు. అది రాగానే ఆక్సిజన్‌ను వెంటనే పెట్టాలని అభ్యర్థించగా.. రెగ్యులేటర్ పనిచేయడంలేదని సిబ్బంది చెప్పారు. దీంతో ఆక్సిజన్ లేకుండానే అందులో తరలిస్తుండగా మార్గమధ్యంలో గంగరాజు మృతిచెందాడు. ఆక్సిజన్ ఉండి ఉంటే మృతిచెంది ఉండేవాడు కాదని బంధువులు రోదిస్తూ చెప్పారు. కాగా, గత కొన్ని రోజులుగా ఆక్సిజన్ ఉపయోగించే రెగ్యులేటర్ పనిచేయడంలేదని, మరమ్మతుల కోసం పై అధికారులకు సమాచారం ఇచ్చామని 108 సిబ్బంది వివరించారు. మరమ్మతులు కాకపోవడంవల్లే ఆక్సిజన్ అందించలేక పోయామన్నారు.