న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఒప్పందం కుదిరేలా మోదీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్నారని, ఇప్పుడు ఆ వివరాల్ని బహిర్గతం చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ.. ‘మొట్టమొదటిసారి రాఫెల్ యుద్ధ విమానాలపై పెట్టిన ఖర్చుల వివరాల్ని బహిర్గతం చేయనని రక్షణ మంత్రి చెబుతున్నారు.
ఈ ఒప్పందంలో కుంభకోణం జరిగిందని గుజరాత్ ఎన్నికల సమయంలోనే నేను చెప్పాను. ఒప్పందం కుదిరేలా ప్రధాని మోదీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్నారు’ అని రాహుల్ పేర్కొన్నారు. మోదీ వ్యక్తిగతంగా పారిస్‌కు వెళ్లారని, ఆ సమయంలో ఒప్పందంలో మార్పులు జరిగాయని ఆయన ఆరోపించారు. ‘దేశం మొత్తానికి ఈ విషయం తెలుసు. అయితే రక్షణ మంత్రి మాత్రం విమానాల కొనుగోలుకు చేసిన ఖర్చును దేశానికి చెప్పనంటున్నారు. అంటే ఇందులో ఏదో కుంభకోణం ఉందనే అర్థం’ అని సందేహం వ్యక్తం చేశారు.
ట్వీటర్‌లోను రాహుల్ స్పందిస్తూ.. నమ్మకస్తుడైన వ్యక్తి ద్వారా ప్రధాని మోదీయే ఈ ఒప్పందం కుదిర్చారని, ఇది ‘ది గ్రేట్ రాఫెల్ డీల్’ అని పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తి పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. రాఫెల్ ఒప్పందం కోసం దేశ ప్రయోజనాలు, భద్రత విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం రాజీ పడిందని, ఒప్పంద సమయంలో సంప్రదింపుల్లో పారదర్శకత లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. యుద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం నడుస్తోందని ఆయన అన్నారు. భారత్, ఫ్రాన్స్‌ల మధ్య కుదిరిన అవగాహన మేరకు ఒప్పందం వివరాల్ని పార్లమెంటుకు తెలిపేందుకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment