గిద్దలూరు, న్యూస్‌లైన్ :
ఆపరేషన్ వికటించి స్థానిక నల్లబండ బజారులో నివాసం ఉంటున్న మహానంది కళావతి(25) అనే బాలింత శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి చంద్రయ్య, బంధువుల కథనం ప్రకారం.. కళావతి రెండో కాన్పు కోసం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేరింది. పరీక్షించిన వైద్యులు శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. అనంతరం ఆమెను ఆపరేషన్ గది నుంచి వార్డులోకి తీసుకొచ్చారు. గంట తర్వాత కళావతికి తీవ్ర కడుపునొప్పి వచ్చి విలవిల్లాడిపోయింది. గమనించిన బంధువులు వైద్యులకు సమాచారం అందించడంతో పరీక్షించి ఏవో మందులు రాశారు.
అప్పటికి పడుకున్న కళావతి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తిరిగి కడుపునొప్పంటూ బాధపడింది. పరీక్షించిన అనంతరం ఒంగోలు రిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో బంధువులు ఓ ప్రైవేటు వాహనంలో ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలోని చిన్నారికట్ల వద్ద కళావతి మృతి చెందింది. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందని మృతురాలి తండ్రి చంద్రయ్య ఆరోపించారు. వైద్యశాలలో ఆపరేషన్ చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. మృతురాలికి భర్త చంద్ర, నాలుగేళ్ల కుమారుడు, పురుటి బిడ్డ ఉన్నారు.
వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత బలి
Published Mon, Dec 16 2013 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement