patient died
-
ఎంబీబీఎస్ పూర్తి చేయని వైద్యుడితో చికిత్స.. హార్ట్ పేషెంట్ మృతి
కేరళలో విషాదం నెలకొంది. వైద్యుడి నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఎంబీబీఎస్ రెండో ఏడాది కూడా పూర్తి చేయని ఓ వైద్యుడు.. రోగికి గుండె ఆపరేషన్ చేయడంతో అతడు మరణించాడు. ఈ దారుణం కోజికోడ్ జిల్లాలో సెప్టెంబర్ 23న జరగ్గా.. మృతుడి కుమారుడు వైద్యుడి విద్యార్హతలపై ప్రశ్నించడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది.వినోద్ కుమార్ అనే వ్యక్తి హార్ట్ పేషెంట్. కొన్ని రోజులుగా ఛాతీలో నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వైద్యం నిమిత్తం కోజికోడ్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స చేసిన కాసేపటికి ఆయన మరణించారు. అనంతరం సంబంధిత వైద్యుడు(రెసిడెంట్ మెడికల్ అధికారి) కనీసం తన వైద్యవిద్యను పూర్తి చేయలేదనే విషయం మృతుడి కుమారుడు అశ్విన్‌కు తెలిసింది. 2011లో ఎంబీబీఎస్ కోర్సులో చేరగా.. ఇప్పటికీ ఎంబీబీఎస్ రెండో ఏడాది కూడా పాస్ కాలేదని తేలింది. రెండు ప్రొఫెషనల్ ఎంబీబీఎస్ పరీక్షలను క్లియర్ చేయలేకపోయాడని తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వైద్యుడిగా అర్హత లేని వ్యక్తిని వైద్యుడిగా ఎలా పనిచేయిస్తారని ప్రశ్నించారు. తన తండ్రి చావుకు వైద్యుడే కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రెసిడెంట్ మెడికల్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారుఅయితే ఆర్ఎంఓ వైద్యుడి అర్హతలను ధృవీకరించడంలో విఫలమైన ఆసుపత్రి యజమా న్యం.. అతడిని వెనకేసుకొని రావడం గమనార్హం. డాక్టర్‌ను అబూ అబ్రహం లూక్గా గుర్తించారు. వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించారు. లూక్‌ని నియమించి ముందు అతని మెడికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను తనిఖీ చేసినట్లు ఆసుపత్రి మేనేజర్ పేర్కొన్నారు. తమతో పనిచేసే ముందు కోజికోడ్, మలప్పురంలోని చాలా ఆసుపత్రులలో పనిచేశాడని తెలిపారు.గతంలో తమ కంటే పెద్ద ఆసుపత్రులలో పనిచేయడంతో అపాయింట్మెంట్తో ముందుకు సాగినట్లు చెప్పారు. అతను నిజంగా మంచి వైద్యుడని, ఆయను అందుబాటులో లేకుంటే రోగులు వారి అపాయింట్మెంట్లను రద్దు చేసేవారని తెలిపారు. రోగులతో బాగా ప్రవర్తించేవాడని, ాలా గౌరవించేవాడని తెలిపారు. -
ఎంజీఎంలో విద్యుత్ అంతరాయం.. పేషెంట్ మృతి
హన్మకొండ: వరంగల్ ఎంజీఎం అస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ అంతరాయంతో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ అంతరాయంతో వెంటిలేటర్ పనిచేయక బొజ్జ బిక్షపతి (45) అనే పేషెంట్ మృతి చెందాడు. నర్సంపేట మండలం రాజేశ్వరపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి ఆర్ఐసీలో చికిత్స పొందుతున్నాడు. ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అయితే నిన్న (శుక్రవారం) విద్యుత్ అంతరాయంతో ఆయనకు అమర్చిన వెంటిలేటర్ కాసేపటి వరకు పనిచేసి ఆగిపోయింది. అదే సమయంలో ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్పందించి జనరేటర్ ఆన్ చేశారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ జనరేటర్ పని చేయకపోవటంతో ఒక్కసారి వెంటిలేటర్ ఆఫ్ అయి రోగి బిక్షపతి మృతి చెందాడు. చదవండి: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం -
‘అంబులెన్స్‌లో డీజిల్ లేదు...రూ. 800 ఇస్తేనే తీసుకెళ్తా’.. రోగి మృతి
సాక్షి, నిజామాబాద్: మెరుగైన చికిత్స కోసం ఓ రోగిని బాన్సువాడ నుంచి నిజామాబాద్‌కు తరలించారు. అయితే డీజిల్‌కు డబ్బులు ఇవ్వలేదని అంబులెన్స్ డ్రైవర్ రోగిని తీసుకెళ్లలేదు. దీంతో పరిస్థితి విషమించి ఆ రోగి మృతి చెందిన ఘటన బాన్సువాడ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన సాయిలు (40) వాంతులు, విరోచనాలతో మూడురోజుల క్రితం బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చేరాడు. సోమవారం తెల్లవారుజామున సాయిలుకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. విధుల్లో ఉన్న వైద్యుడు పరిస్థితి గమనించి నిజామాబాద్ ఆస్పత్రికి తరలించాలని సాయిలు కుమారుడికి సూచించారు. వైద్య సిబ్బంది ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్‌కు ఫోన్ చేసి పిలిపించారు. అయితే డ్రైవర్ అంబులెన్స్‌లో డీజిల్ లేదని...రూ.800 ఇవ్వాలని సాయిలు కుమారుడికి చెప్పాడు. తన వద్ద రూ.50 ఉన్నాయని, ఎలాగైనా తన తండ్రిని నిజామాబాద్‌కు తీసుకెళ్లాలని అంబులెన్స్ డ్రైవర్‌ను ప్రాధేయపడ్డాడు. డబ్బులు ఇస్తేనే తీసుకెళ్తానని చెప్పి అంబులెన్స్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోగా, కొద్దిసేపటి తర్వాత సాయిలు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. సాయిలు మృతికి కారణమైన వైద్య సిబ్బందిపై, అంబులెన్స్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి వచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు. రాస్తారోకోలో కొత్తకొండ భాస్కర్, కాసుల బాల్‌రాజ్, గుడుగుట్ల శ్రీనివాస్, ఖలేక్, హన్మాండ్లు, మంత్రి గణేశ్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: లవ్ ఫెయిల్యూర్.. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే -
కామినేని ఆస్పత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మృతిచెందిన వ్యకికి చికిత్సను అందించి ఠాగూర్ సినిమాలోని సీన్‌ను తలపించేలా ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్ వ్యవహరించిందని మృతుని కుటుంబసభ్యులు గురువారం రాత్రి హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన మునుగెల శివకృష్ణ(35) సూర్యాపేటలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో లోన్ రికవరీగా ఉద్యోగం చేస్తూ భార్య ఉమా పిల్లలు అక్షత, కన్నయ్యలతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. శివకృష్ణకు గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు సూర్యాపేట నుంచి నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషయమంగా ఉందని ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్‌కు తరలించాలని సూచించారు. వెంటనే అదేరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో శివకృష్ణను ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్‌కు తీసుకొచ్చారు. పరీక్షించిన ఎల్బీనగర్ కామినేని వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు. గుండె నాళాలు మూసుకుపోయాయని మూడు స్టట్స్ వేయాలని వైద్యులు చేప్పడంతో వేయమని చెప్పామన్నారు. శివకృష్ణకు ఇన్సూరెన్స్ కార్డు ఉన్నా ఇంకా అప్రూవల్ రాలేదని డబ్బులు చెల్లించాలని పేర్కొనడంతో డబ్బులు చెల్లించారు. రోగి పరిస్థితి విషమంగా ఉందని కిడ్నీలు చెడిపోయాయని, డయాలసిస్ చేస్తున్నామని వైద్యులు తెలిపారన్నారు. డబ్బులు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు ఒత్తిడి చేయడంతో రూ. 7లక్షలు చెల్లించామని ఇంకా డబ్బులు చెల్లించలేమని, రోగిని నిమ్స్‌కు తీసుకెళ్లామని బంధువుల పేర్కొనగా... రెండు రోజులుగా రోగిని బంధువులకు చూపించకుండా, రోగి పరిస్థితి కుటుంబసభ్యులకు తెలుపకుండా గుట్టుగా ఉంచారని ఆరోపించారు. గురువారం ఉదయం నుంచి రోగి బంధువులు, కుటుంబ సభ్యులు షిఫ్ట్ చేస్తామని మరింత ఒత్తిడి చేశారు. రాత్రి సమయంలో రోగి బంధువులు, కుటుంబ సభ్యులకు తెలుపకుండా దొంగచాటుగా రోగిని అంబులెన్స్‌లో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా బంధువులు, కుటుంబ సభ్యులు గమనించి అడ్డుకుని ఆస్పత్రి వర్గాలను నిలదీశారు. అంతేకాకుండా ఆస్పత్రి ఎదుట ఆస్పత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. మృతి చెందిన వ్యక్తికి వెంటిలేటర్ ఏర్పాటు చేసి చికిత్సను అందించారని కేవలం ఇన్సూరెన్స్‌ను క్లయిమ్ చేసుకునేందుకు మృతిచెందిన వ్యక్తికి చికిత్సను అందించారని ఆరోపణలు చేస్తూ ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. కామినేని హాస్పిటల్స్ సూపరింటెండెంట్ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో రాలేదు. -
వాళ్లు నాకు ఎప్పటికీ ఫోన్ చేయరు: సోనూసూద్ భావోద్వేగం
కరోనా కష్టకాలంలో నేనున్నానంటూ వేలాది మందికి తన వంతు సాయమందిస్తూ రియల్‌హీరో అయిపోయాడు సోనూసూద్. లాక్ డౌన్ కాలంలో ఎంతోమంది కార్మికులను తన సొంత ఖర్చులతో వారి సొంతిళ్లకు పంపి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఇపుడు సెకండ్ వేవ్‌తో ఇబ్బంది పడుతున్న వారిని సైతం ఆదుకుంటున్నాడు. ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ కలియుగ కర్ణుడిగా మారిపోయాడు. అయితే తాజాగా కోవిడ్ బారిన పడిన కొంతమంది కళ్లముందే ప్రాణాలు వదులుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇటీవల ఓ కోవిడ్ బాధితుడు ప్రాణాలు వదలడంతో ట్విటర్ వేదికగా సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మనం కాపాడాలని ప్రయత్నిస్తున్న వ్యక్తిని కోల్పోవడం సొంత వాళ్లను కోల్పోవడం కంటే తక్కువేం కాదు. తనను రక్షిస్తామని మాట ఇచ్చిన కుటుంబాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ రోజు నేను కొంతమందిని కోల్పోయాను. వాళ్ల కోసం నాకు రోజుకు కనీసం 10 సార్లు ఫోన్ చేసేవారు ఇక ఎప్పటికీ కాల్ చేయరు. నేను నిస్సహాయుడిగా మారిపోయాను’ అంటూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా ఇటీవల సోనూసూద్ ఏపీలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో, మరొకటి నెల్లూరులోని ఆత్మకూరు ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాడు. చదవండి: హైదరాబాద్‌వాసికి నటుడు సోనూసూద్ సాయం Losing a patient u have been trying to save, is nothing less than losing your own. It is so hard to face the family whose loved one u had promised to save. Today I lost a few. The families u were in touch with atleast 10 times a day will lose touch forever. Feel helpless.💔 — sonu sood (@SonuSood) May 23, 2021 -
మలక్‌పేట యశోదలో కరోనా రోగి బలవన్మరణం
సాక్షి, హైదరాబాద్ : మలక్ పెట్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి సోమవారం రాత్రి బలవన్మరణం చెందారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి(60) కరోనా పాజిటివ్ రావడంతో ఈ నెల 6వ తేదీన మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చేరారు. సోమవారం రాత్రి చికిత్స పొందుతున్న గదిలోని వాష్‌రూమ్‌కు వెళ్లి ఉరి వేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆసుపత్రి సిబ్బంది గమనించి చాదర్ ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా చనిపోయిన వ్యక్తిని రవీందర్ రాజుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
తమిళనాడులో తొలి కరోనా మరణం
చెన్నై : దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో తమిళనాడులో బుధవారం తొలి కరోనా మరణం చేటు చేసుకుంది. మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌తో బాధపడుత్ను 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రి సీ విజయ్‌భాస్కర్ తెలిపారు. ఆ వ్యక్తి రక్తపోటుతో పాటు మధుమేహంతో బాధపడుతున్నట్లు ఆయన చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నమరో ముగ్గురిని గుర్తించి, ఐసోలేషన్‌లో ఉంచామని ఆయన వెల్లడించారు. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 11కు చేరింది. కాగా, ఇప్పటివరకు దేశంలో 519 కరోనా పాజటివ్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది. (భారత్ @ 519) -
డబ్బులు చేతిలో పడ్డాక చావు కబురు చెప్పిన వైద్యురాలు
సాక్షి, సూర్యాపేట: వైద్యుడు దేవుడితో సమానమంటారు.. కానీ కొందరు వైద్యులు డబ్బులకు కక్కుర్తిపడి వృత్తికే కలంకం తీసుకువస్తున్నారు.. చనిపోయిన విషయం చెప్పకుండా.. ట్రీట్మెంట్ చేస్తున్నట్టు తీసిన ఓ తెలుగు సినిమాలోని సీన్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం పునరావృతమైంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..జనగాం జిల్లా కొడకండ్ల మండలం హక్యతండాకు చెందిన గుగులోతు సరిత(28)కు పురిటి నొప్పులు రావడంతో డెలివరీ కోసం శనివారం తెల్లవారుజామున 3 గంటలకు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద గల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం 12 గంటల సమయంలో వైద్యులు ఆపరేషన్ చేయడంతో సరిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వైద్య సిబ్బంది ఆపరేన్ గది నుంచి శిశువును బయటికి తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా సరితను బయటికి తీసుకరాకపోవడంతో వైద్యులను, ఆసుపత్రి యాజమాన్యాన్ని బంధువులు నిలదీశారు. వైద్యులు మాత్రం ఎవరికేం కాలేదంటూ గంటల తరబడి మృతి చెందిన సరితను చూపకుండా ఠాగూర్ మూవి సీన్‌ను తలపించే విధంగా వ్యవహరించారు. మొత్తం డబ్బులు కడితేనే సరితను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు ఆ మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాత సరిత మృతిచెందిందని చెప్పడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆపరేషన్ వికటించే చనిపోయిన సరితను ఆపరేషన్ థియేటర్లో ఉంచి డబ్బులు చెల్లించాక మృతి చెం దిందని చెప్పడమేం టని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనను సద్దు మణిగింపచేశారు. అయితే ఇదే ఆస్పత్రిలో ఇటీవల బాలింతల మృతిచెందుతుండడంతో గర్భిణుల్లో ఆందోళన నెలకొంది. గతంలో కూడా ఆసుపత్రిలో వైద్యురాలి అందుబాటులో లేకున్నా అడ్మిట్ చేయించుకొని గర్భిణి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈవిషయమై ఆస్పత్రి వైద్యులను వివరణ కోరడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
108లో ఆక్సిజన్ లేక రోగి మృతి
పిఠాపురం : 108 వాహనాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా మరో నిండు ప్రాణం బలైపోయింది. వాహనంలో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణం ఇందిరా కాలనీకి చెందిన కూరపాటి చిన గంగరాజుకు భార్య చింతాలమ్మ, ఇద్దరు కుమారులున్నారు. ఆయన కొంతకాలం కిందట అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకున్నాక వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున గంగరాజు ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఇది గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగుపడడంతో ఇంటికి తీసుకువచ్చారు. ఇంతలో శుక్రవారం ఉదయం మళ్లీ అదే పరిస్థితి ఎదురవగా ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. 108లో అయితే ఆక్సిజన్ ఉంటుందని భావించి ఫోన్ చేశారు. అది రాగానే ఆక్సిజన్‌ను వెంటనే పెట్టాలని అభ్యర్థించగా.. రెగ్యులేటర్ పనిచేయడంలేదని సిబ్బంది చెప్పారు. దీంతో ఆక్సిజన్ లేకుండానే అందులో తరలిస్తుండగా మార్గమధ్యంలో గంగరాజు మృతిచెందాడు. ఆక్సిజన్ ఉండి ఉంటే మృతిచెంది ఉండేవాడు కాదని బంధువులు రోదిస్తూ చెప్పారు. కాగా, గత కొన్ని రోజులుగా ఆక్సిజన్ ఉపయోగించే రెగ్యులేటర్ పనిచేయడంలేదని, మరమ్మతుల కోసం పై అధికారులకు సమాచారం ఇచ్చామని 108 సిబ్బంది వివరించారు. మరమ్మతులు కాకపోవడంవల్లే ఆక్సిజన్ అందించలేక పోయామన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణీ మృతి!
సాక్షి, హైదరాబాద్ : వైద్యుల నిర్లక్ష్యంతోనే మూడు నెలల గర్భిణీ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నగరంలోని చైతన్యపురిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. హీమోగ్లోబిన్ తక్కువగా ఉందని ఆస్పత్రి వైద్యులు చెప్పారని, అంతలోనే హడావిడిగా బయటకు పంపేశారని కుటుంబ సభ్యులు వాపోయారు. హాస్పిటల్ వైద్యులపై, నిర్వాహాకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. అయితే.. గతకొన్నేళ్లుగా గుండెకు సంబంధించిన సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీని కారణంగానే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. వైద్య పరంగా తమ నుంచి ఎలాంటి తప్పిదం లేదని, తాము నాణ్యమైన వైద్య చికిత్స అందించామని , కార్డియాక్ సమస్యతోటే హఠాన్మరణం పొందారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. -
‘ఆస్పత్రిపై దాడి చేసిన వారిని త్వరలోనే అరెస్టు చేస్తాం’
సాక్షి, హైదరాబాద్ : ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతిచెందడంతో ఆమె తరుపు బంధువులు విధ్వంసం సృష్టించిన ఘటన సోమవారం రాత్రి గ్లెనిగల్ గ్లోబల్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. అడ్డువచ్చిన స్టాఫ్‌ను, సెక్యూరిటీని చితకబాదారు. దీనిపై సెంట్రల్‌జోన్ డీసీపీ విశ్వప్రసాద్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న రోగి బంధువులు హాస్పిటల్లో విధ్వంసం సృష్టించిన ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. సంతోష్ నగర్‌కు చెందిన షమీనా బేగం స్వైన్ ఫ్లూ, ఊపిరితిత్తుల వ్యాధితో మృతిచెందినట్లు హాస్పిటల్ రికార్డులో ఉందని విశ్వప్రసాద్ తెలిపారు. సిబ్బంధిపై దాడి చేసి, ఫర్నీచర్‌ను కూడా ధ్వంసం చేశారని హాస్పిటల్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. దాడిచేసిన ముగ్గురు అన్నదమ్ములను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ధ్వంసం చేసిన ఆస్పత్రి ఆస్తులను రికవరీ చేసేలా కేసులు పెట్టామని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీస్‌సిబ్బంధిపై కూడా దాడి చేశారని, వాటిపైనా కేసులు పెట్టామన్నారు. వాళ్లు పారిపోకుండా దృష్టి పెట్టామని, దీనిపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదన్నారు. -
ఆపరేషన్ వికటించి రోగి మృతి
మదనపల్లె క్రైం: ఆపరేషన్ వికటించి రోగి మృతిచెందిన సంఘటన మదనపల్లె ఆర్టీసి బస్టాండు దగ్గరున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం జరిగింది. దీంతో బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. బాధితుల కథనం మేరకు.. సోమల మండలం నెల్లిమందకు చెందిన రైతు నారాయణ(56) తీవ్ర జ్వరంతో వారం రోజుల క్రితం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. గురువారం రాత్రి స్కానింగ్ చేసిన డాక్టర్ కడుపులో ప్రేవులు పుండు కావడంతోనే జ్వరం వస్తోందని తెలిపారు. ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. నారాయణకు శుక్రవారం ఉదయం డాక్టర్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ వికటించి రోగి చనిపోయాడు. ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని అత్యవసర విభాగంలోకి తరలించి విషయాన్ని బంధువులకు తెలియజేశారు. డాక్టరు ఆపరేషన్ చేయడం వల్లనే బాగున్న నారాయణ చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతుని బంధువులు, డాక్టర్‌తో మాట్లాడారు. బాధితులకు పరిహారం ఇప్పించడంతో వివాదం సద్దుమణిగింది. బాధితులు ఫిర్యాదుచేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు. -
రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో అమ్మాజీ అనే రోగి మృతి
-
నర్సు నిర్లక్ష్యం.. మహిళ మృతి
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో నర్సు నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందింది. అమ్మాజి అనే పేషెంట్‌కు ఐవీ క్యాండిల్ పెట్టకుండా నర్సు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆమె చనిపోయింది. ఆమె మరణానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణామని బంధువులు ఆందోళనకు దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి బాధిత కుటుంబానికి మద్దతు పలికారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వైద్యం అందక రోగి మృతి
హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 17 రోజు ల పాటు మృత్యువుతో పోరాడి మరణించిన ఘటన శనివారం ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. నగరంలోని కార్వాన్కు చెందిన కోరని బాగ్యలక్ష్మి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. భర్త చి న్నా ఆమెను లంగర్‌హౌజ్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు. దీం తో ఆమెను ఈ నెల 3న ఉస్మానియాకు తరలించగా, 5న అడ్మిట్ చేసుకున్నారు. బాగ్యలక్ష్మిని పరీక్షించిన వైద్యులు ‘బలహీనంగా ఉంది. అడ్మిట్ వద్దు. సమయానికి తినిపించండి. బాగవుతుంది. మందు బిళ్లలు వేయడం మరవద్దు’అని చెప్పి పంపించారు. -
కామినేని హాస్పిటల్ ఎదుట ఆందోళన
హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగి మృతి చెందాడని ఆరోపిస్తూ.. రోగి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో బుధువారం వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లెముర్ గ్రామానికి చెందిన బీరప్ప(35) అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రిలో చేరాడు. కాగా.. ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మృతిచెందాడంటూ.. అతని కుటుంబసభ్యులు, బంధవులు ఆందోళన చేస్తున్నారు. -
ఎర్రగడ్డ టీబీ ఆస్పత్రిలో దారుణం
హైదరాబాద్: ఎర్రగడ్డలోని టీబీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆక్సిజన్ అందక అల్వాల్‌కు చెందిన కృష్ణ అనే రోగి మృతిచెందాడు. కాగా, ఆక్సిజన్ పెట్టాలంటే రూ.150, మందులు ఇవ్వాలంటే రూ.300 లంచం.. ఇలా చికిత్స కోసం వచ్చిన రోగుల వద్ద డబ్బుల కోసం వార్డు బాయ్ వేధిస్తున్నాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇందువల్లనే సరైన చికిత్స అందక కృష్ణ మృతి చెందాడంటూ అతని బంధువులు మృతదేహంతో ఆస్పత్రిలో ధర్నా చేస్తున్నారు. -
రోగి శవం తగులబెట్టిన వైద్యుడు
వెంబడించి పట్టుకున్న పోలీసులు పెయిన్‌కిల్లర్ వికటించడంతో రోగి మృతి హైదరాబాద్: చికిత్సకు వచ్చిన రోగికి మోతాదుకు మించి పెయిన్ కిల్లర్స్ ఇచ్చిన ఓ యునానీ వైద్యుడు అతడి చావుకు కారణమయ్యాడు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు రోగి శవాన్ని తగులబెడుతూ పోలీసుల కంట పడ్డాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివి... నగరంలోని మిస్రీగంజ్‌కి చెందిన యునానీ వైద్యుడు సల్మాన్ అలియాస్ సాజిద్(35) మదీనాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఫలక్‌నుమా నవాబ్‌షాకుంట నివాసితుడు, పాన్ షాప్ నిర్వాహకుడు నయీముద్దీన్ ఖాజా(45) నడుము నొప్పికి సాజిద్ వద్ద వారం రోజులుగా చికిత్స తీసుకుంటున్నాడు. ఇదే క్రమంలో శనివారం రాత్రి సల్మాన్ ఇచ్చిన పెయిన్ కిల్లర్ డోస్ ఎక్కువ కావడంతో ఖాజా మృతిచెందాడు. దీంతో భయభ్రాంతులకు గురైన వైద్యుడు... ఖాజా శవాన్ని మూటలో కట్టి, రాత్రి 10 గంటల సమయంలో బైక్‌పై నిర్మానుష్యంగా ఉండే సాతంరాయి గ్రామం కోదండ రామాలయం సమీపంలోకి తీసుకెళ్లాడు. శవంపై కాగితాలు, కట్టెలు వేసి తగులబెట్టాడు. అదే సమయంలో అటువైపు వచ్చిన బ్లూ కోల్ట్ పోలీసులను చూసిన సల్మాన్ పరుగులు తీశాడు. పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. బైక్ స్వాధీనం చేసుకుని, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఓమ్ని హాస్పిటల్ ముందు రోగి బంధువుల ఆందోళన
కొత్తపేట ఓమ్ని ఆస్పత్రి ముందు ఓ రోగి బంధువుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం ఎల్వర్తి గ్రామానికి చెందిన శంకరయ్య (42) అనే వ్యక్తి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరగా బుధవారం ఉదయం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడంటూ అతడి బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. బుధవారం డిశ్చార్జ్ చేస్తామని చెప్పి మంగళవారం రూ.2 లక్షలు కట్టించుకున్నారని... తీరా బుధవారం ఉదయం మృతి చెందినట్టు చెప్పారని ఆరోపించారు. కాగా, కండిషన్ సీరియస్‌గా ఉందని, ఏమీ చెప్పలేమని ముందే స్పష్టం చేశామని, అవసరమైతే వీడియో కౌన్సెలింగ్ ఆధారాలను చూపిస్తామని ఆస్పత్రి యాజమాన్యం అంటోంది. -
వైద్యుడి నిర్లక్ష్యంతో రోగి మృతి
పాల్వంచ : కడుపులో మంటగా ఉందని వైద్యుడి దగ్గరకు వెళ్లిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.... స్థానికంగా గాంధీనగర్ ప్రాంతానికి చెందిన చెరుకూరి రామారావు(40) కడుపులో మంటగా ఉండడంతో ప్రసాద్ క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడి వైద్యుడు ప్రసాద్.. రామారావుకు ఇంజెక్షన్ ఇచ్చి, మందులు రాసిచ్చారు. అయితే ఆ తర్వాత 10 నిముషాలకే రామారావు ఆస్పత్రిలోనే కుప్పకూలిపోయాడు. అతడు మృతి చెందినట్టు వైద్యుడు ధ్రువీకరించారు. కాగా వైద్యుడి నిర్లక్ష్యం వల్లే రామారావు మృతి చెందినట్టు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. -
వెంటాడిన మృత్యువు
- పాముకాటుకు గురైన మహిళ.. - ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌ను ఢీకొన్న డీసీఎం - డ్రైవర్‌తో పాటు రోగి దుర్మరణం - ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు మొయినాబాద్: మృత్యువు వెంటాడింది..పాముకాటుకు గురైన మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో అంబులెన్స్‌ను ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొంది. దీంతో డ్రైవర్‌తో పాటు మహిళ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి బస్‌స్టేజీ సమీపంలోని సిలువగుట్ట దగ్గర ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. క్షతగాత్రులు, సీఐ రవిచంద్ర కథనం ప్రకారం.. ధారూరు మండలం ధోర్నాల్ గ్రామానికి చెందిన బిస్మిల్లాబీ(25) శనివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటువేసింది. దీంతో కుటుంబీకులు వెంటనే ఆమెను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి హైదరాబాద్ తరలించాలని సూచించారు. కాగా కుటుంబీకులు ఆమెను వికారాబాద్‌లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం మధ్యాహ్నం బిస్మిల్లాబీ పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ అంబులెన్స్‌లో ఉస్మానియాకు బయలుదేరారు. మార్గంమధ్యలో హైదరాబాద్-బీజాపూర్ అంతర్రాష్ట రహదారిపై మండల పరిధిలోని కనకమామిడి బస్‌స్టేజీ సమీపంలోని సిలువగుట్ట వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న డీసీఎం అతివేగంతో అంబులెన్స్‌ను ఢీకొట్టింది. అనంతరం డీసీఎం కొంతదూరం దూసుకెళ్లి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొంది. దీంతో అంబులెన్స్ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ సోహెల్(22), పాము కాటుకు గురైన బిస్మిల్లాబీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అంబులెన్స్‌లో ఉన్న బిస్మిల్లాబీ భర్త సాదిక్, అక్క నూర్జహాన్, చెల్లెలు శభానా, అన్న మహబూబ్, ఆస్పత్రి సిబ్బంది యాదగిరి తీవ్రంగా గాయపడ్డారు. మృతురాలి బంధువు ఇర్ఫాన్పాషా స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న సీఐ రవిచంద్ర సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌లోనే ఇరుక్కుపోయిన డ్రైవర్ సోహెల్ మృతదేహాన్ని పోలీసులు అతికష్టం మీద బయటకు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే డీసీఎం డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో సాధిక్ పరిస్థితి విషమంగా ఉంది. అంబులెన్స్ డ్రైవర్ సోహెల్ వికారాబాద్ వాసి. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల హాహాకారాలు... వికారాబాద్ నుంచి బయలుదేరిన గంటలోపే అంబులెన్స్ వాహనం ప్రమాదానికి గురైంది. సంఘటనా స్థలంలో క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. మహబూబ్, నూర్జహాన్, శభానాల తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. యాదగిరి నడుము విరిగింది. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యంతోనే.. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యంతోనే రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. రోడ్డుకు ఎడమ వైపు నుంచి వెళ్లాల్సిన డీసీఎం కుడివైపు నుంచి వచ్చి ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను ఢీకొట్టినట్లు సంఘటన స్థలంలో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. డీసీఎం వాహనం వేగంగా ఉండడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. ధోర్నాల్లో విషాదఛాయలు ధారూరు: రోడ్డు ప్రమాదంలో బిస్మిల్లాబీ మృతితో మండల పరిధిలోని ధోర్నాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన జానిమియా, మౌలాన్‌బీ దంపతుల కూతురు బిస్మిల్లాబీని అదే గ్రామానికి చెందిన సయ్యద్ సాధిక్ ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. శనివారం అర్ధరాత్రి ఇంట్లో బిస్మిల్లాబీని పాముకాటు వేసింది. కుటుంబీకులు ఆమెను వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు హైదరాబాద్ తరలించాలని చెప్పినా కుటుంబీకులు స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించాక బిస్మిల్లాబీని అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోని కనకమామిడి గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొంది. ప్రమాదంలో ఆమెతో పాటు అంబులెన్స్ డ్రైవర్ కూడా మృతిచెందాడు. కుటుం బీకులు తీవ్రంగా గాయపడ్డారు. అందరితో కలుపుగోలుగా ఉండే బిస్మిల్లాబీ మృతితో ధోర్నాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఉరి వేసుకుని పేషెంట్ ఆత్మహత్య