ఆస్పత్రి వద్ద బాధితుల ఆందోళన
మదనపల్లె క్రైం: ఆపరేషన్ వికటించి రోగి మృతిచెందిన సంఘటన మదనపల్లె ఆర్టీసి బస్టాండు దగ్గరున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం జరిగింది. దీంతో బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. బాధితుల కథనం మేరకు.. సోమల మండలం నెల్లిమందకు చెందిన రైతు నారాయణ(56) తీవ్ర జ్వరంతో వారం రోజుల క్రితం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. గురువారం రాత్రి స్కానింగ్ చేసిన డాక్టర్ కడుపులో ప్రేవులు పుండు కావడంతోనే జ్వరం వస్తోందని తెలిపారు.
ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. నారాయణకు శుక్రవారం ఉదయం డాక్టర్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ వికటించి రోగి చనిపోయాడు. ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని అత్యవసర విభాగంలోకి తరలించి విషయాన్ని బంధువులకు తెలియజేశారు. డాక్టరు ఆపరేషన్ చేయడం వల్లనే బాగున్న నారాయణ చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతుని బంధువులు, డాక్టర్‌తో మాట్లాడారు. బాధితులకు పరిహారం ఇప్పించడంతో వివాదం సద్దుమణిగింది. బాధితులు ఫిర్యాదుచేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment