operation failure
-
గ్యాస్ట్రబుల్ అని వెళ్తే.. షాక్ ఇచ్చిన డాక్టర్.. ఎంత పనిచేశాడంటే?
కర్నూలు(హాస్పిటల్): తనకు గ్యాస్ట్రబుల్ ఉందని, కడుపు ఉబ్బరంగా అనిపిస్తోందని వైద్యుని వద్దకు వెళితే స్కానింగ్ చేసి అపెండిక్స్ ఉందని ఆపరేషన్ చేశాడు ఓ డాక్టర్. తీరా సదరు రోగి కోలుకోకపోగా ఆపరేషన్ వికటించి తనువు చాలించాడు. మృతుని కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నాగర్‌కర్నూలులోని కొల్లాపూర్‌కు చెందిన సుమంత్(28) బంగారు నగలు చేసే పనిలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య లావణ్య, ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నాడు. కొంత కాలంగా అతనికి కడుపు ఉబ్బరం, కడుపులో మంటగా ఉండటంతో స్థానికంగా ఉండే ఆర్ఎంపీని కలిశాడు. అతని సలహాతో కర్నూలులోని ఎన్ఆర్ పేటలో ఉన్న మెడికేర్ హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడి ఓ సర్జన్ అతన్ని పరీక్షించి స్కానింగ్ తీయించాడు. స్కానింగ్‌లో నీకు అపెండిక్స్ ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని, లేకపోతే కడుపులోనే అపెండిక్ పగిలి అపాయం కలుగుతుందని చెప్పడంతో సుమంత్ ఆపరేషన్‌కు ఒప్పుకున్నాడు. దీంతో బుధవారం అతనికి సదరు ఆసుపత్రిలోనే ఆపరేషన్ చేశారు. అయితే రాత్రి అతనికి విపరీతమైన కడుపునొప్పి, ఆయాసం రావడంతో వైద్యులు వచ్చి చికిత్స చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎంత మొత్తుకున్నా డాక్టర్లు ఎవ్వరూ రాలేదని, గురువారం ఉదయం 7 గంటలకు భర్త మృతి చెందినట్లు భార్య లావణ్య చెప్పారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సుమంత్ మృతి చెందాడని ఆరోపిస్తూ మృతదేహాన్ని ఆసుపత్రి ఎదుట ఉంచి ఆందోళన చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులతో పాటు ఆసుపత్రి యాజమాన్యాన్ని స్టేషన్‌కు తీసుకెళ్లి ఇరువర్గాలతో రాజీ చేసినట్లు సమాచారం. కాగా సదరు ఆసుపత్రికి వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి అనుమతులు ఇప్పటి వరకు లభించలేదు. తాత్కాలిక అనుమతి కూడా ఆసుపత్రికి లేదని, ఈ విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ బి. రామగిడ్డయ్య తెలిపారు. చదవండి: ప్రియుడి మైకంలో దారుణానికి ఒడిగట్టిన తల్లి.. -
ఆపరేషన్ వికటించి రోగి మృతి
మదనపల్లె క్రైం: ఆపరేషన్ వికటించి రోగి మృతిచెందిన సంఘటన మదనపల్లె ఆర్టీసి బస్టాండు దగ్గరున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం జరిగింది. దీంతో బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. బాధితుల కథనం మేరకు.. సోమల మండలం నెల్లిమందకు చెందిన రైతు నారాయణ(56) తీవ్ర జ్వరంతో వారం రోజుల క్రితం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. గురువారం రాత్రి స్కానింగ్ చేసిన డాక్టర్ కడుపులో ప్రేవులు పుండు కావడంతోనే జ్వరం వస్తోందని తెలిపారు. ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. నారాయణకు శుక్రవారం ఉదయం డాక్టర్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ వికటించి రోగి చనిపోయాడు. ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని అత్యవసర విభాగంలోకి తరలించి విషయాన్ని బంధువులకు తెలియజేశారు. డాక్టరు ఆపరేషన్ చేయడం వల్లనే బాగున్న నారాయణ చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతుని బంధువులు, డాక్టర్‌తో మాట్లాడారు. బాధితులకు పరిహారం ఇప్పించడంతో వివాదం సద్దుమణిగింది. బాధితులు ఫిర్యాదుచేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత బలి
గిద్దలూరు, న్యూస్‌లైన్ : ఆపరేషన్ వికటించి స్థానిక నల్లబండ బజారులో నివాసం ఉంటున్న మహానంది కళావతి(25) అనే బాలింత శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి చంద్రయ్య, బంధువుల కథనం ప్రకారం.. కళావతి రెండో కాన్పు కోసం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేరింది. పరీక్షించిన వైద్యులు శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. అనంతరం ఆమెను ఆపరేషన్ గది నుంచి వార్డులోకి తీసుకొచ్చారు. గంట తర్వాత కళావతికి తీవ్ర కడుపునొప్పి వచ్చి విలవిల్లాడిపోయింది. గమనించిన బంధువులు వైద్యులకు సమాచారం అందించడంతో పరీక్షించి ఏవో మందులు రాశారు. అప్పటికి పడుకున్న కళావతి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తిరిగి కడుపునొప్పంటూ బాధపడింది. పరీక్షించిన అనంతరం ఒంగోలు రిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో బంధువులు ఓ ప్రైవేటు వాహనంలో ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలోని చిన్నారికట్ల వద్ద కళావతి మృతి చెందింది. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందని మృతురాలి తండ్రి చంద్రయ్య ఆరోపించారు. వైద్యశాలలో ఆపరేషన్ చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. మృతురాలికి భర్త చంద్ర, నాలుగేళ్ల కుమారుడు, పురుటి బిడ్డ ఉన్నారు.